-ప్రాథమిక విచారణ నిర్వహించకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
– రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల పై దీని ప్రభావం పడుతుంది.
– వక్ఫ్ పరిపాలన యొక్క విశ్వసనీయత సామర్థ్యం దెబ్బతింటాయి.
– రాష్ట్ర స్థాయి ల్యాండ్ ప్రొటెక్షన్ కమిటీలో డిజిపి సభ్యులుగా ఉన్నారు.
– వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో డిజిపి పాలుపంచుకోవాలి.
– తక్షణమే వక్ఫ్ ఇన్స్పెక్టర్ పై నమోదు చేసిన అక్రమ ఎఫ్ఐఆర్ ను మూసివేయాలి.
– షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో భాగంగా కబ్జాదారులపై నమోదు చేయాల్సిన కేసును ఆస్తులు పరిరక్షిస్తున్న వక్ఫ్ ఇన్స్పెక్టర్ పై నమోదు చేశారని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మండిపడ్డారు. చిత్తూరు జిల్లా ఇన్స్పెక్టర్ ఆడిటర్ వక్ఫ్ పై నమోదు చేసిన అక్రమ ఎఫ్ఐఆర్ ను వెంటనే మూసి వేయాలని ఆంధ్రా రాష్ట్ర డీజీపీ కు ఆయన లేఖ రాశారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు. చిత్తూరు లోని ఇక్తేదార్ అలీ ఖాన్ షాహిద్ దర్గా కు చెందిన వక్ఫ్ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించారని, ఆక్రమణ దారులకు వక్ఫ్ చట్టం 1995 ప్రకారం నోటీసులు జారీ చేయబడ్డాయి అని ఆయన తెలిపారు. ఆక్రమణదారుల పై వక్ఫ్ ఇన్స్పెక్టర్ చిత్తూరు ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారని అన్నారు. అక్రమ నిర్మాణాలను నిలిపివేశారన్న అక్కసుతో వక్ఫ్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోకుండా, కబ్జాదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ చేపట్టకుండానే వక్ఫ్ అధికారిపై చిత్తూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. చిత్తూరు లో, వక్ఫ్ ఆస్తి హక్కుల ఉల్లంఘన స్పష్టంగా జరిగినా ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఆస్తులు పరిరక్షిస్తున్న ఉద్యోగిపై తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడడమే కాక, వక్ఫ్ పరిపాలన యొక్క విశ్వసనీయత, సామర్థ్యం దెబ్బతింటాయని ఆవేదన వ్యక్త పరిచారు. అధికారులపై తప్పుడు కేసులు నమోదైతే అధికారులు నిరుత్సాహానికి గురవుతారని ఇది అత్యధిక అక్రమ ఆక్రమణలకు దారి తీస్తుందని, దీనితో ప్రభుత్వానికి తీరని నష్టం కలుగుతుందని అన్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కమీషనర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి ల్యాండ్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేశారని అందులో రాష్ట్ర డీజీపీ సభ్యులుగా ఉన్నారని తెలిపారు. అదే కాక జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ల్యాండ్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేశారని అందులో జిల్లా ఎస్పీ సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీల ప్రాథమిక బాధ్యత వక్ఫ్ భూములను అక్రమదారుల నుండి రక్షించడమేనని అన్నారు. డీజీపీ తక్షణమే జోక్యం చేసుకుని, చిత్తూరు జిల్లా ఇన్స్పెక్టర్ ఆడిటర్ ఆఫ్ వక్ఫ్ పై నమోదు చేసిన అక్రమ ఎఫ్ఐఆర్ ను వెంటనే మూసి వేయాలని అన్నారు. వక్ఫ్ ఆస్తులను అనధికారికంగా ఆక్రమించినందుకు, అక్రమ నిర్మాణాలు చేపట్టినందుకు ఆక్రమణదారుల పై ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా జిల్లా ఎస్పీ ను ఆదేశించాలని ఆయన సూచించారు. వక్ఫ్ చట్టం 1995 కఠినంగా అమలు చేసేలా టాస్క్ ఫోర్స్ కమిటీ బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చేలా, రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వక్ఫ్ అధికారులపై అక్రమ కేసులు నమోదు చేసే ముందు శ్రద్ధ వహించేలా వారి చట్టబద్ధమైన విధులను వారిని చేసుకోనిచ్చేలా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులను ఆదేశించాలని ఆయన సూచించారు.
Prajavartha Online Telugu News