గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ రహదారిపై వాహన ప్రమాదాలను నివారించేందుకు గుర్తించిన బ్లాక్ స్పాట్ లు వద్ద అవసరమైన విస్తరణ, మరమ్మత్తు, ఇండికేషన్ బోర్డులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ లోని డీఆర్సీ సమావేశమందిరంలో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా తో కలసి జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశంలో పాల్గోన్నారు. ఈ సంధర్భంగా జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి పై వాహన ప్రమాదాలకు అవకాశం ఉన్న 19 ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్ లను జాయింట్ పరిశీలన కమిటీ గుర్తించిందని, వారి సిఫార్సులు మేరకు అవసరమైన పనులు వెంటనే చేపట్టాలన్నారు. జాతీయ రహదారి విస్తరణ పెండింగ్ ఉన్న ఖాజా, పెదకాకాని వద్ద భూసేకరణ ప్రక్రియ వెంటనే పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. స్థానిక సంస్థల్లో వ్యర్ధాలు తరలిస్తున్న వాహనాలు నుంచి చెత్త జాతీయ రహదారి పై పడకుండా పూర్తి స్థాయిలో వాహనాలపై పట్టాలు కప్పాలని, జాతీయ రహదారి ప్రక్కన వ్యర్ధాలు డంపింగ్ చేయకుండా చూడాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వాహన ప్రమాదాలను నివారించటానికి, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ట్రాఫిక్ పోలీసులు సూచించిన ప్రకారం రహదారుల విస్తరణ, మరమ్మత్తులు, వేగ నిరోధకాలు , సిగ్నల్ పనులు, జీబ్రా మార్కులు మున్సిపల్ అధికారులు వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని ఆర్ అండ్ బీ, పంచాయితీ రహదారులపై వాహన ప్రమాదాలు నివారించేందుకు బ్లాక్ స్పాట్ ను గుర్తించి అక్కడ చేపట్టాల్సిన చర్యలపై నివేదిక అందించాలన్నారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌ఎస్‌కే ఖాజావలి, అడిషినల్ ఎస్‌పి రమణ మూర్తి, ఆర్ అండ్ బీ ఎస్ ఈ శ్రీనివాస మూర్తి, జిల్లా ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి, డీఎంహెచ్ఓ విజయలక్ష్మీ, ఆర్టీసీ ఆర్ ఎం కృష్ణ కాంత్, నగరపాలక సంస్థ ఎస్ఈ శివనాగమల్లేశ్వరరావు, సిటీ ప్లానర్ రాంబాబు, ఎన్టీఆర్ వైద్యసేవ కో ఆర్డినేటర్ డా. విజయప్రకాష్, ఆర్టీఓలు సత్యన్నారయణ ప్రసాద్, శ్రీహరి, సుదీక్షణ ఫౌండేషన్ ప్రతినిధి రాజకుమారి తదితరులు పాల్గోన్నారు.
Prajavartha Online Telugu News