-ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ ద్వారా సలహాలు అడిగాం
-వక్ఫ్ ఆస్తులు అమ్ముతున్నామనేది అబద్ద ప్రచారం
-వక్ఫ్ బోర్డు 3 సంవత్సరాల కాలపరిమితితో మాత్రమే లీజుకు ఇస్తుంది
-200 మంది విద్యార్థులను ఐఐటీ, ఐఐఎమ్ కోర్సుల్లో చదివిస్తాం
-రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వక్ఫ్ బోర్డు ఆస్తులు అమ్ముతున్నాం అనే ప్రచారం అబద్ధమని ఆ వార్తలను ఖండిస్తున్నామని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు.. వన్ టౌన్ లో గల రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఆస్తులపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచించి నిర్ణయాలు చేస్తామన్నారు. 69 వేల ఎకరాల పైచిలుక వక్ఫ్ బోర్డు భూములు ఉండగా అందులో 36,000 ఎకరాల భూములు ఆక్రమణలో ఉన్నాయన్నారు. మిగిలిన భూముల నుంచి వచ్చే రెవెన్యూ ద్వారానే వక్ఫ్ బోర్డు ఉద్యోగులకు జీతాలు, పేద ముస్లింలకు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఏ పని చేయాలి అన్నా నిధులు అవసరం ఎంతైనా ఉంటుందన్నారు.
ఏపీ వక్ఫ్ బోర్డు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నారు. వక్ఫ్ బోర్డు ఆదాయం పెంచేందుకు ఖాళీగా ఉన్న వక్ఫ్ బోర్డు స్థలాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (Expression of Interest) ఇవ్వమని వివిధ సంస్థలను కోరామన్నారు. అందుకు చాలా సంస్థలు ముందుకు రాగా ముఖ్యంగా యూకే, దుబాయ్ దేశాల నుండి వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చారన్నారు. అలా ఐడియాలు ఇచ్చిన సంస్థలు, వాటి పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపితే వారి సూచనలను భట్టి ఆ తర్వాత టెండర్లకు వెళ్లటమా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు వక్ఫ్ బోర్డు ముందుకు వెళ్లుతుందన్నారు. ఇది టెండర్ల ప్రక్రియ కాదన్నారు. ఉమ్మడి ఏపీలో వక్ఫ్ బోర్డు కోస్తా అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు. గతంలో ముస్లిం లకు వివిధ పథకాలు కావాలి అంటే వక్ఫ్ బోర్డు నుంచి వస్తాయి అనుకునే వాళ్ళమన్నారు. వక్ఫ్ బోర్డు ఆదాయం ఎలా పెంచాలా అని అధికారులతో సమాలోచనలు చేస్తున్నామన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి వుండేవన్నారు. ఈ రోజుకి వక్ఫ్ బోర్డు ఆస్తులు, రికార్డులు తెలంగాణ లోనే ఉన్నాయని, 70 శాతం నిధులు అక్కడే ఆగిపోయాయన్నారు. నేను చైర్మన్ అయిన తరువాత తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ ను కలవటం జరిగిందన్నారు. రంజాన్ అయిన తర్వాత మీరు అధికారికంగా డెలిగేషన్ తో రావాలని వారు చెప్పారన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం కావటానికి ముఖ్య కారణం ఈ ఆస్తులను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక పోవటమేనన్నారు. ముఖ్యమంత్రి మాకు ఒకటే చెప్పారని హిందూ దేవాలయాల ఆస్తులు ఏ విధంగా కాపాడుతారో అదే విధంగా వక్ఫ్ బోర్డు ఆస్తులను కూడా కాపాడాలన్నారు..
ముస్లిం బిడ్డలు కార్పొరేట్ విద్యలు చదువుకోలేని పరిస్థితి లో ఉన్నారని వారికి టాలెంట్ టెస్ట్ నిర్వహించి కార్పొరేట్ విద్యను వారికి అందిస్తామన్నారు. 200 మంది పేద ముస్లిం వర్గానికి చెందిన 10 వ తరగతి పాస్ అయిన పిల్లలకు టాలెంట్ టెస్ట్ నిర్వహించి ఇంటర్ లో కార్పొరేట్ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు ఇప్పిస్తామన్నారు. ఆపైన ఐఐటీ, ఐఐఎమ్ చదివించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అదేవిధంగా స్కిల్ డెవలప్ మెంట్ కోర్సుల్లో కూడా విద్యార్థులకు శిక్షణ అందిస్తామన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ ల నుంచి రెంట్స్ తక్కువగా వస్తుందని, నికరంగా అన్ని టాక్స్ లు పోను రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు 6 శాతం మాత్రమే వస్తుందన్నారు. వక్ఫ్ బోర్డ్ కు సంబంధించి వచ్చే రెంట్స్ పై రెంట్ రివ్యూ కమిటీ వేయాలన్నారు. చిన్న చిన్న షాపు లకు రూ. 200, 300 ల అద్దె ఇచ్చే పరిస్థితి నేడు వుందన్నారు. వేరు వేరు సంస్థల పేర్లు మీద వక్ఫ్ ఆస్తులు ఉన్నాయన్నారు. మసీదులకు మా తాతలు ధర్మకర్తలుగా ముతావల్లీలుగా వున్నారని వాళ్లు 11 నెలలు వరకు వక్ఫ్ బోర్డు ఆస్తులు లీజుకు ఇవ్వొచ్చని, వక్ఫ్ బోర్డు 3 ఏళ్లకు లీజు ఇచ్చే అవకాశం ఉందని, మూడు ఏళ్ళు పూర్తి అయితే రాష్ట్ర ప్రభుత్వం లీజుకు ఇస్తుందన్నారు.
వక్ఫ్ బోర్డు ఆస్తులు దేవుడి ఆస్తులని ఎవ్వరికీ అమ్మటం కుదరదని, కేవలం లీజు కి మాత్రమే ఇస్తామన్నారు. వక్ప్ బోర్డు ఆస్తి అంటే దేవుడి ఆస్తి అని దానికి బోర్డు చైర్మన్, సభ్యులు ధర్మకర్తలుగా మాత్రమే ఉంటామని అంతేకాకుండా ఆ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడే బాధ్యత మా పై ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని భక్తితో చూసినట్టు వక్ఫ్ బోర్డు ఆస్తులను కూడా అలాగే చూస్తారని, ముఖ్యమంత్రి నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ముకానివ్వనని అంతేకాకుండా వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడతానన్నారు. పీఎంజేవీకే (PMJVK-Pradhan Manthri Jan Vikas Karyakram) క్రింద స్కూల్స్, కమ్యూనిటీ హాల్స్, సోలార్ ప్రాజెక్ట్స్ నిర్మించేందుకు 60 శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుందన్నారు.
దేవుడి ఆస్తి కాపాడి పేద ప్రజలకు మేలు చేయాలనే ఆశతో ఉన్నామన్నారు. ఏప్రిల్ 1 నుండి వక్ఫ్ బోర్డు లావాదేవీలన్నీ ఆన్ లైన్ లోనే నిర్వహిస్తున్నామన్నారు. వక్ఫ్ బోర్డు నుంచి వచ్చే ఆదాయం నుంచే సిబ్బంది జీత భత్యాలు చెల్లించాల్సి ఉందన్నారు. కమర్షియల్ భూములను ఖాళీగా ఉంచకుండా లీజ్‌కు ఇవ్వడం వల్ల వక్ఫ్ బోర్డుకు ఆధాయం వస్తుందన్నారు. లీజు ఆస్తులపై వచ్చే రెవెన్యూ మాత్రం ముస్లిం మతానికి చెందిన పేదలు, వితంతువులు, అనాధలకు మాత్రమే అందిస్తామన్నారు. మంచి చేయాలనే సంకల్పంతో ఉన్న వక్ఫ్ బోర్డుకు అందరూ సహకరించాలని కోరుతున్నానని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలియజేశారు.
Prajavartha Online Telugu News