మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ మీకోసం కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన అర్జీలను నిర్ణీత సమయానికి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ఆయన కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ సమావేశపు మందిరంలో కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డిఓ కే స్వాతి, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్ కుముదిని సింగ్ లతో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రస్తుతం అందుకున్న అర్జీలతోపాటు వివిధ శాఖల వద్ద పరిష్కరించాల్సిన గతంలోని కొన్ని అర్జీలు పెండింగ్లో ఉన్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రక్తహీనత, తలసేమియా బాధితులతో పాటు గర్భిణీ స్త్రీలకు అత్యవసర పరిస్థితుల్లో రక్తాన్ని అందించేందుకు, అవసరమగు రక్తాన్ని సేకరించేందుకు నియోజకవర్గాల వారీగా మండల స్థాయిలో రక్తదాన శిబిరాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా వివిధ శాఖల్లో పెండింగ్ కోర్టు కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచిస్తూ, అవసరమైన వాటికి సకాలంలో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పారు.
మీ కోసం అర్జీలలో కొన్ని:
గుడివాడలోని ఒక ప్రముఖ కళాశాలలో ఎంబీఏ చదువుతూ కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంగా చదువును కొనసాగించలేకపోయానని, అయితే 2020వ సంవత్సరంలో అడ్మిషన్ సమయంలో తన వద్ద నుంచి తీసుకున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికెట్లను పూర్తి ఫీజు కట్టకుండా ఇవ్వమంటున్నారని, తన ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇప్పించవలసిందిగా పెదపారుపూడి మండలం, మహేశ్వరపురం గ్రామానికి చెందిన సిహెచ్ శ్యామంత్ అర్జీ సమర్పించారు.
గ్రామంలోని పంట బోదెలను యంత్రాల ద్వారా తవ్వి మట్టిని సొమ్ము చేసుకుంటున్నారని, యంత్రాలతో కాకుండా ఉపాధి హామీ పథకం ద్వారా పూడికతీత పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం మండలం, గుండుపాలెం గ్రామానికి చెందిన పలువురు విన్నవించారు.
మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారి 65 నుంచి మొవ్వ మండలం, నిడుమోలు గ్రామానికి సర్వీస్ రోడ్డు, డ్రైనేజీని నిర్మించాలని కోరుతూ గ్రామస్తులు అర్జీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, డిపిఓ జే అరుణ, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శర్మిష్ఠ, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, సిపిఓ భీమరాజు, డ్వామా పీడీ ఎన్వీ శివ ప్రసాద్ యాదవ్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News