– 2025-26లో 80 లక్షల ఉపాధి హామీ పనిదినాలు లక్ష్యం
– మండలాల వారీగా లక్ష్యాల సాధనకు అధికారులు కృషిచేయాలి
– పథకం లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరేలా పనిచేయాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం ద్వారా జిల్లాలోని అన్ని మండలాల్లో, గ్రామాల్లో వేతనదారులకు పని కల్పించడంలోనూ, సగటు దినసరి వేతనం రూ. 307 వచ్చేలా చూడటంలోనూ నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
బుధవారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి డ్వామా అధికారులతో కలిసి ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బందితో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరుతెన్నులతో పాటు సగటు రోజువారీ వేతనాలు, గ్రామాల వారీగా వేతనదారుల హాజరు, వారికి అందుతున్న వేతనం తదితరాల్లో పురోగతిని సమీక్షించారు. 2025-26కు గాను జిల్లాలో 80 లక్షల పనిదినాలను లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని, ఈ నేపథ్యంలో గతేడాది గణాంకాల ఆధారంగా ఈ ఏడాది మండలాలు, రోజుల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది కృషిచేయాలని ఆదేశించారు. ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు 2,737 పంట కుంటల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించగా, 69 కుంటల నిర్మాణం 100 శాతం పూర్తయిందని, మరో 1,029 పంట కుంటలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వీటిని త్వరితగతిన పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పంట కుంటలపై సచివాలయం స్థాయిలోని వ్యవసాయ, ఉద్యాన శాఖ సిబ్బంది రైతులకు అవగాహన కల్పించి, సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. వేసవిలో పశువులతో పాటు గొర్రెలు, మేకలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉపాధి హామీ పథకం అనుసంధానంతో నీటి తొట్టెలను ఏర్పాటు చేయడం జరుగుతోందని.. పశు సంవర్థక శాఖ 277 తొట్టెల పనులను గుర్తించి, పనులు చేపట్టడం జరిగిందని, మిగిలిన వాటికి సంబంధించిన పరిపాలనా అనుమతుల ప్రక్రియ ఈ నెల 12 నాటికి పూర్తిచేయాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యాన పంటల సాగుకు 2025-26లో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం 20 ఎకరాలను గుర్తించాలని, జిల్లా లక్ష్యం 4,000 ఎకరాలుగా ఉందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
సమావేశంలో డ్వామా పీడీ ఎ.రాము, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News