మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ ఒక ప్రకటనలో కోరారు. వచ్చే జూన్ 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున విశాఖపట్నంలో జరిగే కార్యక్రమాల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటున్నారన్నారు. అదే సమయంలో జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలందరూ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనుటకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉందన్నారు. గ్రామ వార్డు సచిపాలయాల సిబ్బంది ఇంటింటికి తిరిగి యోగాంధ్ర కార్యక్రమం గురించి ప్రజలందరికీ తెలియజేసి వారి పేర్లను యోగాంధ్ర యాప్ లో నమోదు చేయాలని ఇప్పటికే సూచించామన్నారు. ఆ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోందన్నారు. ప్రజలందరూ సిబ్బందికి సహకరించి వచ్చే జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.
అంతేకాకుండా జిల్లా అధికారులు వారి కార్యాలయపు ఉద్యోగులందరికీ యోగాంధ్ర యాప్ https://yogandhra.ap.gov.in/#/home/yoga లో పేర్లు నమోదు చేసుకునేలా చొరవ చూపాలన్నారు
మండల స్థాయి మాస్టర్ ట్రైనర్లను యోగా ప్రోటోకాల్ వై శనివారం డి ఎం హెచ్ ఓ కార్యాలయంలో, ఆదివారం జడ్పీ కన్వెన్షన్ హాలులో న్యూఢిల్లీలోని యోగా శిక్షణ సంస్థ తో పాటు టి వో టి ల ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.
మండల కేంద్రాల్లో ఒక అనువైన ప్రదేశాన్ని గుర్తించి అక్కడ మాస్టర్ ట్రైనర్ల ద్వారా గ్రామస్థాయి ట్రైనర్లకు యోగ శిక్షణ తరగతులు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈనెల 27వ తేదీ నుండి 31వ తేదీ వరకు షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు ఎంపిక చేసిన నిర్ణీత ప్రదేశాల్లో మాస్టర్ ట్రైనర్లు గ్రామస్థాయి ట్రైనర్లకు శిక్షణ ఇస్తారన్నారు. గ్రామాల్లో స్థానికంగా ఉన్న యోగ సంఘాల శిక్షకులను, యోగ నిర్వహించే యోగ శిక్షకులను,
ఆసక్తి ఉన్న క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులను గ్రామస్థాయి ట్రైనర్లుగా శిక్షణ పొందేందుకు గుర్తించాలన్నారు.
ప్రజల్లో యోగ పై అవగాహన కలిగించేందుకు ఈ నెల 27వ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు.
జిల్లాలో గుర్తించిన 4 ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు.
ఇందులో భాగంగా ఈనెల 31వ తేదీన మంగినపూడి బీచ్ లో, వచ్చే జూన్ నెల 6 వ తేదీన కూచిపూడి లోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం లో, జూన్ 13 వ తేదీన ప్రముఖ గౌతమ బుద్ధ క్షేత్రమైన ఘంటసాల లో, జూన్ 19 వ తేదీన మోపిదేవి లోని శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ప్రత్యేకంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
వచ్చే జూన్ 13వ తేదీన జిల్లాస్థాయిలో జూనియర్లకు, యువతకు, సీనియర్లకు యోగా పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా యోగ పై వ్యాసరచన, గీతాలు, చిత్రలేఖనము, యోగా బృందము, షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ, క్విజ్, గోడపత్రాలు, నినాదాలు, స్కిట్, రంగోలి వంటి పోటీలు నిర్వహిస్తామన్నారు. అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతి ప్రధానం చేయడం జరుగుతుందన్నారు. ఈ యోగా కార్యక్రమాల్లో యోగా గురువులు, యోగ శిక్షకులు, యోగ స్వచ్ఛంద కార్యకర్తలు, ఆసక్తి కలిగిన వారు, యోగ సాధకులు, సాధారణ ప్రజలు అందరూ విరివిగా పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
Prajavartha Online Telugu News