విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ వైద్యులు, సామాజిక సేవకులు, నాస్తికోద్యమ నాయకులైన గోరా – సరస్వతీ గోరా నాల్గవ కుమార్తె డా॥మారు (80) ఈ రోజు (ఫిబ్రవరి 6, గురువారం) మధ్యాహ్నం స్వల్ప అనారోగ్యంతో కన్ను మూసారు. ఆమె ప్రముఖ వైద్యులు డా||సమరం సోదరి. ఇద్దరూ విజయవాడలో గత 55సంవత్సరాలుగా వాసవ్య నర్సింగ్ హెూమ్ ద్వారా సేవలందిస్తున్నారు. ఆమె అనేక గ్రామాల్లోనూ, గిరిజన ప్రాంతాల్లోనూ సేవలందించడమే కాకుండా మూఢనమ్మకాల నిర్మూలనకి ఎంతో కృషి చేసారు. కొన్ని వేలమంది పోలియో చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయడంలోనూ, వేల శుక్లాల ఆపరేషన్లు చేయించడంలోనూ, వందలాదిమందికి నర్సింగ్ ట్రైనింగ్ ఉచితంగా అందించడంలోనూ ఆమె ప్రముఖ పాత్ర వహించారు. నాస్తికోద్యమ కార్యక్రమాల్లో సక్రియంగా పాల్గొన్నారు. విజయవాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యకలాపాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. ఆమె మృతి విషయం తెలియగానే వందలాదిమంది అభిమానులు, వైద్యసేవలు పొందినవారు, వైద్యులు తరలి వచ్చి నివాళులర్పించారు. కుటుంబసభ్యులు ఆమె నేత్రాలను స్వేచ్ఛా గోరా ఐ బ్యాంకు దానం చేసారు. ప్రముఖ సంఘ సేవకులైన ఆమె భర్త శ్రీ హరి సుబ్రహ్మణ్యం, ఏకైక కుమారుడు డా॥ ఓలాస్ గోరా, కోడలు డా॥ సుదీప్తివర్ధన్, మనుమడు సాహస్ తుది ఘడియల్లో ఆమె చెంతనే ఉ న్నారు. ఆమె అంతిమయాత్ర రేపు మధ్యాహ్నం 3గంటలకి విజయవాడ నాస్తికకేంద్రంలో ప్రారంభం అవుతుందని నాస్తికకేంద్రం తెలియచేసింది.
Prajavartha Online Telugu News