-ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని పండుగ వాతావరణం లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలి.
-మొక్కల పెంపకం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ 5 వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 5 లక్షల మొక్కలు నాటేలా మెగా కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు సమన్వయం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్ కలెక్టర్ ఛాంబర్ నుంచి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కల పెంపకం పై జిల్లా అటవీశాఖ అధికారి వివేక్, డ్వామా పి డి శ్రీనివాస ప్రసాద్, డి పి ఓ సుశీలదేవి సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మిషన్ హరితాంధ్రప్రదేశ్ వనం మనం కార్యక్రమంలో భాగంగా జూన్ 5 వ తేదీన నిర్వహించనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం లో మొక్కలు నాటే మెగా కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. ఈ సంవత్సరం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం ప్రపంచీకరణ అనే థీమ్ తో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ముందుగా జిల్లాలోని అన్ని మండలాలు మున్సిపాలిటీ పరిధిలో మొక్కలు నాటేందుకు గుంతలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. చెట్ల పెంపకం పర్యావరణ పరిరక్షణకు చాలా అవసరమని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అని తెలిపారు. కావున నాటే ప్రతి మొక్క బ్రతికేలా చూసుకోవాని తెలిపారు. అటవీశాఖ అధికారులు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం మరియు ఇతర కార్యకలాపాలను సిద్ధం చేసుకొని లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటేలా చూడాలని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వ భూములలో రోడ్లకు ఇరు వైపుల మొక్కలు నాటడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఏపీడీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తమ పరిధిలో ఉన్న మండల గ్రామస్థాయిలో వివిధ రకాల మొక్కల పంపిణీకి సంబంధించిన సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. తోటల పెంపకంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు అధికారులు సమన్వయం చూసుకోవాలని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం సంబంధించి చిన్న గొట్టికల్లు , ఎర్ర వారి పాలెం మండలంలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుందని, అక్కడ నిమ్మకాయల తోటల పెంపకం ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగం కావచ్చు అని పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News