గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో శంకర్ విలాస్ వద్ద ఆర్వోబీని అత్యుత్తమ డిజైన్లతో అందరికీ ఆమోదయోగ్యంగా అతి తక్కువ కాలంలోనే ఖచ్చితంగా నిర్మాణం చేపట్టనున్నామని, అనవసర అపోహాలకు గురి కాకుండా ప్రజలు సహకరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశమందిరంలో శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణ ప్రభావిత భవనాల యజమానులకు నిర్మాణ పరిహారం అందించే కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ , జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ ఇన్ చార్జి మేయరు షేక్ సజీలా, శాసనసభ్యులు నసీర్ అహ్మద్, గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, రాష్ట్ర ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర రావుతో కలసి పాల్గొన్నారు. ఆర్వోబీ నిర్మాణ ప్రభావిత భవనాల యజమానులలో తొలుత సమ్మతి తెలిపిన 21 మందికి సంబంధించిన నిర్మాణాల నష్టపరిహారం నిమిత్తం రూ. 71 లక్షల చెక్కులను కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ అందించారు. ఈ సంధర్భంగా కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ 1950 లో నిర్మించిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ శిధిలావస్థకు చేరుకుందని, దీనిపై ట్రాఫిక్ రద్దీ కారణంగా సమీపంలోని జీజీహెచ్ కు అత్యవసర చికిత్స నిమిత్తం వచ్చే రోగులు మరణిస్తున్న సంఘటనలు జరుగుతున్నాయన్నారు. గుంటూరు జిల్లాకు 40 ఏళ్ళ అనంతరం దక్కిన కేంద్ర మంత్రి పదవిని అదృష్టంగా భావిస్తూ దీనిని సద్వినియోగం చేసుకొని కేంద్రంలో గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు సహకారంతో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి అతితక్కువ కాలంలోనే అన్ని రకాల అనుమతులు , నిధులు మంజూరు చేయటం జరిగిందన్నారు. గతంలో నగరంలో నందివెలుగు రోడ్డులో ఆర్వోబీని 2014 లో మంజూరు చేస్తే పనులు ప్రారంభించటానికి 2017 వరకు సమయం పట్టిందని, కానీ శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి అవరమైన అన్ని ప్రక్రియలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో ఆరు నెలల్లోనే పూర్తి చేయటం జరిగిందన్నారు. పరిపాలన, సాంకేతిక అనుమతులు మంజూరు తో పాటు టెండరు ప్రక్రియను పూర్తి చేసి అవసరం అనుకుంటే రేపే పనులు ప్రారంభించేలా సిధ్దంగా ఉన్నామన్నారు. ఆర్వోబీ నిర్మాణంపై కొంత మంది కావాలని అపోహాలు సృష్టిస్తున్నారని, రహదారి విస్తరణ కోసం అక్కడ జీవనోపాధి పొందుతున్నవారికి కొంత ఇబ్బంది జరుగుతుందని కానీ విశాలదృక్పథంతో అర్ధం చేసుకొని స్థలాలు ఇవ్వటానికి స్వయంగా వచ్చి సమ్మతించిన భవన యజమానులకు కూటమి ప్రభుత్వం తరుపున మనస్పూర్తిగా అబినందనలు తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వం నష్టం వాటిల్లే భవన యజమానులకు సాధ్యం అయినంత వరకు పరిహారం అందిస్తుందన్నారు. ప్రజలను అయోమయానికి గురిచేసే లేనిపోని అర్ధం పర్ధం లేని ఆరోపణలు తీసుకువచ్చి అపోహలు కల్పించవద్దన్నారు. వీటిలో ముఖ్యంగా ఆర్ యూ బీ తరువాత మాత్రమే ఆర్వోబీ నిర్మాణం చేయాలని చెబుతున్నారని, వాస్తవానికి 70 ఏళ్ళ క్రితం నిర్మించిన బ్రిడ్జి కావటం వలన ప్రస్తుతం అక్కడ ఆర్ యూ బీ కట్టడానికి సాంకేతికంగా సాధ్యం కాదన్నారు. ఇక్కడ ఉన్న వాహనాల రద్దీకి ఆర్ యూ బీ నిర్మాణం అంత అనుకూలంగా ఉండదని, తరువాత ఆర్వోబీ నిర్మించాలన్నా అప్పుడు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. అయితే అక్కడ కొంత మంది తెలపిన అభ్యంతరాలపై అధికారులతో నాలుగు సార్లు సమావేశం నిర్వహించి, అన్ని సమస్యలకు పరిష్కారం చూపటం జరిగిందన్నారు. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ప్రస్తుతం నిర్మిస్తున్న ఆర్వోబీ వద్ద అవసరమైతే భవిష్యత్తులో ఆర్ యూ బీ సైతం నిర్మించేలా డిజన్ చేయటం జరిగిందన్నారు. అండర్ పాస్ లకు సంబంధించి అరండాలపేట నాల్గవ లైను వద్ద 60 అడుగుల వెడల్పుతో ప్రభుత్వ ఆసుపత్రి సమగ్ర ఆసుపత్రి వద్ద , అరండాలపేట ఐదవ లైను వద్ద 44 అడుగుల వెడల్పుతోను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పొడవుకు సంబంధించి బ్రిడ్జ్ పొడవు గతంలో 436 మీటర్లు ఉంటే ప్రస్తుతం 930 మీటర్లు పొడవుతో నిర్మిస్తున్నామన్నారు. కీమీ కంటే ఎక్కువ పొడవు నిర్మించాలంటున్నారని దీనిని ఫ్లై ఓవర్ అంటారు, దీని నిర్మాణానికి అవసరమైన ప్రాంతాల్లోనే అనుమతులు ఇవ్వటం జరుగుతుందన్నారు. బ్రిడ్జ్ ఎక్కువ పొడవుతో నిర్మించటం వలన అనవసరంగా మరింత ఎక్కువ మంది భవన యజమానులు నష్టపోవాల్సి వస్తుందని మరల వారు కోర్టులకు వెళితే బ్రిడ్జి నిర్మాణం నిలిచిపోతుందన్న ఆలోచన చేస్తున్నారన్నారు. ప్రజలు అర్ధం చేసుకోవాలని రైల్వే ట్రాకు దాటుకుంటూ సమీపంలోని భవనాలకు సాధ్యమైనంత తక్కువ నష్టం కలిగేలా బ్రిడ్జి నిర్మించటమే ప్రదాన ఉద్దేశ్యం అన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్డు లో 120 అడుగులలో ఇరువైపుల 25 అడుగులతో సర్వీస్రోడ్లు వస్తున్నాయని, ఎత్తు గతంలో 5.9 మీటర్లు ఉంటే ప్రస్తుతం 9 మీటర్లుకు ఎత్తు పెంచి డబల్ డెక్కర్ బస్సు సైతం బ్రిడ్జి క్రింద నుంచి వెళ్ళేలా అవకాశం కల్పించటం జరిగిందన్నారు. ప్రజల గురించి మాత్రమే ఆలోచిస్తూ జీరో శాతం కూడ స్వంత లాభం చూసుకోకుండా శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం నాయకులు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజలకు మంచి జరిగే శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంను త్వరలోనే ప్రారంభించి అతితక్కువ కాలంలోనే పూర్తి చేయటం జరుగుతుందన్నారు. అపోహలు సృష్టించే వారు కూడ దయచేసి బ్రిడ్జ్ నిర్మాణానికి అడ్డుపడవద్దని, బ్రిడ్జ్ నిర్మాణం ఎట్టిపరిస్థితుల్లో జరుగుతుందని, దానిని ఆపాలని చూసి ప్రజలకు, సమాజానికి చెడు కావద్దన్నారు.
నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ శంకర్ విలాస్ వద్ద 1950లో ఆర్వోబీ నిర్మించటం జరిగిందన్నారు. నూతన ఆర్వోబీ నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ ప్రకారం 120 అడుగులతో పాటు సర్వీస్ రోడ్ల కోసం హిందూ కళాశాల సెంటరు నుంచి లాడ్జి సెంటరు కోసం రహదారి విస్తరణ చేపట్టడం జరుగుతుందన్నారు. రహదారి విస్తరణ వలన 7 రాష్ట్ర ప్రభుత్వం, ఆరు కేంద్ర ప్రభుత్వం, 14 మిషనరీలవి, 2 రీలిజియన్ వి, 47 ప్రైవేటు వ్యక్తుల భవనాలు మొత్తం 134 భవనాలకు నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికే 36 మంది సమ్మతి తెలిపారని, గౌరవ కోర్టును ఆశ్రయించిన ఆరుగురు సమ్మతి తెలిపారన్నారు. ఆర్డీపీ ప్రకారం నిభంధనలు అనుసరించి భవనాల నిర్మాణాలు నష్టానికి నగదు, కోల్పోయిన స్థలానికి టీడీఆర్బాండ్లు ఇవ్వటం జరుగుతుందన్నారు. తొలి దశలో సమ్మతి తెలిపిన 21 మందికి నిర్మాణాల నష్టపరిహారం క్రింద దాదాపు రూ.70 లక్షల చెక్కులను కేంద్ర మంత్రి చేతులు మీదుగా అందించటం జరుగుతుందన్నారు. నగరపాలక సంస్థ జనరల్ నిధుల నుంచి వీరికి నష్టపరిహారం అందిస్తున్నామన్నారు.కోల్పోయిన స్థలాలకు టీడీఆర్ బాండ్లు 45 రోజుల్లో అందించేలా చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు.ప్రభుత్వ భవనాలకు సంబంధించి ప్రహరీ గోడల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, తాత్కాలికంగా వారికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రహదారి విస్తరణ భవనాల తొలగింపు తరువాత సైడు డ్రైయిన్లు నిర్మాణానికి నగరపాలక సంస్థ జనరల్ నిధుల నుంచి పనులు మంజూరు చేయటం జరిగిందన్నారు. గౌరవ కోర్టులను ఆశ్రయించిన భవన యజమానులకు భూసేకరణ ద్వారా నష్ట పరిహారం అందించాలని కోర్టు ఆదేశించటం జరిగిందని, భూసేకరణ ద్వారా పరిహారం తక్కువుగా వస్తుందని వారికి తెలియచేయటంతో వీరిలో 6 మంది ఇప్పటికే నిర్మాణాలకు నష్టపరిహారం, టీడీఆర్ బాండ్లు తీసుకోవటానికి సమ్మతి తెలిపారన్నారు. మిగతావారికి నిబంధనల ప్రకారం పరిహారం చెల్లింపుకు చర్యలు తీసుకుంటామన్నారు.ఆర్వోబీ నిర్మాణానికి వీలుగా బీఎస్ఎన్ఎల్, విద్యుత్, కేబుల్ వైర్లు నిర్దేశిత సమయంలో పక్కకు తరలించేలా చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు.
శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నగర ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ది పనులను చేపట్టడానికి యజ్ఞంలా కృషి చేస్తున్నారన్నారు. నగరవాసుల దశాబ్ధాల నాటి చిరకాల కోరిక తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలను కలిపే శంకర్ విలాస్ వద్ద నూతన ఆర్వోబీ నిర్మాణానికి ఎనిమిది నెలల్లోనే ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకొని యుద్దప్రాతిపదికన కేంద్ర మంత్రి పయత్నం చేశారన్నారు. ఆర్వోబీ పునర్ నిర్మాణంలో ఉన్న చిన్న ఇబ్బందులను సైతం కొంత మంది స్వార్ధ పరులు దుష్రచారం చేస్తూ బ్రిడ్జ్ నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. ఆర్వోబీ నిర్మాణ డిజైన్ పై నిష్టాతులైన బహిరంగ చర్చకు వస్తే పూర్తి స్థాయిలో సమాధానం చెప్పటానికి సిధ్దంగా ఉన్నామన్నారు. రానున్న 40 సంవత్సరాల ప్రజల అవసరాలు తీర్చే ప్రణాళికతో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్వోబీ నిర్మిస్తున్నామన్నారు. దీనిపై సాంకేతిక అవగాహన కావాలంటే ఆర్ అండ్ బీ , రైల్వే, జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు పూర్తిగా తెలియచేసేందుకు సిధ్దంగా ఉన్నామన్నారు. నగర ప్రజల అవసరాలకే ప్రధమ ప్రాధాన్యత ఇస్తూ ఆర్వోబీ నిర్మాణం వలన నష్టం జరుగుతున్న వారికి నిర్మాణాల పరిహారం నగదు రూపంలోను, స్థలానికి సంబంధించిన పరిహారం టీడీఆర్ బాండ్ల రూపంలోను అందించటం జరుగుతుందన్నారు. గుంటూరు అభివృద్ధిలో భాగంగా ఆర్వోబీ పునర్ నిర్మాణం తప్పకుండా చేపడతామన్నారు.
శాసనసభ్యులు గళ్లా మాధవి మాట్లాడుతూ శంకర్ విలాస్ వద్ద ఆర్వోబీ ట్రాఫిక్ రద్దీ, బ్రిడ్జ్ బలహీనంగా మారిన కారణంగా పెద్ద ఎత్తున ప్రజలు నూతన ఆర్వోబీ నిర్మాణంచేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్యులు నిర్విరామంగా కృషి చేసి చాలా వేగవంతంగా నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు రూపొందించటం జరిగిందన్నారు. కానీ కొంత మంది నాయకులు, కొంత మంది వ్యాపారులు దీని ఉద్దేశ్యంను ప్రక్కదారి పట్టిస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఆపాలని చూస్తూన్నారన్నారని, ఇది సమర్ధమైనది కాదన్నారు. ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి లో భాగంగా గతం కంటే ఆర్వోబీని నాలుగు లైన్లు విస్తరించి, సర్వీస్ రోడ్లుతో, అండర్ పాస్ లతోను, పొడవు, ఎత్తు పెంచి నిర్మించటం జరుగుతుందన్నారు. కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్వోబీ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చారని, దీనిని అనవసరంగా పక్కదారి పట్టించకుండా ప్రజలు అభివృద్ధి పనులకు సహకరించాలన్నారు.
శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ 2047లో భాగంగా గుంటూరు నగరాన్ని రాజధాని ప్రాంతంతో కలిపి విశ్వనగరంగా తీర్చిదిద్దటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. దీనిలో భాగంగానే కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా నగరంలో నాలుగు బ్రిడ్జ్ ల నిర్మాణాలను మంజూరు చేయించారని, ఇవి అన్ని పూర్తి అవుతాయన్నారు. శంకర్ విలాస్ ఆర్వోబీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతికంగా పరిశీలించి డిజైన్లు అనుమతించాని, దీనిని సాంకేతిక అంశాలపై మాట్లాడే అర్హత ఎవరికి లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన డీపీఆర్లను సైతం వెనక్కి పంపిన ప్రబుద్దులని, సాంకేతిక అనుమతులు వచ్చిన వాటిని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. నగరంలో 50 లక్షల మందికి ఉపయోగపడే ఆర్వోబీని అడ్డుకుంటే చరిత్రహీనులవుతారన్నారు. ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించి భవన యజమానులు అర్ధం చేసుకొని సహకరించాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలలో వ్యక్తులకు కొద్దిపాటి నష్టం జరుగుతుందని, దానికి ప్రభుత్వం అందించే పరిహారం తీసుకోవాలన్నారు. ఆర్వోబీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్న వారు భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సహకరించాలన్నారు. కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో తోమ్మిది నెలల్లోనే భవన యజమానులకు నష్టపరిహారం అందించటం జరుగుతుందన్నారు.
అనంతరం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మెరుగైన పారుశుధ్య పనులు చేపట్టేలా నగర కమిషనర్ నేతృత్వంలో పటిష్ట కార్యాచరణ మేరకు కృషి జరుగుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రజారోగ్య విభాగానికి అవసరమైన 6 ట్రాక్టర్లను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇంచార్జి మేయర్ షేక్ సజిలా, శాసన సభ్యులు నసీర్ అహ్మద్, గల్లా మాధవి లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య పనుల్లో మెరుగుదల కోసం గతంలో ఉన్న 22 శానిటరీ డివిజన్లను పర్యవేక్షణ సౌలభ్యం కోసం కమిషనర్ 32 డివిజన్లుగా పెంచారన్నారు. ఆయా డివిజన్లలో చెత్త సేకరణ చేయడానికి వీలుగా ప్రస్తుతం ఉన్న 27 ట్రాక్టర్లకు తోడుగా మరో 6 ట్రాక్టర్లను కొనుగోలు చేసి ప్రజారోగ్య విభాగానికి అందించారన్నారు. స్వచ్చ ఆంధ్ర స్పూర్తితో స్వచ్చ గుంటూరు సాధనకు నగర ప్రజలు కూడా పూర్తీ స్థాయిలో సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, సిటి ప్లానర్ రాంబాబు, డిసిపి సూరజ్ కుమార్,ఏసిపి రెహ్మాన్, టిడిపి ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర, కూటమి నాయకులు గాదె వెంకటేశ్వర్రావు, సిహెచ్.తిరుపతిరావు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News