Breaking News

మద్యం కుంభకోణంలో పాత్రదారులు, సూత్రదారులు ఎవరూ తప్పించుకోలేరు

-ఢిల్లీ మద్యం కుంభకోణంలో వందకోట్లకే అక్కడి సీఎం, డిప్యూటీ సీఎంలు అరెస్ట్ అయ్యారు
-ఏపీలో వేల కోట్ల కుంభకోణం జరిగింది.. సిట్ విచారణలో నిజాలు బయటకు వస్తున్నాయి
-అందుకే అబద్దపు రాతలతో జగన్ రెడ్డి మీడియా విషం చిమ్ముతుంది
-నాన్ డ్యూటీ లిక్కర్ ను ప్రభుత్వ షాపుల్లో అమ్మి… ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు
-పేరున్న బ్రాండ్ లను తరిమికొట్టి.. సొంత బ్రాండ్ లకు ఆర్డర్లు ఇచ్చుకొని కమీషన్ లు దోచుకున్నారు
-నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీశారు
-నేడు మద్యం అమ్మకాలపై మళ్లీ సిగ్గులేని రాతలు రాస్తున్నారు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త  :
కమీషన్ ల కోసం పేరున్నబ్రాండ్ లను రాష్ట్రం నుండి తరిమికొట్టి.. సొంత బ్రాండ్ లకే ఆర్డర్లు ఇచ్చి.. దోచుకోవడానికి డిజిటల్ లావాదేవీలు లేకుండా చేసి వేల కోట్లు కొల్లగొట్టారని.. ప్రభుత్వ మద్యం షాపుల్లో నాన్ డ్యూటీ లిక్కర్ ను అమ్మి.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారని…. అలాగే నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీశారని.. నేడు అవి ఒక్కొక్కటిగా సిట్ విచారణలో బయటకు వస్తుంటే.. ఓర్వలేని జగన్ రెడ్డి విషపత్రిక.. అబద్దాలను ప్రచారం చేస్తుందని.. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశలో ఆయన మాట్లాడారు.

కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో సొంత లాభాల కోసం మద్యం అమ్మకాలను భ్రష్టుపట్టించారు. నేడు వారు చేసిన పాపాలు బయటకు వస్తుంటే జగన్ రెడ్డి నీచ పేపర్ తప్పుడు కథనాలను ప్రచురిస్తుంది. జగన్ రెడ్డి తొత్తుల బాగోతాలు బయటపడుతుంటే అబద్ధాలను ప్రచారం చేసి ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన వైట్ పేపర్‌లలో ఏ విధంగా దోపిడీ చేశారో క్లియర్‌గా చెప్పాం. వైసీపీకి నాడు నెంబర్ 2గా ఉన్న వ్యక్తి కూడా విచారణలో ఇదే చెప్పారు. ఇప్పుడు విచారణ జరుగుతున్న వ్యక్తులను టీడీపీకి అంటగట్టాలని వైసీపీ చూడటం సిగ్గుచేటు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప, ధనుంజయరెడ్డి, విష్ణుమోహన్ రెడ్డిల పాత్రలపై స్పష్టమైన ఆధారాలతో వార్తలు వస్తుంటే.. తప్పుడు కథనాలు రాయిస్తూ మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నారు. వీరంతా నిన్నటి వరకు ఎవరితో ఉన్నారు? సీట్ విచారణలో పాత్రదారులు, సూత్రధారులు ఎవరెవరో అంతా బయటకు వస్తుంది.

2019 వరకు వీరికి ఎవరికైనా మద్యం వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయా? 2019 వరకు మద్యం వ్యాపారంతో సంబంధం లేని వీళ్లు వైసీపీ ప్రభుత్వంలో మద్యం వ్యాపారంలోకి వచ్చింది వాస్తవం కాదా? దీనికి పూర్తి ఆధారాలు ఉన్నాయి. అయినా ఇంకా మభ్యపెట్టాలని చూస్తున్నారు. 10 మద్యం డిపోలను తాకట్టు పెట్టి 13 వేల కోట్లు తీసుకొచ్చి దారి మళ్లించి కమీషన్‌లు కొళ్లగొట్టింది వాస్తవం కాదా? ఏఆర్ఈటీ అని పెట్టి 23 వేల కోట్లు అప్పులు తీసుకొచ్చింది వాస్తవం కాదా? భవిష్యత్‌కు సంబంధించి అమ్మకాలను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఆ డబ్బులను దారి మళ్లించి కమీషన్ కొళ్లగొట్టింది వాస్తవం కాదా? ఆధాన్, లీలా, ఎన్వీ, v9, సోనా, మూనాక్ అనే కంపెనీలు 2019 ముందు ఏపీలో ఉన్నాయా? ఈ కంపెనీలు ఎలా పుట్టుకొచ్చాయి? దీనికి సమాధానం మీరు చెప్పగలరా? రేట్లు పెంచింది మీరు కాదా? ఎక్కడా డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా రూ. 99,413.5 కోట్లు ఓన్లీ క్యాష్ పేమెంట్ ను ప్రోత్సహించారు. ఇంత డబ్బు ఎక్కడికి వెళ్లింది? ఎవరి ప్యాలెస్‌కు వెళ్లింది? డైరెక్ట్ గా షాపుల్లో వైసీపీ సొంత మనుషులను పెట్టుకొని ప్రభుత్వం నుండి సప్లై చేసే మద్యాన్ని లేకుండా చేసి.. నాన్ డ్యూటీ లిక్కర్ తెచ్చి అమ్మి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. వారి జేబులను నింపుకున్నారు.

అధిక అద్దెలు చెల్లించి దోచుకున్నారు. సొంత బ్రాండ్‌లు మాత్రమే షాపుల్లో పెట్టి, మల్టీ నేషనల్ కంపెనీలను రానివ్వకుండా ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడిచారు. మేము అధికారంలోకి వచ్చాక పారదర్శకంగా షాపులు కేటాయించాం. పాలసీ విధానం స్పష్టంగా అమలు చేశాం. సమయాన్ని తగ్గించామని, షాపులు తగ్గించామని సిగ్గులేని రాతలు రాస్తున్నారు. 2020 నాటికి 2,934 షాపులు ఉంటే, వాటిని 3,396 షాపులకు పెంచింది వాస్తవం కాదా? మేము ఎక్కడా షాపులు పెంచలేదు. బెల్ట్ షాపులు లేవని చెప్పారు. బెల్ట్ షాపులు లేకపోతే మీరు లక్ష కేసులు ఎలా పెట్టారు? షాపులు మీ సొంత మనుషులతో పెట్టి విచ్చలవిడిగా అమ్మించింది వాస్తవం. అవన్నీ సిట్ విచారణలో బయటకు వస్తాయి. మల్టీ నేషనల్ కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వకుండా, మీకు సంబంధించిన బ్రాండ్‌లకు మాత్రమే ఆర్డర్స్ ఇచ్చారు. 2019-2024లో 8 శాతం నుండి 132 శాతానికి 43 బ్రాండ్‌లకు మాత్రమే ఆర్డర్స్ ఇచ్చారు. నేడు దాదాపు 300 బ్రాండ్‌లకు ఆర్డర్లు ఇస్తున్నాం. కేవలం 43 బ్రాండ్‌లకు ఆర్డర్స్ ఇచ్చి కోట్లు కొళ్లగొట్టింది వాస్తవం కాదా? బాటిల్ తయారీ నుండి షాపులు, కొనుగోలుదారుని వద్దకు వెళ్లేవరకు ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టాం, ట్రాకింగ్ చేస్తున్నాం. బెదిరించి డిస్టిలరీలను స్వాధీనం చేసుకున్నది వాస్తవం కాదా? కొన్ని డిస్టిలరీలను బయపెట్టి, వాటిని లాక్కొని, అక్కడ మీ సొంత బ్రాండ్‌లను తయారు చేసుకోవడానికి వాడుకున్నారు.

2019 ప్రభుత్వం మారే నాటికి గతంలో తెలంగాణకు మనకు ఉన్న వ్యత్యాసం కేవలం 4,186 కోట్లు మాత్రమే. గత ప్రభుత్వ పాలనలో రూ. 42,762 కోట్ల వ్యత్యాసం ఉంది. ఈ ఆదాయం అంతా ఏమైంది? జగన్ బ్రాండ్ తాగడం వల్ల లివర్లు, కిడ్నీలు చెడిపోయి చాలా మంది మరణించారు, మానసిక వ్యాధిగ్రస్తులుగా మారారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నమోదైన రికార్డులను పరిశీలిస్తే వాస్తవాలు బయటపడుతున్నాయి. నాసిరకం మద్యం తాగి ప్రజలు ఆర్థికంగా నష్టపోయారు. మల్టీ నేషనల్ కంపెనీలకు బకాయిలు ఇవ్వకపోవడంతో వారు రాష్ట్రం నుండి వెళ్లిపోయారు. నేడు ల్యాబ్‌లలో 12 రకాల టెస్ట్ లను చేయిస్తున్నాం. మల్టీ నేషనల్ కంపెనీలు తిరిగి మన రాష్ట్రానికి వస్తున్నాయి. గతంలో ఉన్న వ్యత్యాసాన్ని కరెక్ట్ చేశాం. మద్యం రేటు పెరగాలన్నా, కొత్త బ్రాండ్‌లు తీసుకురావాలన్నా టెండర్ కమిటీ ఆధ్వర్యంలో జరగాలి. కానీ గత ఐదేళ్లు టెండర్ కమిటీ ఏర్పాటు చేయలేదు. వారి బ్రాండ్‌లు సప్లై చేసుకోవడం కోసం అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోచుకున్నది వాస్తవం. ఒక్కో కేసుకు రూ. 150 నుండి రూ. 900 కమీషన్‌లు కొళ్లగొట్టినట్లు వైసీపీ నేతలే చెప్పారు. ఇవన్నీ బయటకు వస్తున్నాయి. గతంలోనే మేము 32 వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పాం. నేడు అవే లెక్కలు రుజువు అవుతున్నాయి. ఢిల్లీ కుంభకోణం కేవలం 100 కోట్లకు సంబంధించింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం, పక్క మాజీ ముఖ్యమంత్రి కూతురు, శరత్ చంద్రారెడ్డిలు అరెస్ట్ అయ్యారు. ఏపీలో జరిగింది వేల కోట్ల స్కాం. ఇది బయట పడుతుంటే.. తప్పుడు కథనాలు రాసి.. బురద చల్లి తప్పించుకోవాలనుకున్నా.. ఎవరూ తప్పించుకోలేరు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *