విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాశ్మీర్లోని పహల్గాం పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి పిరికిపందల చర్యగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్( ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు ఐ వి సుబ్బారావు అభివర్ణించారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ నుండి ధర్నా చౌక్ వరకు శాంతి, సంఘీభావ ర్యాలీ జరిగింది. ర్యాలీని ఉద్దేశించి ఐ వి సుబ్బారావు ప్రసంగిస్తూ శాంతియుత పర్యాటక ప్రాంతమైన పెహల్గాం లో పాక్ ఉగ్రవాదులు బరితెగించి పర్యాటకులను కాల్చి చంపడం దురదృష్టకరమన్నారు. ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో నియంత్రణ రేఖ(ఎల్ఓసి) వెంబడి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఇది భారత్, పాక్ ల మధ్య యుద్ధానికి దారితీసే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో శాంతి పరిరక్షణకు ప్రపంచ దేశాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచల జయరాజ్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఏపీయూడబ్ల్యూజే సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్షుడు చావా రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వర రావు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు ఎస్కే బాబు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు యేచూరి శివ, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, జీ.రామారావు, శివరామ కృష్ణ, శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News