-మత్స్యకారుల ఆర్థికాభి వృద్ధికి కృషి
-మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలు నియోజకవర్గంలో మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. మంగళవారం నిడదవోలు మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మత్స్యశాఖకు సంబంధించిన పలు వివరాలను మంత్రి దుర్గేష్ వివరించారు. మత్స్యశాఖకు సంబంధించి సుమారు రూ. 1,27,06,075 విలువైన 255 యూనిట్లకు ప్రతిపాదనలు ఇవ్వడం జరిగిందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యశాఖలో అందిస్తున్న లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్లు(మొబైల్), రోజుకు 20 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన పెద్ద మిల్లుల ఏర్పాటు, సాంప్రదాయ మత్స్యకారులకు పడవలు, వలలు అందించడం, ఐస్ బాక్స్ లతో కూడిన సైకిల్, మోటార్ సైకిల్, బయోప్లాక్ కల్చర్ వ్యవస్థ ఏర్పాటు,రిజర్వాయర్ లలో ఫింగర్ లింక్స్ నిల్వ చేయడం, చేపపిల్లల పెంపకం తదితర 7 రకాల వివిధ స్కీమ్ ల లబ్ధిదారుల ఎంపికకు చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి దుర్గేష్ అన్నారు. మత్స్య సంపాదన పెంచడమే లక్ష్యంగా వీటిపై ఆధారపడిన వారి జీవితాలను ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. అంతేగాక మత్స్యకార సంఘాలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే మత్స్యకారుల సంక్షేమం కోసం మత్స్యకారుల వేట నిషేధ భృతి అందించామని గుర్తుచేశారు. మత్స్యకారుల సంక్షేమం, సంతోషం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ వహించారని తెలిపారు. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి మత్స్యకారుల సంక్షేమం కోసం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అధికారులు వివరించారు. అనంతరం మత్స్యకారులు సంబంధిత పథకాలను సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆదేశించారు.
కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం 2024-2025 ద్వారా నిడదవోలు నియోజక వర్గానికి సంబంధించి మత్స్యకారులకు 8 విభాగాలలో లబ్ధి చేకూర్చేందుకు మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా నిడదవోలుకు అసిస్టెంట్ ఫిషరీస్ ఇన్ స్పెక్టర్ కు సైన్డ్ కాపీ అందించడం జరిగింది.
కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, ఎ.ఎస్.ఓ యం. నాగాంజనేయలు, వ్యవసాయ శాఖ ఏడి పి.చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ ఏవో సత్య నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News