Breaking News

బాల్య వివాహ రహిత సమాజం కోసం సమష్టి కృషి అవసరం

– బాల్య వివాహాల దుష్ప‌రిణామాల‌పై విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించాలి
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాల్య వివాహ ర‌హిత స‌మాజం కోసం స‌మ‌ష్టిగా కృషిచేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని.. బాల్య వివాహాల దుష్ప‌రిణామాల‌పై ప్ర‌జ‌ల్లో విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించాలని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.
ఈ నెల 8న అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని జిల్లా మ‌హిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం న‌గ‌రంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో భాగంగా విజ‌య‌వాడ సివిల్ కోర్టు స‌మీపంలోని వ‌ర్కింగ్ ఉమెన్స్ హాస్ట‌ల్‌, చిల్డ్ర‌న్ హోం ప్రాంగ‌ణంలో బాల్య వివాహాల నిర్మూలనపై నిర్వ‌హించిన కొవ్వొత్తుల ర్యాలీలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పాల్గొన్నారు. బాల్య వివాహాల‌కు వ్య‌తిరేకంగా సిగ్నేచ‌ర్ క్యాంప‌యిన్‌ను కూడా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ బాల్య వివాహం అనేది ఓ సాంఘిక దురాచార‌మ‌ని, అది బాలిక‌ల‌ను విద్య‌, ఆరోగ్యం, అభివృద్ధికి ఆటంకం క‌లిగించ‌డమే కాకుండా బంగారు భ‌విష్య‌త్తును దూరం చేస్తుంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో స‌మాజంలోని ప్ర‌తిఒక్క‌రూ బాల్య వివాహాల‌కు వ్య‌తిరేకంగా వీలైనంత మేర ప్ర‌య‌త్నం చేయాల‌న్నారు. బాల్య వివాహాల‌ను అడ్డుకునేందుకు చేసిన చ‌ట్టాలు, ప్ర‌భుత్వాలు అమ‌లుచేస్తున్న కార్య‌క్ర‌మాలు, విధానాల ప‌టిష్ట అమ‌ల్లో మ‌హిళాభివృద్ధి, విద్య‌, వైద్య ఆరోగ్యం, పోలీస్ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌న్నారు. బాలిక‌ల విద్య‌కు ప్రాధాన్య‌మిస్తూ.. ఆర్థికంతో పాటు అన్ని రంగాల్లోనూ సాధికార‌త దిశ‌గా న‌డిపించేందుకు చేయిప‌ట్టి చేయూత‌నివ్వాల‌ని క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు.
కార్య‌క్ర‌మంలో జిల్లా మ‌హిళాభివృద్ధి, శిశు సంక్షేమ అధికారి డి.శ్రీల‌క్ష్మి, నోడ‌ల్ అధికారి సీహెచ్ సాయిగీత‌, సీడీపీవోలు జ్యోత్స్న‌, జి.మంగ‌మ్మ‌, చైల్డ్ ప్రొటెక్ష‌న్ ఆఫీస‌ర్ ఎం.రాజ‌రాజేశ్వ‌ర‌రావు, అంగ‌న్వాడీ కార్య‌క‌ర్త‌లు, సూప‌ర్వైజ‌ర్లు, మ‌హిళ‌లు, చిన్నారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *