Breaking News

మెగా డిఎస్సీ పోటీ పరీక్షల స్క్రీనింగ్ టెస్టు విజేతలకి శిక్షణా తరగతులు ప్రారంభం

-పోటీ పరీక్షలలో విజయం సాధించేందుకు ఇదొక సువర్ణావకాశం
-రాజమహేంద్రవరంలోబీసీ స్టడీ సర్కిల్ ను శిక్షణా కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ పి.ప్రశాంతి
-ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని శిక్షణ పొందేందుకు వచ్చిన అభ్యర్థులను అభినందించిన మంత్రి దుర్గేష్
-కష్టం, ప్రతిభను నమ్ముకునే వారికీ కూటమి ప్రభుత్వం చేయూత నిస్తుందన్న అభయమిచ్చిన మంత్రి దుర్గేష్
-ఎస్సీ యాక్షన్ ప్లాన్ లా త్వరలోనే బీసీ యాక్షన్ ప్లాన్.. తద్వారా యువతకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్న మంత్రి దుర్గేష్
-శిక్షణ కార్యక్రమం కు ఎంపికైన 136 బిసి, 40 ఎస్సి, 28 మంది ఎస్టీ విద్యార్థులు
-జిల్లాలో 14 ప్రదేశాల్లో బీసీ, ఎస్సీ హాస్టల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషిచేసిన కలెక్టర్ ను అభినందించిన మంత్రి దుర్గేష్
-ఫిడే వరల్డ్ ఛాంపియషిప్ విజేతగా నిలిచిన దొమ్మరాజు గుకేష్ కు అభినందనలు తెలిపిన మంత్రి దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని, భావి భారతానికి ఉపాధ్యాయులు రూపకర్తలని అటువంటి రంగాన్ని ఎంచుకొని శిక్షణ పొందుతున్న డీఎస్సీ అభ్యర్థులను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని బీసీ స్టడీ సర్కిల్ (వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రం) లో నిర్వహిస్తున్న ”మెగా డీఎస్సీ-2024-25 ఉచిత శిక్షణ తరగతులను” మంత్రి కందుల దుర్గేష్ శనివారం స్వయంగా పరిశీలించారు. అన్ని రంగాల్లో ప్రతిభను ప్రదర్శిస్తున్న వెనుకబడిన తరగతుల కులాల విద్యార్థులు మరింత కష్టపడి చదివి భవిష్యత్తులో అద్భుతమైన ఉపాధ్యాయుడిగా రాణించేందుకు ఇదొక సువర్ణ అవకాశమని, గొప్ప వేదిక అని మంత్రి పేర్కొన్నారు. బీసీ స్టడీ సర్కిళ్లలో డీఎస్సీకి అందిస్తున్న ఉచిత శిక్షణను బీసీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ లా త్వరలోనే బీసీ యాక్షన్ ప్లాన్ తీసుకొస్తామని తద్వారా అవకాశాలను మరింత మెరుగుపరుస్తామని, అందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో ఇదిగో డీఎస్సీ అదిగో డీఎస్సీ అంటూ ఊరించి అభ్యర్థులకు నిరాశ మిగిల్చిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 16 వేల పైచిలుకు పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించిందన్నారు. అంతేగాక భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా రాణించేందుకు శిక్షణ ఇచ్చేలా స్టడీ సర్కిల్ లు ఏర్పాటు చేసిందన్నారు.. అభ్యర్థులు కష్టం, ప్రతిభను నమ్ముకుని ముందుకు వెళ్తే కూటమి ప్రభుత్వం నూటికి నూరు శాతం చేయూతనిస్తుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి మరేది లేదని అలాంటి రంగాన్ని ఎంచుకున్నందుకు అభ్యర్థులను అభినందించిన మంత్రి దుర్గేష్ , కష్టపడి చదివి డిఎస్సి సాధించి ఉపాధ్యాయులుగా రాణించాలని ఈ సందర్భంగా అభ్యర్థులకు సూచించారు. విజయానికి షార్ట్ కట్ అంటూ ఏమీ ఉండదని కష్టపడి చదవడమే విజయానికి ఏకైక మార్గమని ప్రేరేపించారు. 90 శాతం కష్టం, 10 శాతం అదృష్టం కలిసి వస్తే విజయం వరిస్తుందన్నారు.

13 డిసెంబర్ 2024న ప్రారంభించిన మెగా డీఎస్సీ ఉచిత శిక్షణ తరగతులు 12 ఫిబ్రవరి,2025 వరకు కొన సాగుతాయని తెలిపారు. పోటీతత్వంతో విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు స్టడీ సర్కిల్ లు వేదికగా నిలుస్తాయన్నారు. కష్టపడి చదివితే సాధించలేనిది ఏదీ ఉండదని, బాగా చదివి కన్నవారికి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా అభ్యర్థులకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. అదేవిధంగా 14 ప్రదేశాల్లో బీసీ, ఎస్సీ హాస్టల్లో సిఎస్ఆర్ ఫండ్ ద్వారా నిధులు వినియోగించి మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్న కలెక్టర్ ప్రశాంతిని మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్ సంఖ్యకు కారణమైన అంశాన్ని గుర్తించి సంబంధిత సౌకర్యాల కల్పనకు కలెక్టర్ కృషి చేస్తున్న తీరుపై హర్షం వ్యక్తం చేశారు.. త్వరలోనే ఎస్సీ, బీసీ హాస్టల్లో మరి మెరుగైన వసతులు కల్పించే దిశగా కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. 18 ఏళ్ల ప్రాయంలోనే ఫిడే వరల్డ్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచిన దొమ్మరాజు గుకేష్ కు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, పోటీ పరీక్షలలో విజయం సాధించడం లో సబ్జెక్టు పై అవగాహన, చిత్తశుద్ధి, దృఢ సంకల్పం ఉండాలన్నారు. బిసి స్టడీ సర్కిల్ లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం సి ఎస్ ఆర్ కార్యకలాపాలు కింద పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. మెగా డిఎస్సీ స్క్రీనింగ్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉచిత శిక్షణ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఇందుకోసం 220 మందికి ఇక్కడ శిక్షణా కార్యక్రమాలను అనుభవజ్ఞులైన ఉపాద్యాయులు ద్వారా అందించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి స్ఫూర్తి పెంపొందించేలా అడుగులు వేయడం జరుగుతోంది అని పేర్కొన్నారు. గ్రూప్ వన్ తదితర పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి నేడు ఈ స్థానంలో నిలవడం జరిగిందని, జిల్లా అధికారులు ద్వారా మీలో ప్రేరణ కలిగించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్ట్స్ కళాశాలలో ఉన్న గ్రంథాలయం ఉస్మానియా తదితర విశ్వ విద్యాలయాలకు సరిసమానంగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని , బిసి స్టడీ సర్కిల్ లో శిక్షణా తరగతులకు హాజరు అయ్యే అభ్యర్థులకు ఆ గ్రంథలయం పుస్తకాలు అందుబాటులో తీసుకుని రానున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. సరిన్స్ మార్గదర్శనం ఉంటే పోటీ పరీక్షలలో విజయం సాధించడం సులభం అవుతుందని, ఐ ఐ టి., న్యూ ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంగణం నుంచి వచ్చిన వాళ్ళు ఐ ఎ ఎస్ లు ఎక్కువగా సాధించడానికి అక్కడ ఉన్న బోధకులు కారణం అన్నారు.

రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ, బీసీ స్టడీ సర్కిల్ లో శిక్షణా తరగతుల సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని అభిలాష వ్యక్తం చేశారు.

రాజమండ్రీ అర్బన్ శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసు మాట్లాడుతూ, గత ప్రభుత్వం హయాంలో డి ఎస్సి నిర్వహించలేదని తెలిపారు. అందువల్ల స్కూల్స్ లో అవసరమైన బోధన సిబ్బంది లేక విద్యా ప్రమాణాలు తగ్గినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం కి విద్యా ప్రమాణాలు మరింత పెంచే చిత్తశుద్ధి ఉందన్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ ని ప్రకటించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఎప్పటి కప్పుడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, బిసి స్టడీ సర్కిల్ ఇన్చార్జి డైరెక్టర్ కే ఎన్ జ్యోతి, బీసీ సంక్షేమ అధికారి పి ఎమ్ రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ సూర్య ప్రకాశరావు, సాంఘిక సంక్షేమ, బిసి సంక్షేమ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల వార్డెన్స్, డిఎస్సీ స్క్రీనింగ్ పరీక్షలలో విజయం సాధించిన అభ్యర్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *