-తేమ శాతం గురించి రైతులు ఆందోళన చెందవద్దు
-తేమ శాతం ఎంత ఉన్నా ధాన్యం కొనుగోలు చేసి తీరుతాం
-ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు సృష్టించొద్దు
-ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు సహకరించాలి
-ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే నిడదవోలు ముందంజ
-:మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షం వచ్చి ధాన్యంలో తేమ శాతం పెరిగిందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరి నుండి ధాన్యం సేకరించి తీరుతామన్నారు. మంగళవారం నిడదవోలు మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశాలపై మంత్రి కందుల దుర్గేష్ స్పష్టతనిచ్చారు. సాధారణంగా తేమ శాతం 17కు మించితే ధాన్యం కొనుగోలు చేయరు కానీ కూటమి ప్రభుత్వం తేమ శాతాన్ని పట్టించుకోకుండా ఆరుగాలం శ్రమించిన రైతన్న నుండి ధాన్యం కొనుగోలు చేసి వారి ఖాతాలో నిర్దేశిత సమయంలో నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తేమ శాతం పెరిగితే ధాన్యం కొనుగోలు చేయమన్న అపోహలు రైతులు నమ్మవద్దన్నారు. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసి తీరుతామని మంత్రి దుర్గేష్ భరోసానిచ్చారు. రైస్ మిల్లర్లు రైతుల నుండి ఏ రకమైన ధాన్యాన్ని అయినా సేకరించి తీరాలని ఆదేశించారు. ఈ విషయమై రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
గతంలో రెండు మూడు నెలలైనా అన్నదాతల నుండి సేకరించిన ధాన్యానికి నగదు జమ చేయలేదన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో రైతులకు అండగా నిలబడాలన్న ఉద్దేశంతో నూటికి నూరు ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. త్వరితగతిన రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుందన్న విషయాన్ని గుర్తుచేశారు. సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తినప్పుడు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అది ఎంతమాత్రం సరైన విధానం కాదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు విషయంతో తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని సూచించారు. తమది రైతు పక్షపాది ప్రభుత్వమని త్వరలోనే రైతుల ఖాతాల్లో రూ.20,000 నగదు జమ చేసే పథకాన్ని ప్రారంభించబోతున్నామని స్పష్టం చేశారు. రైస్ మిల్లర్లు రైతులకు సహకరించాలన్నారు.ధాన్యం సేకరణ విషయంలో నిడదవోలు నియోజకవర్గం ముందంజలో ఉందని తెలిపారు. రైతుకు ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తనదని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతుల నుండి ధాన్యాన్ని సేకరించిన కేవలం రెం డు రోజుల్లోనే ఒక్కో సందర్భంలో కేవలం రోజుల్లోనే నగదు జమ చేస్తుందన్నారు. ఇది తమ ప్రభుత్వ ఘన విజయమన్నారు. పంట విస్తీర్ణం పెరగడం, దిగుబడి ఎక్కువవడం, రైతు ప్రభుత్వం ఇస్తున్న డబ్బుతో సంతృప్తి వ్యక్తం చేయడం తదితర కారణాల వల్ల ఎక్కువ ధాన్యాన్ని సేకరించే పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచామన్నారు. తూర్పుగోదావరి జిల్లా మొత్తంగా పరిశీలిస్తే కేవలం నిడదవోలు మండలంలోనే 43,229 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ఇది రాష్ట్రంలోనే అత్యధికం అన్నారు. ఉండ్రాజవరం మండలంలో 23,223 మెట్రిక్ టన్నులు, పెరవలి 21,234 మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు. రైతులందరూ సంతృప్తి చెందేలా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు.వ్యవసాయ, పౌర సరఫరాలు, రెవెన్యూ తదితర శాఖలతో ఎప్పటికప్పుడు ఈ అంశాలపై వివరాలు సేకరిస్తున్నామన్నారు. తాను వియత్నాం పర్యటనలో ఉన్నప్పటికీ సబ్ కలెక్టర్, జేసీ, ఏడీ, ఎమ్మార్వోలతో మాట్లాడి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకున్నా అని తెలిపారు. ఈ క్రమంలో పలుచోట్ల ధాన్యం సేకరణ టార్గెట్ లు పెంచి మరీ సేకరించామని గుర్తుచేశారు.
కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, ఎ.ఎస్.ఓ యం. నాగాంజనేయలు, వ్యవసాయ శాఖ ఏడి పి.చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ ఏవో సత్య నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News