విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్టార్ ఓల్డ్ ట్రాక్టర్స్ స్క్రాప్ మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని శివనాథ్ ను పశ్చిమ నియోజకవర్గంలోని గణపతి రావు రోడ్డు లో గల ఎంపీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం కలిశారు. ఎంపీ కేశినేని శివనాథ్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇస్లాంపేట బిఆర్పి రోడ్డులో దాదాపు 50 సంవత్సరాల నుంచి స్క్రాప్ ఐరన్ మార్కెటు ఉందని ఈ మార్కెట్లో దాదాపు 100 షాపులు ఉన్నాయని తెలియజేశారు. అయితే రోడ్లు పై సామానులు పెట్టడం వల్ల ట్రాఫిక్ కి ఇబ్బంది కలుగుతుందనే కారణంతో అటు కార్పొరేషన్ అధికారులు, ఇటు పోలీసు అధికారులు తమ సామాన్ల ను రోడ్ల పై నుంచి తొలగించాలని ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ కు తెలిపారు. ప్రభుత్వం తమకు స్థలం చూపిస్తే ఆ స్థలంలోకి షాపులు మార్చుకుంటామని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి ఒక మెమోరాండం తో వస్తే ప్రభుత్వంతో మాట్లాడి స్థలం మంజూరు అయ్యేందుకు కృషి చేస్తానన్నారు. అంతవరకు ట్రాక్టర్ స్క్రాప్ మర్చంట్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా వెసులు బాటు కల్పించాలని సంబంధిత అధికారులతో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, అసోసియేషన్ అధ్యక్షులు షేక్ చాంద్, అబ్దుల్ జలీల్, యూసఫ్ ఖాన్, హబీబుర్రహ్మాన్, అన్సార్ , అబ్దుల్ రకీబ్, అబ్దుల్ హది అబ్దుల్ సలాం, అబ్దుల్ ఖయ్యూం , అల్తాఫ్ హుస్సేన్ , మొహమ్మద్ జాబీర్, ఆదం ఖాన్, తదితర సభ్యులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News