మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే జూన్ నెల 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని విశాఖపట్నంలో జరిగే యోగ కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటుండడం రాష్ట్రానికే గర్వకారణంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆరోజున రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది ప్రజానీకం పాల్గొనే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణాజిల్లాలో దాదాపు 8 లక్షల మంది పాల్గొనే విధంగా ఈనెల 21వ తేదీ నుండి వచ్చే జూన్ నెల 21వ తేదీ వరకు పలు యోగా కార్యక్రమాలు జరిగే విధంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈనెల 25వ తేదీ ఆదివారం వరకు సెలవులో ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె చంద్రశేఖర రావు తదితర జిల్లా అధికారులకు యోగేంద్ర కార్యక్రమంపై దిశా నిర్దేశం చేశారు.
వాస్తవానికి జిల్లా కలెక్టర్ గత సంవత్సరం జూలై మాసంలోనే యోగా సాధన వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించి యోగ కార్యక్రమం పై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా అధికారులతో సహా ఉద్యోగులందరికీ యోగాసభ ఆధ్వర్యంలో యోగా గురువులు చింతయ్య ఆధ్వర్యంలో యోగ శిక్షణా తరగతులను మొదట్లో నగరంలోని జెడ్పీ కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేశారు. కలెక్టర్గా ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ శిక్షణా తరగతుల్లో తాను స్వయంగా పాల్గొంటూ యోగా సాధన చేసి అందరికీ స్ఫూర్తినిచ్చారు. అనంతరం నగరంలోని ఉదయపు నడక మిత్రమండలి భవనంలో జరిగే శిక్షణ తరగతుల్లో కూడా జిల్లా కలెక్టర్ క్రమం తప్పకుండా పాల్గొంటూ యోగా సాధన కొనసాగించారు.
ఇటీవల సెలవుల్లో వెళ్ళిన తరువాత సోమవారం మరల యోగాసభ ఆధ్వర్యంలో నగరంలో ఉదయం నడక మిత్రమండలి భవనంలో నిర్వహించే యోగ సాధనలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యోగా ప్రోటోకాల్ ప్రకారం వజ్రాసనం, త్రికోణాసనం, వజ్ర శశాంకాసనం, అర్థ ఉష్ట్రాసనం, పూర్ణ ఉష్ట్రాసనం వంటి వివిధ రకాల ఆసనాలు, ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు చాలా చక్కగా ఖచ్చితమైన పద్ధతిలో చేసి అందరికీ ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
కలెక్టర్గా ఎంతో పని ఒత్తిడి ఉన్న లెక్కచేయకుండా యోగ ప్రోటోకాల్ అనుసరించడం చెప్పుకోదగ్గ విశేషం. జిల్లా కలెక్టర్ ను ఆదర్శంగా తీసుకొని అధికారులు ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ప్రజలందరూ కూడా మన ఆరోగ్యం మన చేతిలో ఉంది అనే నినాదంతో యోగాంధ్ర కార్యక్రమంలో విరివిగా పాల్గొని జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు ముందడుగు వేయాల్సి ఉంది.
యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ పేరును నమోదు చేసుకుని వచ్చే జూన్ 21వ తేదీన జరిగే యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు సంసిద్ధం కావాల్సి ఉంది. ఈనెల 21వ తేదీ 27వ తేదీ మంగళవారం ఉదయం ఏడు గంటల నుండి నగరంలోని జడ్పీ కన్వెన్షన్ హాల్ నుండి సాయిబాబా దేవాలయం వరకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో యోగ పై పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది ఈ ర్యాలీలో అధికారులు తోపాటు ఉద్యోగులతో పాటు యోగ గురువులు శిక్షకులు యోగా సంస్థలు ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున విరివిగా పాల్గొని జయప్రదం చేయాల్సి ఉంది. ఈనెల 27వ తేదీ నుండి 31వ తేదీ వరకు మండలాల స్థాయిలో గ్రామస్థాయి ట్రైనర్లకు యోగ పై శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.
అనంతరం గ్రామస్థాయి ట్రైనర్లు యోగ పై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కలిగిస్తారు. ఈనెల 31వ తేదీన మంగినపూడి బీచ్ లో, 6 వ తేదీన నాట్య కళాక్షేత్రమైన కూచిపూడి లోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రంలో, 13వ తేదీన ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన ఘంటసాలలో, 19 వ తేదీన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రాంగణంలో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
Prajavartha Online Telugu News