గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణ పనుల నిలిపివేత ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ తదుపరి నిర్మాణ పనులు చేయడం, నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారుల పర్యవేక్షణ లోపం తదితర అంశాల పై నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు ఆధ్వర్యంలో ఉన్నత స్తాయి అధికారుల కమిటీ ఏర్పాటు చేశామని, సదరు అపార్ట్మెంట్ కు పూర్తి స్తాయి అధికారిక అనుమతులు లేవని, కమిటీ నివేదిక మేరకు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశమందిరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ ను సదరు యాజమాన్యం నగర పాలక సంస్థ నుండి చట్టబద్దత, నిర్దేశిత అనుమతులు లేకుండా కేవలం డీమ్డ్ ప్లాన్ తో నిర్మాణ పనులు చేట్టిందని, గత ఏడాది తాము కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పూర్తి స్తాయిలో అందుబాటులో ఉన్న డాక్యుమెంట్స్ ను పరిశీలించిన తరువాత ప్రభుత్వానికి అపార్ట్మెంట్ అనుమతుల్లో 19 మంది అధికారుల పాత్రపై సమగ్ర నివేదిక పంపామన్నారు. గతే ఏడాది ఆగస్ట్ 21 న తాము సదరు అపార్ట్మెంట్ నిర్మాణ పనులను, పరిసరాలను సమగ్రంగా పరిశీలించి అప్పటివరకు పలు దఫాలుగా నగర పాలక సంస్థ ఇచ్చిన షార్ట్ ఫాల్ నోటీసు లను, రైల్వే, పోల్యుషణ్ కంట్రోల్ బోర్డు, ఫైర్ డిపార్టుమెంటుల యన్.ఓ.సి లను పరిశీలించి తక్షణం నిర్మాణ పనుల ఆపాలని స్టాప్ నోటీసులను జారీ చేశామన్నారు. 2023లోనే రైల్వే శాఖ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ కు తాము జారీ చేసిన యన్.ఓ.సి ని రద్దు చేసిందని, సదరు రద్దు డాక్యుమెంట్ లను నాటి పట్టణ ప్రణాళిక ఉన్నతాధికారులకు ఇవ్వలేదన్నారు. తదుపరి పట్టణ ప్రణాళిక అధికారులను పనులు జరగకుండా పర్యవేక్షించాలని ఆదేశించామని, అయినప్పటికీ పనులు జరుగుతున్నట్లు పలు ఆరోపణలు వచ్చాయన్నారు. ఆదివారం సదరు అపార్ట్మెంట్ లో ఒక ప్లాట్ యజమాని గృహప్రవేశం కూడా చేశారని మీడియా ముఖంగా తెలియగానే అదనపు కమిషనర్ ఆధ్వర్యంలో పట్టణ ప్రణాళిక, డిప్యుటీ కమిషనర్, ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. సదరు అధికారుల బృందం గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ ను పరిశీలించి ఇచ్చిన నివేదికను పరిశీలించి బాధ్యులైన అధికారులు మరియు అపార్ట్మెంట్ యజమాని పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సదరు కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటి కమిషనర్ సి.హెచ్ శ్రీనివసరావు, సిటీ ప్లానర్ రాంబాబు, డి.సి.పి సూరజ్, ఈ.ఈ కోటేశ్వర రావు, యస్.యస్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News