– ఔత్సాహికులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యక్రమం
– ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేలా కౌన్సెలింగ్ సేవలు
– సెల్ ద్వారా సాంకేతిక మద్దతు, మార్కెటింగ్ పరంగా సలహాలు, సూచనలు
– ప్రజల వినూత్న ఆలోచనల డాక్యుమెంటేషన్ సెంటర్‌గా కూడా ఇగ్నైట్ సేవలు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర @ 2047 దార్శనిక ప్రణాళికకు అనుగుణంగా దశల వారీగా లక్ష్యాలను చేరుకునేందుకు జిల్లాస్థాయిలో ఇగ్నైట్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
సోమవారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్ ప్రాంగణంలో ఇగ్నైట్ (I – Information for, G – Growth through, N – Nurturing, I – Income generating Innovation, T – Technology and E- Encouraging Entrepreneurs) సెల్‌ను ప్రారంభించారు. ఈ ప్రత్యేక సెల్ ద్వారా ప్రజలకు అందించాల్సిన సేవలపై అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ దార్శనిక ప్రణాళికపై సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు వివిధ శాఖల మధ్య సమన్వయ సాధనకు ఈ సెల్ దోహదం చేస్తుందన్నారు. ఒక కుటుంబం- ఒక పారిశ్రామికవేత్త సాకారం దిశగా ఔత్సాహికులను సరికొత్త ఆలోచనలతో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ సెల్ అవసరమైన సహాయసహకారాలు అందిస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి, వాటికోసం దరఖాస్తు చేసుకోవడంలోనూ తోడ్పడుతుందన్నారు. ఇందుకోసం ప్రత్యేక కౌన్సెలింగ్ సిబ్బంది ఉంటారన్నారు. సమాచారాన్ని అందించే కరపత్రాలతో పాటు వివిధ దరఖాస్తులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నారు. రోజుకో డిపార్టుమెంట్ ఇగ్నైట్ స్టాల్‌ను ఏర్పాటుచేస్తుందని, ఆ శాఖ కార్యకలాపాలతో పాటు ఆ శాఖ పరిధిలోని పథకాలు, కార్యక్రమాలపైనా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ఆర్థికంగా, సాంకేతికంగా, మార్కెటింగ్ పరంగా చేయూతనివ్వనున్నట్లు వివరించారు. ప్రజల నుంచి వచ్చే కొత్త ఆలోచనలను సరైన విధంగా నమోదుచేసే డాక్యుమెంటేషన్ సెంటర్‌గా కూడా వ్యవహరిస్తుందని.. ఈ ఆలోచనలపై శాఖల సమీక్షా సమావేశాల్లో చర్చించి, నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. తొలిరోజు వ్యవసాయ శాఖ, ప్రకృతి వ్యవసాయం, రైతు సాధికార సంస్థ స్టాళ్లను ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, డీపీవో పి.లావణ్య కుమారి, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News