మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రక్తహీనతకు, అనారోగ్య సమస్యలకు కారణమవుతున్న నులిపురుగులను నివారించి ఆరోగ్యకర జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.
“జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం”(డివార్మింగ్ డే)సందర్భంగా సోమవారం నగరంలోని పోర్ట్ రోడ్ లోని ప్రభుత్వ రాంజీ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలను వేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో
మూడు లక్షల 49వేలకు పైగా పిల్లలకు ఉచిత నులి పురుగుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలో ఉన్న 1నుంచి 19 సంవత్సరాల వయసు లోపు పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయాలని సంబంధిత అధికారులు సూచించారు. నులి పురుగులు ప్రమాదకరమైనవని, వీటి వల్ల రక్తహీనతతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, వీటిని నివారిస్తే ఆరోగ్యంగా వుండవచ్చన్నారు. నులి పురుగుల నియంత్రణ కీలకమైన అంశమని, దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వైద్య ఆరోగ్య, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, పైవ్రేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో
నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.జిల్లాలోని అంగన్‌వాడి కేంద్రాలు, ప్రభుత్వ, ఎయిడెడ్, పైవ్రేట్ పాఠశాలలో, జూనియర్ కళాశాలలో జిల్లా వ్యాప్తంగా గుర్తించిన మూడు లక్షల 49 వేల 138 మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలను పంపిణి చేయడం జరిగిందన్నారు. ఆశా వర్క ర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, స్వయం సహాయక బృందాలు, తల్లిదండ్రులు ఇతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ఆల్బెండజోల్ మందు విషయంలో తల్లిదండ్రులు అపోహలు వీడాలని ఇది పూర్తి సురక్షితమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.
ఆల్బెండజోల్ మాత్రలు వాడటం వల్ల కడుపులోని నులిపురుగులు నిర్మూలించడం వల్ల రక్తహీనత నియంత్రణలోకి వస్తుందన్నారు. పోషకాహార అవసరాన్ని మెరుగు పరిచి వ్యాధి నిరోధకత మెరుగవుతుందన్నారు. తద్వారా చదువులు ఏకాగ్రత సామర్థ్యం మెరుగుపడతాయని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.
కార్యక్రమంలో డిఎంఅండ్ హెచ్ ఓ డాక్టర్ షర్మిష్ఠ, డిప్యూటీ డిఇఓ బి. శేఖర్ సింగ్, ఎంఈఓ లు వైయస్ఆర్కే గురు ప్రసాద్, ఎంవి ఎస్ డి ప్రసాద్, పాఠశాల హెచ్ఎం పద్మావతి ఉన్నారు.
Prajavartha Online Telugu News