Breaking News

అర్జీల ప‌రిష్కారంలో సంతృప్తి స్థాయిని పెంచాలి..

-సమస్యను పరిష్కరించాలనే నిబ‌ద్ధ‌త అధికారుల్లో ఉండాలి..
-నాణ్య‌త‌తో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన‌ప్పుడే కార్య‌క్ర‌మానికి సార్థ‌క‌త‌..
-అర్జీల ప‌రిష్కారంలో అల‌స‌త్వం చూపితే చ‌ర్య‌లు త‌ప్ప‌వు..
-జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అర్జీని గ‌డువులోపు ప‌రిష్క‌రించ‌డం ఎంత ముఖ్య‌మో.. అర్జీదారుడు పూర్తిస్థాయి సంతృప్తి వ్య‌క్తం చేసేలా స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూప‌డం అంత‌కంటే ముఖ్య‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.
ప్రతి సోమవారం నిర్వహించే జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని సోమవారం పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు స్థానిక శాసనసభ్యులు కొలిక‌పూడి శ్రీనివాసరావులతో కలసి జిల్లా కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ‌.. తిరువూరు ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్ర‌జా స‌మ‌స్యల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) ద్వారా ప్ర‌జ‌లు అర్జీ ద్వారా విన్న‌వించుకున్న స‌మ‌స్య‌కు అర్జీదారుడు సంతృప్తి చెందేలా ప‌రిష్కారం చూపాలన్నారు. అప్పుడే ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లుచేస్తున్న పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మం అస‌లు ల‌క్ష్యం నెర‌వేరుతుంద‌ని అన్నారు. అధికారులు అర్జీదారుల‌ను వారి కుటుంబ స‌భ్యులుగా, వారి సమస్యగానే భావించి ప్ర‌తి అర్జీకి స‌రైన ప‌రిష్కారం చూపాల‌ని అన్నారు. అర్జీని స్వీక‌రించిన నాటి నుండి నిర్దేశ గ‌డువులోగా ద‌ర‌ఖాస్తుదారుడు పూర్తిస్థాయి సంతృప్తి చెందేలా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే వ‌ర‌కు వివిధ ద‌శ‌ల్లో పలు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
స‌మ‌స్య ప‌రిష్కార సామ‌ర్థ్యం అనేది పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెంచుతుంద‌ని, ప్ర‌తి అర్జీని సానుభూతితో, నిజాయితీగా పార‌ద‌ర్శ‌క‌త‌, జ‌వాబుదారీత‌నంతో ప‌రిష్క‌రించాల‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్య పరిష్కార కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంద‌ని.. ప్ర‌తి శాఖ‌కు మండ‌ల స్థాయి నుండి జిల్లా స్థాయి వ‌ర‌కు గ్రీవెన్స్ రిడ్రెస‌ల్ అథారిటీగా ఒక‌రికి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం జ‌రిగింద‌ని, అర్జీని కిందిస్థాయి అధికారికి అప్ప‌గించకుండా గ్రీవెన్స్ రిడ్రెస‌ల్ అధికారే అర్జీదారునితో ఫోన్లో లేదా నేరుగా క‌లిసి మాట్లాడి, స‌మ‌స్య‌ను సావ‌ధానంగా వినాల‌న్నారు. అర్జీ వివరాలను పరిశీలించి అవసరమైతే క్షేత్రస్థాయిలో ప‌ర్య‌టించి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ద్వారా వారిలో సమస్య పరిష్కార‌మ‌వుతుంద‌నే నమ్మకం కలుగుతుందన్నారు. సున్నిత అంశాల్లో అయితే నేరుగా క‌లిసి మాట్లాడ‌టం మంచిద‌ని పేర్కోన్నారు. మండ‌ల‌స్థాయిలో ఎంపీడీవో, త‌హ‌సీల్దార్‌, ఎస్‌హెచ్‌వో త‌దిత‌ర అధికారులు అర్జీల ప‌రిష్కారంలో ప్ర‌త్య‌క్ష భాగ‌స్వాములు కావాల‌ని స్ప‌ష్టం చేశారు. అప్పుడే అర్జీల ప‌రిష్కారంలో నాణ్య‌త‌తో పాటు సంతృప్తి స్థాయి పెరుగుతుంద‌ని వివ‌రించారు. కిందిస్థాయిలో ప‌రిష్కారానికి వీల్లేని వాటిని స‌రైనవిధంగా పైస్థాయికి పంపాల్సి ఉంటుంద‌ని అన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దని, ఫిర్యాదు వస్తే చర్యలు తప్పవని కలెక్టర్ లక్ష్మీశ హెచ్చరించారు.

మొత్తం 283 అర్జీలు:
మొత్తం 283 అర్జీలు స్వీక‌రించ‌గా.. వీటిలో తిరువూరు మండ‌లానికి చెందినవి 146, రెడ్డిగూడెం మండ‌లం నుంచి 7, ఎ.కొండూరు మండ‌లం నుంచి 38, విస్స‌న్న‌పేట మండ‌లం నుంచి 47, గంప‌ల‌గూడెం మండ‌లం నుంచి 45 అర్జీలు ఉన్నాయ‌ని వివ‌రించారు.
కార్యక్రమంలో తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు, గ్రామ‌,వార్డు స‌చివాల‌యాల ప్ర‌త్యేక అధికారి జి.జ్యోతి, ఏపీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ ఎస్.దేవదత్తు, ఏసీపీ ఎ.వెంకటేశ్వరరావు, తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేట మండల తహసీల్దార్లు, వివిధ శాఖ‌ల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *