– ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్ట అమలుపై ప్రత్యేక దృష్టిపెట్టండి
– నిబంధనల ఉల్లంఘనకు చట్టపర చర్యలు తప్పవు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్ట అమలుపై ప్రత్యేక దృష్టిపెట్టాలని.. రేషన్ దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్లను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. బుధవారం ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు తీరుతెన్నులు, చేపట్టాల్సిన తనిఖీలు, ఉల్లంఘనలపై కేసుల నమోదు తదితర అంశాలపై పౌర సరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. వీసీ అనంతరం కలెక్టర్ లక్ష్మీశ.. పౌర సరఫరాల అధికారులతో మాట్లాడుతూ జిల్లాలోని 957 రేషన్ దుకాణాలను, ఏడు ఎంఎల్ఎస్ పాయింట్లలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి, నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు. పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు ప్రతినెలా 20 దుకాణాలను తనిఖీ చేయాల్సిందేనని.. అదేవిధంగా తహసీల్దార్లు నెలకు అయిదు దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. పౌర సరఫరాల డీఎం, జిల్లా పౌర సరఫరాల అధికారి ఎంఎల్ఎస్ పాయింట్లను తనిఖీ చేయాలన్నారు. 2024, జులై నుంచి డిసెంబర్ వరకు 6ఏ కేసులు 119 నమోదయ్యాయని.. ఇకపైనా క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఉల్లంఘనలపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఎండీయూ ఆపరేటర్లు పూర్తిస్థాయిలో అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించడం ముఖ్యమని.. వారు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సరుకులు అందజేసేలా చూడాలన్నారు. జిల్లాలో రైతుల నుంచి ధాన్యం సేకరణపైనా కలెక్టర్ పౌర సరఫరాల అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు 16,217 మంది రైతుల నుంచి రూ. 254 కోట్ల విలువైన 1,09,665 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. సమావేశంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ ఎం.శ్రీనివాసు, డీఎస్వో ఎ.పాపారావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News