-ప్రజారోగ్య పరిరక్షణ దృష్ణ్యా మిల్లెట్ల పంపిణీ
-బలమైన ప్రజా పంపిణీ వ్యవస్థను వైసీపీ నిర్వీర్యం చేసింది
-స్వలాభం కోసం ఎం.డి.యూ. వ్యవస్థను సృష్టించింది
-మూలనపడ్డ ఎండీయూ వాహనాలతో సరుకులు పంపిణీ చేసినట్లు దొంగ లెక్కలు
-ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా డీలర్లు పనిచేయాలి
-కాకినాడ రూరల్ నియోజకవర్గం వాకలపూడిలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
-65 ఏళ్లు దాటిన వృద్దుడికి ఇంటికెళ్లి సరుకుల పంపిణీ
కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో భవిష్యత్తులో రేషన్ దుకాణాలను మినీ మాల్స్ గా మారుస్తాం. బియ్యం ఒక్కటే కాకుండా రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటి చిరు ధాన్యాలు అందించే ఏర్పాటు చేస్తామ’ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29,761 రేషన్ షాపుల ద్వారా ఉదయం నుంచి మొదటి నాలుగు గంటల్లో 8.15 లక్షల కుటుంబాలకు రేషన్ సరుకులు అందించినట్లు వెల్లడించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసమే రేషన్ దుకాణాల ద్వారా సరకుల పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఆదివారం కాకినాడ రూరల్ నియోజకవర్గం వాకలపూడిలో చౌక ధరల దుకాణం వద్ద రేషన్ సరకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కృష్ణంశెట్టి గోపాల్ అనే వృద్ధుడు ఇంటికి వెళ్లి స్వయంగా రేషన్ సరకులు అందించారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ అనేది దశాబ్ధాలుగా బలమైన వ్యవస్థ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్న నిర్ణయం. ఈ వ్యవస్థ ప్రతి గ్రామం, వార్డులో బలంగా నాటుకుపోయింది. ఆదివారాలు, పండగలతో సంబంధం లేకుండా ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచే ఉంచి సరుకులు పంపిణీ చేసేవారు. అటువంటి వ్యవస్థను గత ప్రభుత్వం నాశనం చేసింది.
రూ.1650 కోట్లు దుర్వినియోగం
వైసీపీ పాలనలో ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యమైంది. దశాబ్ధలుగా చక్కగా నడుస్తోన్న వ్యవస్థను వైసీపీ నాయకులు స్వలాభం కోసం పక్కదారి పట్టించారు. ప్రజలు ప్రశ్నించలేని విధంగా గత ఐదేళ్లు పాలన సాగింది. ఇంటింటికి రేషన్ పేరిట ప్రజా ధనం దాదాపు రూ.1650 కోట్లు ఖర్చు చేసి 9260 ఎండీయూ వాహనాలు కొనుగోలు చేశారు. ఈ వాహనాల వల్ల వినియోగదారులకు ఎటువంటి ప్రయోజనం కలుగకపోగా, బియ్యం అక్రమ రవాణాకు దారి తీసింది. ఎండీయూ వాహనాలు ఎప్పుడు ఎక్కడికి వస్తాయో ఎవరికీ సరైనా సమాచారం ఉండేది కాదు. వీధి చివర ఒక గంట నిలబడి వెళ్లిపోయేవారు. రేషన్ ఎందుకు ఇవ్వలేదని మహిళలు ఆవేదనతో అడిగితే మేము వెయిట్ చేశాం… మీరే రాలేదని సమాధానం చెప్పేవారు. మూడు రేషన్ దుకాణాల నుంచి ఎండీయూ వాహనాలు సరుకులు తీసుకునేవి. ఆ సరుకులు ఎవరికి పంపిణీ చేశారో లెక్కాపత్రం ఉండేది కాదు. వైసీపీ హయాంలో అవినీతి ఏ స్థాయిలో ఉండేది అంటే ఐదు నెలల నుంచి మూలన పడ్డ వాహనాలు కూడా రేషన్ డెలివరీ చేసినట్లు లెక్కలు చూపించారు. మేము ఉదయం నుంచి కష్టపడితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8.15 లక్షల కుటుంబాలకు రేషన్ సరుకులు అందించాం. అదే వైసీపీ హయాంలో ఒక్క రోజులోనే ఇంటింటికి వెళ్లి 93 శాతం రేషన్ అందించామని లెక్కలు చూపించి ప్రజలను మభ్య పెట్టేవారు.
ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పని చేయాలి
రేషన్ డీలర్లను గత ప్రభుత్వం ఏ విధంగా వేధించిందో మనందరం చూశాం. వారి ఆత్మగౌరవం పెంచేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రేషన్ డీలర్లు కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీయే ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలి. ప్రభుత్వం పక్షాన నిలబడి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందో అది నెరవేరేలా కృషిచేయాలి. రేషన్ దుకాణాల్లో ధరల బోర్డులు, స్టాక్ బోర్డులు, పోస్టర్ల ప్రదర్శన సరైన విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఏ సమస్య వచ్చినా డిపో వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అధికారులకు సమాచారం ఇవ్వాలి.
ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం
2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తాం. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు రూ.1670 కోట్లు ధాన్యం బకాయిలుపెడితే వాటిని కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే చెల్లించింది. భారతదేశంలో ఏ రాష్ట్రమూ కొనుగోలు చేయని విధంగా రూ. 12,400 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. దాదాపు 8 లక్షల మంది రైతులకు 24 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ చేశాం. రైతులు మిల్లులకు వెళ్లి ధాన్యం ఇచ్చి వచ్చే లోపు డబ్బులు వారి ఖాతాల్లో జమ చేశాం. ఒకటో తేదీనే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్నాం. దీపం పథకం ద్వారా ఇప్పటికే మహిళలకు రెండో సిలిండర్ అందించాం. దీని కోసం రూ. 894 కోట్లు కేటాయించాం. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా… వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. వైసీపీ విష ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి కూటమి పార్టీ నాయకులు, శ్రేణులు ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి” అని కోరారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, కాకినాడ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల బాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఏపీ ఎస్.ఐ.డి.సి. చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, సివిల్ సప్లైస్ శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News