-30 పరీక్షా కేంద్రాలలో ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయి
-జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మే 19 నుంచి మే 28వ తేదీ వరకు 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశపు మందిరంలో విద్య, వైద్య, ఏపీఎస్ఆర్టీసీ, పోలీసు, పోస్టల్, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులతో పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 30 పరీక్షా కేంద్రాలలో ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయని, ఆయా శాఖలు సమన్వయం చేసుకుంటూ పరీక్షల నిర్వహణకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,544 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. పగడ్బందీ పరీక్షల నిర్వహణ నిమిత్తం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్, కస్టోడియన్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందన్నారు.
ఆయా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, వాటికి సమీపంలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరవకుండా చూడాలని అన్నారు. అదేవిధంగా కేంద్రాల వద్ద ముఖ్యమైన ఔషధాలతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను వైద్య సిబ్బంది సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అసౌకర్యం లేకుండా నిరంతరాయ విద్యుత్, ఆయా రూట్లలో విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మే 19వ తేదీన ప్రధమ భాష, 20న ద్వితీయ భాష, 21న ఆంగ్లం, 22న గణితం, 23న భౌతిక శాస్త్రం, 24న జీవశాస్త్రం, 26న సాంఘిక శాస్త్రం, 27న ప్రథమ భాష పేపర్–2 (కాంపోజిట్ కోర్స్), ఓపెన్ స్కూల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1, 28న ఓపెన్ స్కూల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–2 పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
ఈ పరీక్షలకు సమాంతరంగా 14 పరీక్షా కేంద్రాలలో ఓపెన్ స్కూల్ ఎస్ ఎస్ సి, ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా జరుగుతాయని, మొత్తంగా 2,307 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.
Prajavartha Online Telugu News