– జగన్ హయంలో బియ్యం దొంగల్ని, మట్టి మాఫియాను చట్ట సభలకు పంపించారు
– ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీలో నినాదాలు సిగ్గుచేటు
– ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న జగన్ రెడ్డికి బుద్ధి చెబుదాం
– ప్రజల కోసం పాటు పడుతున్న కూటమి అభ్యర్ధిని గెలిపించుకుందామని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాన్ని అధ్వాన్నంగా మార్చిన వారికి శాసన మండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్ధిని గెలిపించుకుని గుణపాఠం చెబుదామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పామర్రు నియోజకవర్గం తొట్లవల్లూరు మండలంలో ఏర్పాటు చేసిన శాసన మండలి ఎన్నికల సన్నాహక సమావేశంలో ఇంఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ తో కలిసి పాల్గొన్నారు. విభజన జరిగిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చేసిన ప్రయత్నాలన్నింటినీ జగన్ రెడ్డి నాశనం చేశాడు. 151 సీట్లు వచ్చాయనే గర్వంతో వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేశాడు. నదుల అనుసంధానంతో నీటిని కాపాడుకునేందుకు కట్టిన పట్టిసీమను దండగ అన్నారు. నాటి చంద్రబాబు చొరవతోనే నేడు కృష్ణా డెల్టా పచ్చగా ఉంది. పోలవరం, అమరావతి సహా అన్ని రకాల పనుల్ని నిలిపివేశాడు. అలాంటి అరాచకాల నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రజలు కూటమికి మద్దతుగా నిలిచారు. భారీ మెజార్టీతో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
మొన్న ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని శాసన మండలికి పంపించాలని అధినేత నిర్ణయించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి నిలిచిన వ్యక్తిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. బూత్‌ల వారీగా ఓటర్లను గుర్తించి ప్రతి ఓటు కూడా కూటమి అభ్యర్ధికి నమోదు అయ్యేలా చూడాలి. చివరి ఓటు పోలయ్యే వరకు కూడా ఏజెంట్లు అందుబాటులో ఉండాలి. ఓటు నమోదుపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించండి. విద్య, ఉద్యోగాల కోసం బయటకు వెళ్లిన వారిని స్వగ్రామాలకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలి. నూటికి నూరు శాతం ఓటింగ్ జరగాలి. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత మనపైనే ఉంది.
రైతులు పంటను మిల్లుకు తరలించిన 24 గంటల్లోనే డబ్బులు జమచేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. నూటికి నూరు శాతం ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. కాలువలు, డ్రైన్ల పనులు ఇప్పటికే పూర్తి చేశాం. ఏప్రిల్లోనే పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నాం. నీటి సంఘాలను ఏర్పాటు చేసుకుని రైతాంగానికి తోడుగా నిలుస్తున్నాం.
కేసుల్ని విచారిస్తున్న అధికారుల బట్టలు ఊడదీస్తానని జగన్ రెడ్డి బెదిరించడం సిగ్గుచేటు. ప్రజలు గుడ్డలూడదీస్తే ప్రతిపక్ష హోదా కావాలంటూ అరిచి గగ్గోలు పెడుతున్నావ్. ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే.. మిగిలిన సీట్లు కూడా దూరం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గవర్నర్ చదువుతున్నపుడు.. ప్రతిపక్ష హోదా కావాలంటూ బాయ్ కాట్ చేయడం సిగ్గుచేటు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే.. అసెంబ్లీలో వచ్చి అడగడానికి సిగ్గుండాలి.
జగన్ రెడ్డి హయాంలో.. అసెంబ్లీకి బూతులు మాట్లాడేవారు, బియ్యం దొంగలు, మట్టి మాఫియా లీడర్లను తరలించారు. జిల్లా ప్రతిష్టను దెబ్బతీశారు. కానీ నేడు జిల్లాను, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారు. కృష్ణా డెల్టాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉంది. నదులన్నింటినీ అనుసంధానించేలాప్రణాళిక రచిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లేశాం.
త్వరలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి సంక్షేమ పథకాలను ప్రారంభించబోతున్నాం. ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని భారీ మెజార్టీతో గెలిపించుకుని కూటమి ప్రభుత్వానికి మద్దతు పలకాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News