-బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులతో కలెక్టర్ ముఖాముఖి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ విధానం అమలు చెయ్యడం లో భాగంగా పరిపాలనా పరమైన ఖర్చులను మాత్రమే నిర్ణయించి, ఆమేరకు వసూలు చెయ్యడం జరగనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ధవళేశ్వరం గాయత్రి రీచ్ , కాతేరు ఇసుక డిసిల్టేషన్ పాయింట్స్ లని ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడి పరిస్థితిని అంచనా వేసి, బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులతో మాట్లాడడం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని డీసిల్టేషన్ స్టాక్ ఉన్న ఇసుక ను ఉచిత ఇసుక పంపిణీ విధానంలో ఇళ్ల నిర్మాణాలు కోసం సరఫరా చేసేలా పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ఆదేశించారు. ప్రస్తుతం గోదావరి నదికి వరదలు వొచ్చే సీజన్ నేపధ్యంలో ఆయా డీసిల్టేషన్ లు వద్ద స్టాక్ చేసి ఉంచిన ఇసుకను పంపిణీ చేసే ప్రక్రియ విషయంలో అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరీ నదీ పరివరక ప్రాంతంలో బోట్స్ ద్వారా తీసుకొని వొచ్చే ఇసుక రవాణా అంశాలపై అక్కడి వ్యక్తులతో కలెక్టర్ సంభాషించడం జరిగింది. సుమారు 250 పైగా బోట్స్ అందుబాటులొ ఉన్నట్లు, వాటి ద్వారా ప్రతి రోజు 4 నుంచి,5 ట్రిప్స్ తిప్పడం జరుగుతుందని వివరించారు. ఒక యూనిట్ ఇసుక కోసం 450 బకెట్స్ ఇసుక తీస్తామని, రెండు గంటల సమయంలో 5 యూనిట్స్ వరకూ ఇసుక తొడడడం జరుగుతుందని కలెక్టర్ కు తెలియ చేశారు.
కలెక్టర్ వెంట మునిసిపల్ కమీషనర్, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ కె. దినేష్ కుమార్, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, మైన్స్ సహాయ సంచాలకులు ఎమ్. సుబ్రహ్మణ్యం, రూరల్ తహసీల్దార్ వై వి కె అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News