Breaking News

రేషన్ దుకాణాలతో పారదర్శక ప్రజా పంపిణీ

-29,761 రేషన్ షాపుల ద్వారా 1.46 కోట్ల కుటుంబాలకు సరుకుల పంపిణీ
-రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటు
-65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల ఇళ్ల వద్దకే రేషన్‌
-రేషన్ దుకాణాల ద్వారా పంపిణీతో ప్రభుత్వానికి రూ. 385 కోట్లు ఆదా
-పిఠాపురం పట్టణంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 

పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకే ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా సరకుల పంపిణీ చేపడుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌  తెలిపారు. రాష్ట్రంలో 1.46 కోట్ల కుటుంబాలకు 29,761 రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీకి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. లబ్ధిదారులు రైస్ కార్డు నమోదైన డీలర్ దగ్గరే కాకుండా… తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఏ రేషన్‌ షాపు నుంచైనా సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించామని చెప్పారు. ఇంటింటికీ రేషన్ పేరిట గత ప్రభుత్వం దాదాపు రూ.17 వందల కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేస్తే… రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీతో దాదాపు రూ.385 కోట్ల ప్రజా ధనం ఆదా అవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా రేషన్ డీలర్లు పని చేయాలని సూచించారు.
ఆదివారం ఉదయం పిఠాపురం పట్టణంలో గాంధీ బొమ్మ సెంటర్ నూకాలమ్మ గుడి వీధిలో చౌకధరల దుకాణం వద్ద రేషన్ సరకుల పంపిణీని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్  మాట్లాడుతూ… “రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణంలో రేషన్ షాపులను పునః ప్రారంభించడం ఆనందంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 29,761 రేషన్ షాపులకుగానూ 24,795 షాపులు ఈ రోజు ఉదయం నుంచి సరుకుల పంపిణీని ప్రారంభించాయి.
ఆదివారాల్లోనూ సరుకుల పంపిణీ
ప్రతి నెలా 1 నుంచి 15 తేదీలోపు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్‌ దుకాణాలు తెరిచే ఉంటాయి. ఆదివారాల్లోనూ సరుకులు పంపిణీ చేస్తాం. ఆ సమయంలో ఎప్పుడైనా లబ్ధిదారులు రేషన్‌ తీసుకునే వీలుంటుంది. గతంలో మాదిరి వాహనం కోసం పనులు మానుకుని ఇళ్ల వద్దే ఉండాల్సిన అవసరం లేదు. వీలున్న సమయంలో రేషన్ దుకాణాల దగ్గరకు వెళ్లి సరకులు తెచ్చుకోవచ్చు. దివ్యాంగులకు, 65 ఏళ్లు నిండిన వృద్ధులకి ప్రతి నెలా 5వ తేదీలోపు సరుకులు ఇళ్ల వద్దే అందిచేలా చర్యలు తీసుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 15.6 లక్షల మంది ఉన్నట్లు గుర్తించాం. వారికి రేషన్ అందించే బాధ్యత రేషన్ దుకాణదారులదే. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. రేషన డెలివరీ అయిన వెంటనే అందులో ఫోటో అప్ లోడ్ చేసేలా డీలర్లకు ఆదేశాలు జారీ చేశాం.
భవిష్యత్తుల్లో మరిన్ని మార్పులు
తూకాల్లో వ్యత్యాసం ఉన్నా, సరుకులు లేవని తిప్పి పంపినా డీలర్లపై చర్యలు తీసుకుంటాం. డీలర్లు ఈ-పోస్‌, వేయింగ్‌ మెషీన్ల పని తీరును ముందుగానే పరిశీలించుకోవాలి. సాంకేతిక సమస్యలు ఎదురైతే ప్రత్యామ్నాయ మార్గాల్లో సరుకుల పంపిణీ చేయాలి. సరుకుల పంపిణీ సమాచార కోసం కొత్తగా ఒక యాప్ ను డిజైన్ చేశాం. ఏ రోజు ఎంత రేషన్ పంపిణీ చేశాం..? ఎంత మందికి అందించాం? వంటి విషయాలు ఎప్పటికప్పుడు నమోదయ్యేలా చూస్తున్నాం. లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించేలా రేషన్ షాపుల్లో వద్ద భవిష్యత్తులో మరిన్ని మార్పులు తీసుకొస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. లబ్ధిదారులకు ఏదైనా సమస్య తలెత్తితే సులువుగా ఫిర్యాదు చేసేలా షాపు వద్దే క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నాం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
అన్ని పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం చేస్తాం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ మాఫియాకు చెక్ పెట్టాం. ఎక్కడికక్కడ మాఫియా కోరలు పీకేశాం. కాకినాడ, విశాఖ పోర్టుల నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి కాకుండా పటిష్టభద్రత ఏర్పాటు చేశాం. రైస్ స్మగ్లింగ్ చేసిన వారిపై పీడీ యాక్ట్ తీసుకొచ్చాం. కాకినాడ పోర్టు దగ్గర ఏర్పాటు చేసినట్లే… నెల్లూరు జిల్లా తడ వద్ద, కృష్టపట్నం పోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశాం. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ఎక్కడా పక్కదారిపట్టకుండా చర్యలు తీసుకుంటున్నాం” అన్నారు.
శ్రీ సకిలేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన
అంతకుముందు పిఠాపురం పట్టణంలో సకిలేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. వేదపండితులు శాస్ర్తోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే  పంతం నానాజీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, కాకినాడ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ ఛైర్మన్  తుమ్మల బాబు, పిఠాపురం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే  పెండెం దొరబాబు, పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, సివిల్ సప్లైస్ శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *