-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో వర్షాల నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన భవనాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదకర భవనాల్లో నివసించకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు.
బుధవారం సాయంత్రం కమిషనర్ ధ్యానచంద్ర బిసెంట్ రోడ్, పున్నమిఘాట్, లేబర్ కాలనీ, హెచ్బీ కాలనీ, సితార సెంటర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా పాత భవనాలు, శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను పరిశీలించిన కమిషనర్, వర్షాల కారణంగా ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
లేబర్ కాలనీ, హెచ్బీ కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రమాదకరమైన పాత భవనాల్లో నివసిస్తున్న ప్రజలను అధికారులు వెంటనే గుర్తించి, వారికి పరిస్థితి తీవ్రతను వివరించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కమిషనర్ సూచించారు. నగరంలోని కొండ ప్రాంతాలు, ప్రమాదకర ప్రదేశాలు, శిథిలావస్థ భవనాల్లో నివసిస్తున్న ప్రజలను కూడా పట్టణ ప్రణాళిక అధికారులు గుర్తించి అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, పారిశుధ్యం, మౌలిక వసతులు తదితర సదుపాయాలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణ రక్షణే ప్రధాన లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని ఆయన కోరారు.
అనంతరం పున్నమిఘాట్లో జరగనున్న SARAS కార్యక్రమానికి సంబంధించి విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను కమిషనర్ పరిశీలించారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన వసతులను పూర్తిస్థాయిలో కల్పించాలని, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్, చీఫ్ ఇంజనీర్ పి. సత్యకుమారి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సి.హెచ్. నిర్మల గ్లోరీ, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ పి. అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News