Breaking News

నిషేధిత భూములకు విముక్తి కలిగించి సర్వ హక్కులు కల్పించాం..

-సర్కారు వారి తోట కాలనీవాసులకు నిషేధిత భూముల జాబితా నుంచి తొలగింపు ఉత్తర్వులు అందజేసిన మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూములుగా ఉండిపోయిన 22(ఏ) నిషేధిత జాబితాలోని భూములకు విముక్తి కలిగించి వాటిపై సర్వహక్కులు కల్పించామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం ఉదయం మంత్రి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి మచిలీపట్నం నగరంలోని 4, 5 డివిజన్ల సర్కారు వారి తోట పరిధిలో ఉన్న సెక్షన్ 22 (ఏ) లో నమోదు కాబడిన భూములకు మినహాయింపు ఉత్తర్వులు విడుదల చేయు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బ్రిటిష్ వారి కాలంలో ఏర్పాటై సర్కార్ వారి తోటగా పిలవబడిన ఈ ప్రాంతంలోని భూములు 22(ఏ) నిషేధిత జాబితాలో ఉండటం వల్ల కాలనీవాసులకు రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు ఇప్పటివరకు అవకాశం లేకపోయిందన్నారు. అత్యవసర సమయంలో రుణాలు కోసం లేదా అమ్ముకోవడానికి సాధ్యపడక ప్రజలు ఎన్నో ఇబ్బందులను పడ్డారని మంత్రి గుర్తు చేశారు. అటువంటి ఇబ్బందుల నుంచి వారిని గట్టెక్కించడానికి, ఎన్నికల్లో వారికి ఇచ్చిన హామీ ప్రకారం నేడు వారి భూములను 22(ఏ) నిషేధిత జాబితా నుంచి తొలగించి దాదాపు 340 మందికి పూర్తి హక్కులు కల్పించి అందుకు సంబంధించిన ఉత్తర్వులను వారికి అందించడం జరిగిందన్నారు. రహదారులు, పార్కులు, చర్చ్ లు, గుళ్ళు తదితర కమ్యూనిటీ ఆధారిత భూములను సబ్ డివిజన్ చేసి, వ్యక్తిగత భూములకు ప్రత్యేక సర్వే నంబర్ కేటాయించడం జరిగిందన్నారు. నిషేధిత జాబితా నుంచి తొలగింపు ప్రక్రియకు జిల్లా కలెక్టర్ ఎనలేని కృషి చేసి సహకారాన్ని అందించారని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మిగతా ప్రాంతాలలో కూడా రెవెన్యూ సమస్యలున్న భూములను గుర్తించి వారికి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి కొల్లు రవీంద్ర సూచనల మేరకు నగరంలో పారిశుధ్య నిర్వహణ, రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా సర్కార్ వారి తోట పరిధిలోని భూములు బ్రిటిష్ వారి కాలం నుంచి నిషేధిత భూముల జాబితాలో సర్వే నంబర్లు ఉండటం వల్ల ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలకు నివాసానికి తప్ప వారి అవసరం మేరకు ఈ భూములు ఉపయోగపడకుండా ఉండిపోయాయన్నారు. అయితే రెవెన్యూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఉన్న ప్రభుత్వం వారి భూములను 22(ఏ) నిషేధిత జాబితా నుంచి చట్టబద్ధంగా తొలగించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పూర్తి హక్కులు కల్పించిందన్నారు.

22(ఏ) నిషేధిత జాబితా నుంచి తమ భూములను తొలగించి వాటిపై సర్వహక్కులు కల్పించినందుకు కాలనీవాసులు మంత్రి కొల్లు రవీంద్రను, జిల్లా కలెక్టర్ ను సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బందరు ఆర్ డి ఓ కే స్వాతి, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, కార్పొరేటర్ ఛాయాదేవి, మచిలీపట్నం నార్త్ మండలం తహసిల్దార్ నాగభూషణం, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మాజీ డిప్యూటీ కలెక్టర్ విజయ్ శేఖర్, పార్టీ ఇన్చార్జి రత్నాకర్, మాజీ కౌన్సిలర్ చంటి, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *