మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వేసవి వడగాలుల దృష్ట్యా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కలెక్టరేట్లోని వారి చాంబర్లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే మూడవ శనివారం స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా బీట్ ద హీట్ –వేసవి వడగాలుల బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రజలందరికీ వివరించాలన్నారు. వడగాలుల వలన ఏ ఒక్కరూ చనిపోరాదన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఆ రోజున గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో స్వయం సహాయక సంఘాల మహిళలు, ఉపాధి హామీ శ్రామికులు, గ్రామపంచాయతీల పారిశుధ్య కార్మికులు తదితరులతో సమావేశం నిర్వహించి వారికి వేసవి వడగాలుల దృష్ట్యా తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు వివరించాలన్నారు. వారు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏమిటో స్పష్టంగా తెలియజేయాలన్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను కూడా సిద్ధం చేసి ఆ రోజున ప్రజలందరికీ పంపిణీ చేయాలన్నారు. పిల్లలు వయోవృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 5 పడకలను ప్రత్యేకించి వడగాలుల బాధితుల కోసం కేటాయించాలన్నారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లోనూ ముఖ్యమైన ప్రదేశాలలో చలివేంద్రాలను నిరంతరం నడపాలన్నారు.
ఈ సమావేశంలో డ్వామా, డి ఆర్ డి ఏ పీడీలు శివప్రసాద్, హరిహరనాథ్, డిఎంహెచ్వో డాక్టర్ శర్మిష్ఠ, జడ్పీ డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, డిపిఓ అరుణ, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News