– గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రూ. 10,500 కోట్లు అదనం
– ప్రాధాన్య రంగానికి రూ. 33 వేల కోట్ల రుణ ప్రతిపాదనలు
– బ్యాంకుల వారీగా లక్ష్యాలు చేరుకునేందుకు కృషిచేయాలి
– ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త లక్ష్య సాధనలో కీలక భాగస్వాములు కావాలి
– వినియోగదారుణ్ని ఉత్పత్తిదారునిగా చేసే పీఎం సూర్యఘర్‌పై విస్తృత అవగాహన కల్పించాలి
– రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సంక్షేమం, ఆర్థిక ప్రగతి, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలను విజయవంతం చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమని.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ. 83,500 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక (ఏసీపీ) లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేందుకు బ్యాంకులు కృషిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
మంగళవారం ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో లీడ్ జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లాస్థాయి సమీక్ష కమిటీ (డీఎల్ఆర్‌సీ) సమావేశాలు జరిగాయి. సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి 2025-26 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఎల్‌డీఎం.. గత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో వివిధ బ్యాంకుల పాత్ర, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన కీలక సూచికల్లో ప్రగతి, ప్రభుత్వ పథకాలకు సంబంధించి బ్యాంక్ లింకేజీ రుణాలు, ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు తదితరాలను పీపీటీ ద్వారా వివరించారు. అనంతరం మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగానికి రూ. 13,500 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 17వేల కోట్లు రుణ లక్ష్యాలను ప్రతిపాదించినట్లు తెలిపారు. మొత్తం ప్రాధాన్యరంగానికి రూ. 33 వేల కోట్లు, ప్రాధాన్యేతర రంగానికి రూ. 50,500 కోట్ల మేర లక్ష్యాలను రుణ ప్రణాళికలో పొందుపరిచినట్లు వివరించారు. ఇతర ప్రాధాన్య రంగానికి రూ. 2,495 కోట్ల రుణాలను ప్రతిపాదించినట్లు తెలిపారు. గతేడాది రుణ ప్రణాళిక లక్ష్యాల సాధనలో బ్యాంకులు మంచి ప్రగతి కనబరిచాయని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ బ్యాంకులు మరింత కీలకంగా వ్యవహరించి, లక్ష్యాలను చేరుకునేందుకు కృషిచేయాలన్నారు. వినియోగదారుణ్ని ఉత్పత్తిదారునిగా మార్చే, పర్యావరణ హిత, ఆర్థిక వృద్ది చోదక పీఎం సూర్యఘర్ పథకంపై పెద్దఎత్తున అవగాహన కల్పించాలని, లక్ష్యాల మేరకు లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రధానమంత్రి ముద్రా యోజన, స్టాండప్ ఇండియా, పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మ, ఏపీ టిడ్కో తదితర పథకాల ద్వారా చివరిమైలు వరకు లబ్ధిచేకూరేలా బ్యాంకులు మద్దతు అందించాలని సూచించారు. ఏపీ టిడ్కోపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయూతనందించాలన్నారు. ముఖ్యమంత్రి ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త లక్ష్యాలు నెరవేరాలంటే బ్యాంకుల మద్దతు చాలా ముఖ్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
వినూత్న ఆలోచనలతో ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త: కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
వికసిత్ భారత్ – 2047, స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాలు నెరవేరాలంటే బ్యాంకుల భాగస్వామ్యం చాలా ముఖ్యమని.. జిల్లాలో వినూత్న ఆలోచనలతో ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త కింద పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని.. ఇందుకు బ్యాంకులు లబ్ధిదారులకు అవసరమైన రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తితో త్వరితగతిన దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. ఈ ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ. 855 కోట్ల మేర జీవనోపాధి రుణాలు మంజూరు జరుగుతున్నందున వాటిని సద్వినియోగం చేసుకునేలా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా జిల్లా అధికార యంత్రాంగం కృషిచేస్తోందని, ఇందులో బ్యాంకులు కూడా భాగస్వాములై 100 శాతం లక్ష్యాల సాధన దిశగా కృషిచేయాలన్నారు. సేంద్రియ వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని రైతులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లా జీవీఏ (స్థూల విలువ జోడింపు)ను పెంచేందుకు పశు సంవర్థక, ఉద్యాన రంగాల్లో మంచి అవకాశాలున్నాయని.. ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామంలోనూ పెద్దఎత్తున ఉద్యాన పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి సృష్టితో పాటు పశు ఉత్పాదకతను పెంచేందుకు, పాడి రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ (ఎన్ఎల్ఎం)ను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
రూ. 30 వేల కోట్లతో నాబార్డ్ రుణ ప్రణాళిక
సమావేశంలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) జిల్లా ప్రాధాన్యత రంగానికి సంబంధించి దాదాపు రూ. 30 వేల 48 కోట్లతో పొటన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ (పీఎల్‌పీ)ను కూడా ఆవిష్కరించారు.
సమావేశంలో డీసీసీ కన్వీనర్, యూబీఐ రీజనల్ హెడ్ ఎంవీ తిలక్, ఆర్‌బీఐ ఎల్‌డీవో సీహెచ్ నవీన్ కుమార్, నాబార్డు డీడీఎం మిలింద్ చౌసాల్కర్, ఎల్‌డీఎం కె.ప్రియాంక, ఆర్‌సేతి డైరెక్టర్ అమరేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, టిడ్కో ఈఈ చిన్నోడు, డీఆర్‌డీఏ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.కిరణ్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News