గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధి పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు టెండర్ నిబంధనల మేరకు నాణ్యతాప్రమాణాలు పాటిస్తూ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 85.08 లక్షలతో అభివృద్ధి పనులు నిర్వహించడానికి శంకుస్తాపన చేయడం జరిగిందని నగర మేయర్ కోవేలమూడి రవీంద్ర తెలిపారు. బుధవారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 57, 1, 3వ డివిజన్లలో 85.08 లక్షలతో సి.సి రోడ్లు మరియు సి.సి డ్రైన్లు ఏర్పాటు చేయుటకు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు నసీర్ మహ్మద్ తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, గుంటూరు తూర్పు, పశ్చిమ మరియు ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ప్రజావసరాల దృష్టిలో పెట్టుకొని స్థానిక శాసనసభ్యుల ప్రతిపాదనల మేరకు పలు అభివ్రుద్ది పనులు చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గుంటూరు నగరంలో పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామన్నారు. అభివృద్ధి పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు నిర్దేశిత సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలన్నారు. నగరంలో చిన్నపాటి వర్షానికే రోడ్ల పైకి వర్షపు నీరు నిలుస్తూ స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీటిని దృష్టిలో అవసరమైన ప్రాంతాలలో రోడ్లు మరియు డ్రైన్లు నిర్మిస్తున్నామన్నారు. గుంటూరు నగరంతో పాటు నగరంలో విలీన గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంలో నిర్వహించుటకు చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో గుంటూరు నగరాభివ్రుద్దికి కట్టుబడి ఉన్నామన్నారు.
ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ మహమ్మద్ మాట్లాడుతూ, గుంటూరు నగర పాలక సంస్థలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాక తూర్పు నియోజకవర్గంలోని శివారు కాలనీలలో ప్రజల సౌకర్యార్ధం మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా నూతనంగా డ్రైన్లు, రోడ్లు నిర్మించుటకు శంకుస్థాపనలు చేశామన్నారు. అలాగే గుంటూరు నగరం రాజధాని అమరావతి పరిధిలో ఉన్నందున భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పలు అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు.
సదరు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీల, వివిధ డివిజన్ల కార్పోరేటర్లు ఈ.ఈ సుందర్రామిరెడ్డి, బి.జే.పి నాయకులు, టి.డి.పి, జనసేన నాయకులు, ఇంజనీరింగ్ అధికారులు, సచివాలయాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News