గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మన దేశంలో ప్రజలకు భూమి గౌరవం, సెంటిమెంట్, ఆర్థిక భరోసా ఇస్తుందని, అటువంటి భూముల రికార్డులు సమస్యలేకుండా ఉండటానికి అన్ని రాష్ట్రాల్లో భూముల రీసర్వే కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్నారని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
గురువారం గుంటూరులోని ఐటీసీ వెల్కమ్ హోటల్ లో కేంద్ర గ్రామీణాభివృధ్ది మంత్రిత్వ శాఖ, భూ వనరుల విభాగం ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా సర్వే, రీసర్వే పై జరిగిన జాతీయ కార్యశాలలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, కేంద్ర ప్రభుత్వ భూ వనరుల శాఖ సెక్రటరీ మనోజ్ జోషి, రాష్ట్ర రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సీసీఎల్ఎ జి జయలక్ష్మీ, కేంద్ర ప్రభుత్వ భూ వనరుల శాఖ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్ధి, రాష్ట్ర సర్వే సెటిల్మేంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి , ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఏ భార్గవ తేజ, ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులతో కలసి పాల్గొన్నారు. జ్యోతి వెలిగించి వర్క్ షాపును ప్రారంభించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ భూ వివాదాలు ఏళ్ల తరబడి కోర్టుల్లో పెండింగ్ లో ఉంటున్నాయని, గౌరవ సుప్రీం కోర్టులో సైతం ప్రతి నాలుగు కేసుల్లో ఒకటి భూ వివాదాలకు సంబంధించి ఉంటుందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే గ్రీవెన్స్ లోను భూ సమస్యల అర్జీలే ఎక్కువుగా వస్తున్నాయన్నారు. దీని వల్ల భూ యజమానులు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. అమెరికాలో మన ఇళ్లు, భూమి వద్దకే అధికారులు వచ్చి రిజిస్ట్రేషన్ చేసి వెళ్తారని, నేను అక్కడ ఇళ్లు కొన్న తర్వాత కేవలం 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి కావటంతో ఆశ్చర్య పోయాను అన్నారు. మన దేశంలోను ఇదే తరహాలో భూములు రిజిస్ట్రేషన్ జరగాలన్నారు. విజనరీ నాయకులు గౌరవ ప్రధాన మంత్రి నాయకత్వంలో భూముల రీ సర్వే ప్రారంభించటం జరిగిందని, ఇప్పటికీ 90 శాతం భూ రికార్డుల డిజిటలైజేషన్ పూర్తి అయ్యిందన్నారు. వంద సంవత్సరాల తర్వాత జరుగుతున్న భూముల సర్వే కాబట్టి జాగ్రత్తగా చేయాలన్నారు. సిబ్బంది కొరత, నిధులు సమస్య అధిగమించటం పై దృష్టి సారించామని, నిర్దేశించిన సమయానికి సర్వే పూర్తి చేయాలని అధికారులకు సూచిస్తున్నామన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. భూ సర్వే వలన చిన్న సన్నకారు రైతులకు, మహిళలు, ఎస్సీ ఎస్టీ లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఏపి రాజధాని అమరావతి అద్భుతంగా నిర్మితం అవుతుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో భూ రికార్డుల డిజిటలైజషన్ సజావుగా జరిగేలా చూడాలన్నారు.
రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ భూముల రీసర్వే ద్వారా కేవలం భూమిని కొలవడం మాత్రమే కాదు – విశ్వాసాన్ని పునరుద్ధరిస్తున్నామని, చారిత్రక భూ వివాదాలను పరిష్కరిస్తున్నామని మరియు బలమైన, ఆధునిక మరియు సమగ్ర భూ రికార్డుల వ్యవస్థకు పునాది వేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూ హక్కుల రికార్డులు పారదర్శకంగా, ఖచ్చితత్వంగా రూపొందించాలని అదేశించారన్నారు. భూముల సర్వే, రీ సర్వే జాతీయ వర్క్ షాపు పురోగతిని సమీక్షించడానికి, ఆవిష్కరణలను పంచుకోవడానికి మరియు భూ సంస్కరణలు మరియు ఆధునీకరణకు నిబద్ధతను బలోపేతం చేయడానికి ఒక గొప్ప అవకాశంగా పనిచేస్తుందన్నారు. లక్షలాది మంది రైతులు మరియు భూ యజమానుల గౌరవం మరియు జీవనోపాధికి భూమి కేంద్రీకృతమై ఉందని గుర్తించి, ప్రస్తుత భూముల సర్వే వ్యవస్థలను సమీక్షించడానికి తక్షణ చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో గత పాలకులు 6,688 గ్రామాలలో అస్తవ్యస్తంగా రీ సర్వే చేసినట్లు గుర్తించామన్నారు. పిర్యాధుల పరిష్కారంకు తక్కువ సమయం కేటాయించటంతో పాటు, సర్వే హద్దు రాళ్లపై బొమ్మలు పెట్టుకొని నిధులు దుర్వినియోగం చేశారన్నారు. దీంతో భూ యజమానులు గతంలో జరిగిన రీ సర్వే పై పెద్ద ఎత్తున లోపాలు, పిర్యాదులు తెలిపారన్నారు. దీనిపై దిద్దుబాటు చర్యలు చేపట్టాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేశాల మేరకు రెవెన్యూ మంత్రిగా రీ సర్వే జరిగిన ప్రతి గ్రామంలోను ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహించి భూ యజమానుల నుంచి పిర్యాదులు స్వీకరించటం జరిగిందన్నారు. గ్రామ సభల్లో అందిన, 2.8 లక్షలకు పైగా ఫిర్యాదులను పరిష్కరించటం జరిగిందన్నారు. భూముల రీసర్వే పై పారదర్శకత, నమ్మకాన్ని పెంపొందించడానికి మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకుని పైలట్ రీసర్వేను ప్రారంభించామన్నారు. 626 పైలెట్ గ్రామాల్లో 13,41,513 ఎకరాల విస్తీర్ణంలోని భూములను రీ సర్వే పునఃసర్వే అత్యంత శ్రద్ధతో చేశామన్నారు. ఈ పైలట్ గ్రామాలు అభ్యాస కేంద్రాలుగా పనిచేశాయని మరియు ఆచరణాత్మక సవాళ్లను అర్థం చేసుకోవడానికి ఒక చక్కని పద్దతిని రూపొందిచటానికి సహయపడిందన్నారు. కొత్త వ్యవస్థ కింద: • సర్వే ప్రక్రియ, సరిహద్దు వివాదాల కారణాలు మరియు వాటి పరిష్కారం కోసం చట్టపరమైన విధానాలను వివరించడానికి ప్రీ-సర్వే అవగాహన ప్రచారాలు మరియు గ్రామ స్థాయి సమావేశాలు నిర్వహించటం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామాన్ని 200–250 ఎకరాల బ్లాకులుగా విభజించారు, ప్రతి బ్లాక్‌కు అంకితమైన గ్రామ రీ సర్వే బృందంను కేటాయించామన్నారు. భూ సర్వే పై సమర్థవంతమైన సమాచారం భూ యజమానులకు అందించటానికి ప్రతి గ్రామానికి కమ్యూనికేషన్ బృందం ఏర్పాటు చేసి, రియల్ టైమ్ లో సమాచారంను అందించటానికి ప్రతి బ్లాక్‌కు 50–70 మంది భూ యజమానులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పటు చేశామన్నారు. కమ్యూనికేషన్ బృందాలు భూ యజమానులను వ్యక్తిగతంగా పరిచయం చేసుకుంటాయి మరియు సర్వే షెడ్యూల్‌ల గురించి వాట్సాప్, ఫోన్ కాల్స్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా భూ యజమానులకు తెలియజేస్తున్నారని, రీ సర్వేలో పారదర్శకత మరియు భూ యజమానుల భాగస్వామ్యానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రతి భూ యజమానికి వారి భూమి కొలత సమయంలో హాజరు కావడానికి మూడు సార్లు అవకాశం ఇవ్వటం జరుగుతుందని, భూ యజమానులు వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతే, వారి సరిహద్దులను గుర్తించడానికి వీడియో కాల్స్ ఎంపికను కూడా అందిస్తున్నామన్నారు. చట్టపరమైన స్పష్టతను నిర్ధారించడానికి ఏవైనా వ్యత్యాసాలను గ్రామంలోనే సమీక్షించి గ్రామ సర్వే బృందం అక్కడికక్కడే పరిష్కరించటానికి అభ్యంతరాలు మరియు అప్పీళ్లను గ్రామంలోనే పరిష్కరించవచ్చని నిర్ధారిస్తూ మండల మొబైల్ మేజిస్ట్రేట్ వ్యవస్థను ప్రవేశపెట్టామన్నారు. చట్ట ప్రకారం తప్పనిసరి చేసిన చట్టబద్ధమైన వ్యవధి తర్వాత మాత్రమే సర్వే రికార్డులు ఇప్పుడు ఖరారు చేస్తున్నామని, అంతేకాకుండా, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో రీసర్వే నిపుణుల సెల్ ఏర్పాటు చేసి, సర్వే నియమాలు మరియు విధానాల గురించి ప్రజల ప్రశ్నలకు మార్గదర్శకత్వం మరియు సమాధానాన్ని అందిస్తున్నామన్నారు. జవాబుదారీతనాన్ని మరింత పేంచేందుకు సర్వే బృందం పనిపై ఏదైనా అభ్యంతరం తలెత్తితే, తిరిగి సర్వే చేయటానికి వేరే బృందాన్ని నియమిస్తున్నామన్నారు. సర్వే బృందాలు మ్యాప్ కోఆర్డినేట్‌లపై ఆధారపడకుండా గట్లు మరియు మూలలతో సహా ప్రతి ఒక్క క్షేత్రాన్ని భౌతికంగా కొలుస్తున్నారని, భూ యజమానులు మరియు ప్రక్కనే ఉన్న భూ యజమానులు హాజరు కావాలని , భూ యజమానులు తమ భూమి యొక్క జియో-ట్యాగ్ చేయబడిన ఫోటోలను అప్‌లోడ్ చేయాలని, పారదర్శకత యొక్క మరొక లేయరును జత చేయాలని అదేశించామన్నరు., విజయవంతమైన పైలట్ తర్వాత, రెండవ దశలోకి 749 గ్రామాల్లో 14,15,358 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న భూముల రీసర్వే నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వేను 2027 చివరి పూర్తి చేసేందకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి మూడు నెలలకు ఒక కొత్త దశ ప్రారంభించబడింది, మిగిలిన 8,751 గ్రామాలను రీ సర్వే పూర్తి చేస్తామన్నారు. ఖచ్చితత్వం, సామర్థ్యం మరియు సమగ్రతను నిర్ధారించడానికి సీనియర్ ఐఎఎస్ అధికారులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు మరియు జిల్లా ప్రత్యేక అధికారులు కఠినంగా పురోగతిని పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రతి రైతు, ప్రతి భూ యజమాని మరియు మన రాష్ట్ర భవిష్యత్తు ప్రయోజనం కోసం డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆదునీకరణ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.
కేంద్ర ప్రభుత్వ భూ వనరుల శాఖ సెక్రటరీ మనోజ్ జోషి మాట్లాడుతూ రాష్ట్రంలో భూముల రీసర్వే కార్యక్రమం ఖచ్చితమైన ప్రమాణాలతో వేగవంతంగా జరుగుతుందన్నారు. భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్, రెవెన్యూ, సర్వే , స్థానిక సంస్థల్లో ఉన్న రికార్డులన్నీ ఎకీకృతం చేయటం ద్వారానే ఖచ్చితమైన భూ రికార్ఢులను సృష్టించవచ్చన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రీ సర్వే ద్వారానే గ్రామాల్లో, పట్టణాల్లోని భూ రికార్డుల డిజిటలైజేషన్ లో ఇది సాధ్యం అవుతుందన్నారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సీసీఎల్ఎ జి జయలక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్రంలో భూముల సర్వే, రీ సర్వే కార్యక్రమంలో చాలా ముందు ఉందని, రీ సర్వే ద్వారా భూ సమస్యలు చాలా పరిష్కరించటం జరిగిందన్నారు. రాజదాని ప్రాంతంలో భాగమైన గుంటూరు నగరంలో తొలిసారిగా జాతీయ స్థాయి వర్క్ షాపు ను ఏర్పాటు చేసినందుకు కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ కు ప్రత్యేకంగా దన్యవాదాలు తెలుపుతున్నాము. రీ సర్వే కు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ సైతం రీసర్వేకు దాదాపు రూ.500 నుంచి రూ.600 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. వ్యవసాయ భూముల ఖచ్చితమైన రికార్డులు డిజిటల్ లో అందుబాటులో ఉండటం వలన రైతులకు పీఎం కీసాన్ వంటి పధకాల ద్వారా ఆర్దిక సహాయం అందించటంతో పాటు వివిద రకాల పంట రుణాలను సత్వరమే మంజూరు చేసే వీలు కలుగుతుందన్నారు. సర్వే, రీ సర్వే జాతీయ వర్క్ షాపు వలన ఇతర రాష్ట్రాలు రీసర్వే కి అవలంభిస్తున్న ఉత్తమ విధానాలు, ఉత్తమ టెక్నాలజీని నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. రెవెన్యూ, సర్వే శాఖలు రాష్ట్రంలో మిగిలిన గ్రామాల్లోను రీ సర్వేను 2027కి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, కేంద్ర ప్రభుత్వం రీ సర్వే కి సంబంధించి అందించాల్సిన నిధులను సత్వరమే అందించాలన్నారు.
శాసన సభ్యులు బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ భూ యజమానులు ఐదు ఎకరాలు దానం ఇవ్వటానికి సిద్దంగా ఉంటారు కానీ, భూ రికార్డులో ఒక్క సెంటు వత్యాసం ఉన్న ఒప్పుకోరని అటువంటి సెంటిమెంట్ భూములపై ఉంటుందన్నారు. గతంలో భూ రికార్డులు రెవెన్యూ లోని పార్ట్ టైం ఉద్యోగులైన కరణాలు వద్ద ఉండేవని, టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రి అయిన తరువాత ల్యాండ్ రికార్డులను ప్రభుత్వ ఉద్యోగుల ఆదీనంలో ఉంచటం జరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకు వేసి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళకుండానే భూ యజమానులు వాళ్ళ ఫోను లలోనే చూసుకుని, భూ సంబంధిత సర్టిపికేట్లు పొందేలా డిజిటలైజేషన్ చేయటం జరుగుతుందన్నారు.
వర్క్ షాపులో దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న భూముల రీ సర్వే పురోగతిపై కేంద్ర భూ వనరుల శాఖ జాయింట్ సెక్రటరీ కునల్ సత్యార్ధి, రాష్ట్రంలో భూముల రీసర్వే పురోగతిని రాష్ట్ర సర్వే సెటిల్మేంట్ ల్యాండ్ రికార్డ్స్ డైరక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలిపారు. అదే విధంగా అస్సాం, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలలో రీ సర్వే పురోగతి సంబంధిత రాష్ట్రాల అధికారులు వివరించారు.
రాష్ట్రంలో వ్యవసాయ భూముల రీసర్వే, పట్టణాల్లో భూములు రీసర్వే ఎన్ ఏ కే ఎ ఎస్ హెచ్ ఏ (నక్షా) ప్రక్రియకు సంబంధించిన వివిధ దశలు వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ భార్గవ తేజ కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, కేంద్ర ప్రభుత్వ భూ వనరుల శాఖ సెక్రటరీ మనోజ్ జోషి, రాష్ట్ర రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సీసీఎల్ఎ జి జయలక్ష్మీ, కేంద్ర ప్రభుత్వ భూ వనరుల శాఖ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్ధి, వర్క్ షాపుకు వచ్చిన ప్రతినిధులకు వివరించారు.
విలేకరుల సమావేశం :-
అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తో కలిపి గుజరాత్ మరియు కొన్ని రాష్ట్రాలలో ఈ రిసర్వే వర్క్ స్పీడ్ గా జరుగుతుందని, అయితే స్పీడ్ తక్కువగా ఉన్న రాష్ట్రాలను కూడా కలిపి వర్క్ లో వేగం పెంచాలనే ఉద్దేశంతో జాతీయ వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్ కాలంలో భూముల రీ సర్వే జరిగిందని, అందువల ప్రస్తుత భూ రికార్డులతో అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో భూముల రీ సర్వేకి శ్రీకారం చుట్టిందని , దానికి అవసరమైన నిధులను అందిస్తుందన్నారు. నిర్దేశిత సమయంలో సర్వే పూర్తి చేస్తే ప్రోత్సహక నిధులను అందిస్తున్నారన్నారు. రీసర్వే, భూ రికార్డుల డిజిటలైజేషన్ ఉత్తమ విధానలపై చర్చించటానికి దేశంలోని 31 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అధికారులు, సర్వే ఆఫ్ ఇండియా అధికారులు వర్క్ షాపుకు హాజరయ్యారన్నారు. 6జీ టెలికం సేవలలో ప్రపంచంలోను అగ్రగామిగా నిలపటానికి రిసర్చ్ ఇనిస్టిట్యూషన్లలో ఉన్న సాంకేతికను అందిపుచ్చుకోవటం జరుగుతుందన్నారు.
రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ పేదవాడికి ఎమోషన్ , సెంటీమెంట్ అయిన భూమికి సంబంధించిన హక్కు పత్రాలను పకడ్బందీగా ఇవ్వటానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం రీ సర్వే కి కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకారం అందించినా సరిగ్గా శ్రద్ద పెట్టలేదన్నారు. పిర్యాదులకు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన గడువు కాకుండా కేవలం పదిహేనురోజులు మాత్రమే ఇచ్చారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి అందరిని భయభ్రాంతులకు గురి చేశారన్నారు. కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో రీ సర్వేను పకడ్బందిగా నిర్వహించటం జరుగుతుందని, గత ప్రభుత్వంలో రీ సర్వే జరిగిన గ్రామాల్లో వచ్చిన 2.80 లక్షల పిర్యాదులను పూర్తి స్థాయిలో పరిష్కరించటం జరిగిందని, సాధ్యం కాని వాటిని భూ యజమానులకు వివరించటం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబా నాయుడు రీ సర్వే వలన పేదవారికి అన్యాయం జరగకుండా చూడాలని నిరంతరం మార్గనిర్దేశం చేస్తూ పర్యవేక్షిస్తున్నారన్నారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృత్తం కాకుండా 200 – 250 ఎకరాలు ఒక బ్లాక్ గా పెట్టి ముగ్గురు అధికారులతో సర్వే చేయటంతో పాటు భూ యజమానులకు పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చి వారిని బాగస్వాములను చేయటం జరుగుతుందన్నారు. భూముల జియో ట్యాగింగ్ తో కూడిన క్యూఆర్ కోడ్ తో నూతన పాస్ పుస్తకాలు ఇవ్వటం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం హక్కు పత్రాలపై , సర్వే రాళ్ళ పై ఫోటోలు వేసుకొని కోట్ల రూపాయిల నిధులను దుర్వినియోగం చేసిందన్నారు. ప్రజల హితం కోరే ప్రభుత్వం గా పూర్తి పారదర్శకంగా భూ హక్కుల పత్రాలను అందించటం జరుగుతుందన్నారు. ఇక్కడ జాతీయ వర్క్ షాపు నిర్వహించటానికి కృషి చేసినందుకు కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
సమావేశంలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఉన్నతాధికారులు, నగరపాలక సంస్థ కమిషనరు పులి శ్రీనివాసులు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, ఆర్డీవో శ్రీనివాసులు, రెవెన్యూ, సర్వే శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు పాల్గోన్నారు.
Prajavartha Online Telugu News