-ఆర్వో ప్లాంట్ ద్వారా శుద్ధి చేసే నీటిని పిల్లలకు అందజేయాలి
-కలక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అంగన్వాడీ కేంద్రాలకు గ్రామ పంచాయతీల నుంచి కొళాయి కనెక్షన్ ద్వారా మంచినీటి సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో ఐసిడిఎస్ ఆర్డబ్ల్యూఎస్ పిఆర్ విద్యుత్ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు స్వచ్ఛమైన తాగునీరు అందజేయాలన్నారు. అందులో భాగంగా స్థానిక గ్రామపంచాయతీ ల నుంచి ట్యాప్ కనెక్షన్లను ఆయా అంగన్వాడి కేంద్రాలకు అనుసంధానం చేస్తూ చర్యలు చేపట్టాలని ఆ మేరకు ప్రతిపాదనను సిద్ధం చేయాలన్నారు. సదరు అంగన్వాడి కేంద్రాలకు పంచాయతి వాటర్ కనెక్షన్ ద్వారా సరఫరా చేస్తున్న నీటిని ఆర్వో ప్లాంట్ కు అనుసంధానం చెయ్యాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులకి మనం తీసుకునే త్రాగునీరు కూడా ఒక కారణం అని, ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ శుద్ధి చేసిన నీటిని మాత్రమే తీసుకొవడం జరుగుతున్నట్లు తెలిపారు. ఆమేరకు అధికారులు తగిన ప్రతిపాదనలతో రావాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా విషయంలో ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని పేర్కొన్నారు. ఐ సి డి ఎస్ అధికారులతో పంచాయతీ రాజ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయం చేసుకొని నివేదిక అందచేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్పిడి కే కృష్ణకుమారి, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి బి. వి. గిరి , ఎస్ ఈ (విద్యుత్) కే. తిలక్ కుమార్ , ఎస్ ఈ పంచాయతీ రాజ్ ఎండి అల్లిముల్లా, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News