Breaking News

బౌద్ధ క్షేత్రమైన ఘంటసాలకు పూర్వవైభవం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తా…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన ఘంటసాలకు పూర్వవైభవం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ పేర్కొన్నారు. సోమవారం గౌతమ బుద్ధ జయంతి సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గం లోని బౌద్ధ క్షేత్రమైన ఘంటసాలలో రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి, భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శయన బుద్ధ ప్రాజెక్టు ప్రాంగణంలో బుద్ధ జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన బౌద్ధ సాహితీ చారిత్రిక సదస్సులో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు

అనంతరం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యంగా రెండు ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అందులో ఒకటి మంగినపూడి బీచ్ కాగా రెండవది బౌద్ధ క్షేత్రమైన ఘంటసాలను పర్యాటక సర్క్యూట్లో చేర్చి శయన బుద్ధ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నదే ముఖ్య ఉద్దేశ్యం ఉన్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు

ప్రాజెక్టులో భాగంగా శయన బుద్ధ విగ్రహము, మ్యూజియము, గ్రంథాలయముతో పాటు అసంపూర్తిగా ఉన్న భవన సముదాయము పూర్తి చేయుటకు తన వంతు కృషి చేస్తానన్నారు. బుద్ధ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. చిన్నప్పుడు గౌతమ బుద్ధుని చరిత్ర అందరము చదవడం జరుగుతుందని ముఖ్యంగా వారి బోధనలలో జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు ఉన్నాయని, అందులో ప్రత్యేకించి తన జీవితంలో మధ్యే మార్గాన్ని అనుసరించడం జరుగుతుందన్నారు. ఒక బాధ్యత గల అధికారిగా అందరికీ న్యాయం ఎలా చేయాలి అని తాను ఆలోచిస్తూ ఉంటానన్నారు. బుద్ధ ప్రాజెక్టు కోసం గొర్రెపాటి రఘునాథ్ బాబు తన రెండు ఎకరాల సొంత స్థలం కేటాయించడం గొప్ప విషయమన్నారు. అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ సభ అధ్యక్షత వహించి మాట్లాడుతూ అందరికీ 2,569 వ బుద్ధ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు.

బోధి వృక్షం నీడన తపోదీక్ష ద్వారా తన హృదయంలో వెలిగిన జ్ఞానజ్యోతి కాంతుల్ని ప్రపంచానికి పంచాలని సత్సంకల్పంతో ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభించిన గౌతమ బుద్ధుని జన్మ దినం వైశాఖ పౌర్ణమి అని, బుద్ధుని జననం, బోధి ప్రాప్తి, మహాపరి నిర్వాణం అన్ని ఈ పౌర్ణమి నాడే సంభవించాయన్నారు. ఇదివరకు 2017 లో బుద్ధ జయంతి ఉత్సవాలను ఘంటసాల లో ఘనంగా నిర్వహించామన్నారు. ఘంటసాలకు 2 వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉందని, ఒకప్పుడు మహోన్నతమైన ప్రాంతంగా వెలుగొందిందన్నారు. ఆనాడు సముద్ర తీరం ఉండేదని అందుకే జలదీశ్వర స్వామి ఇక్కడ వెలిశారన్నారు. కాలచక్ర నెరవేర్చుటకు ఘంటసాల అనువైన ప్రాంతమని కంటక శైల అని పేరు కూడా ఘంటసాలకు మరో పేరు ఉందన్నారు. గతంలో ఈ ప్రాంతంలో ఎక్కడ తవ్విన శిల్పకళా ఖండాలు దొరికేవని, కొన్ని శిల్పాలను మ్యూజియంలో భద్రపరిచినప్పటికీ మరికొన్నింటిని పలువురు కట్టడాలు స్తూపాలు ఇతర నిర్మాణాల కోసం వినియోగించడంతో కనుమరుగయ్యాయన్నారు. దీంతో అద్భుతమైన శిలా సంపదను కోల్పోయామన్నారు.

ఇక్కడి పొలాల్లో దొరికే విగ్రహాలు గాని నాణేలుగాని ఏవైనా సరే మన వారసత్వ సంపద అని భావితరాల వారి కోసం వాటిని భద్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మైసూరు అధ్యయన కేంద్రం ద్వారా అనేక బౌద్ధ శాసనాలు వెలుగు చూశాయన్నారు. ఘంటసాల, అమరావతి లోనే కాకుండా తెలంగాణలో కూడా అనేక బౌద్ధ శాసనాలు వెలుగుచూశాయని మైసూరు భారత పురావస్తు సర్వేక్షణ శాఖ వాటన్నిటినీ క్రోడీకరించి బౌద్ధ చరిత్ర అధ్యయనం చేస్తూ మమకారం పెంపొందించడం అభినందనీయమన్నారు. పర్యాటక సర్క్యూట్లో ఘంటసాలను చేర్చి మరింత ప్రాచుర్యం చెందేలా చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వచ్చే బుద్ధ జయంతి నాటికి అసంపూర్తి భవనాలను పూర్తిచేసుకుని ఇక్కడే మరలా ఉత్సవాలను అమోఘంగా నిర్వహించుకుందామన్నారు.

మాజీ రాజ్యసభ సభ్యులు కనక మేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ మరుగున పడిన రాష్ట్ర రాజధాని అమరావతికి పూర్వ వైభవం తీసుకుని వస్తున్న విధంగానే రాష్ట్ర ప్రభుత్వం బౌద్ధ క్షేత్రమైన ఘంటసాల ఘన చరిత్రను ప్రాచుర్యం కల్పించే ప్రాజెక్టు చేపట్టడం సంతోషదాయకమన్నారు. చరిత్ర తిరగేస్తే ఘంటసాల ప్రాముఖ్యత, గౌతమ బుద్ధుని ఆలోచన విధానాలు తెలుస్తాయన్నారు. గౌతమ బుద్ధుడు ప్రథమ సామాజిక విప్లవకారుడని కీర్తించారు. బుద్ధిజాన్ని ఒక మతంగా చూడరాదని ప్రపంచవ్యాప్తంగా బుద్ధిజం వ్యాపించి ఉందని, కులాలు, మతాలు ప్రాంతాలకు సంబంధం లేకుండా ధర్మాన్ని ఆచరించే గుణం భావ సారూప్యత కలిగిన సామాజిక హేతువాద దృక్పథంతో లౌకికవాదంతో నడుచుకోవడమే బుద్ధిజం అన్నారు.
తాను అవనిగడ్డ వాసిగా న్యాయవాద వృత్తిలో రాణించి సామాజిక స్పృహ తో రాజకీయాల్లో ప్రవేశించానన్నారు.

రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఘంటసాల ఘన చరిత్ర ఈ తరంతో పాటు వచ్చే తరాలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఘంటసాల ప్రసిద్ధమైన పట్టణం అనేందుకు ఇచ్చట నిరంతరం దొరికే నాణ్యాలు సాక్ష్యం అని గేయ రూపంలో గుర్తు చేయడం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. వచ్చే సంవత్సరం ఇదే ప్రాంతంలో గౌతమ బుద్ధ నాటకం ప్రదర్శిస్తామన్నారు.

మైసూరు భారత పురావస్తు సర్వేక్షణ శాసన అధ్యయన విభాగం సంచాలకులు కే మునిరత్నం రెడ్డి మాట్లాడుతూ ఆరు నెలల కిందట ప్రధానమంత్రి కార్యాలయం నుండి కొంత సమాచారం అడిగారని, భారతదేశం పేరు ఎలా వచ్చింది అనే విషయం పైన పార్లమెంటులో చర్చ జరిగిందని, హోం మంత్రి అమిత్ షా ఒక పత్రికా ప్రకటన విడుదల చేయాల్సి ఉండగా ఘంటసాల పొలాల్లో దొరికిన ఛత్రీ శాసనంలో భారతదేశం ప్రస్తావన ఉందని అదే విషయం వారికి తెలియజేయడం జరిగిందన్నారు. ఆ విధంగా దేశానికి సంబంధించి ఆనవాళ్లు ఘంటసాల శాసనాలలో లభ్యమయ్యాయన్నారు. ఘంటసాలకు క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం నుంచే అత్యంత ప్రాముఖ్యత ఉందన్నారు. ధరణికోటలో బౌద్ధ శాసనాలు దొరికాయని అవి ఆంధ్ర రాష్ట్రానికి గుజరాత్ రాష్ట్రానికి అనుసంధానమై ఉన్నాయన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో లంకమల అడవి ప్రాంతంలో పరిశోధనలు చేశామని అక్కడ 27 బౌద్ధ శాసనాలు దొరికాయన్నారు.
అలాగే తెలంగాణలో కర్రెగుట్టలో గుండారం అటవీ ప్రాంతంలో పోలీసుల సహాయంతో 11 శాసనాలు రికార్డు చేశామన్నారు
ఈ శిలా శాసనాలు చారిత్రక ప్రారంభం వ్యాప్తి పరిణామాలు గుర్తించడానికి ప్రాథమిక ఆధారాలుగా ఉన్నాయన్నారు
శాసనాలు బౌద్ధ ధర్మం, నీతి, విలువలు, గొప్ప చరిత్రను, శాంతి సందేశాన్ని గొప్ప చరిత్రను మనకు గుర్తుచేస్తాయన్నారు.

తదనంతరం పత్రాలు సమర్పించిన పలువురు సాహితీవేత్తలను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అవనిగడ్డ శాసనసభ్యులు రాష్ట్ర నాటక అకాడమీ అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు కలసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ధమ్మవసి తీయగూర సోతా రామం, రచించిన గౌతమ బుద్ధ నృత్యరూపకం పుస్తకాన్ని అతిధులు అందరూ కలిసి ఆవిష్కరించారు. అలాగే ప్రముఖ బౌద్ధ సాహిత్య వేత్త బొర్రా గోవర్ధన్ రచించిన బుద్ధ భూమి మాస పత్రికను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మల్లికార్జునరావు, ప్రత్యేక అధికారి మెప్మా పీడీ సాయిబాబు, కృష్ణ జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, పలువురు సాహితీవేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *