Breaking News

భ‌యం నీడ‌లో జ‌గ‌న్‌రెడ్డి!

-అనుచిత వ్యాఖ్య‌ల‌పై మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆగ్ర‌హం
-పోలీస్ వ్యతిరేక వ్యాఖ్యలపై అయనపై కేసు పెట్టాలి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఐదేళ్లుగా ముఖ్య‌మంత్రిగా ఉండి, నేడు గుర్తింపులేని విప‌క్ష నాయ‌కుడిగా మిగిలిపోయి, అధికారం కోసం ఆరాట‌ప‌డే జ‌గ‌న్ రెడ్డి ప్ర‌ణాళికా బ‌ద్ధంగా అనుచిత వ్యాఖ్య‌ల‌కు దిగ‌జారుతున్నార‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్
ధ్వ‌జ‌మెత్తారు. గురువారంనాడు నెల్లూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో జ‌గ‌న్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న భ‌యం నీడ‌లో కొట్టుమిట్టాడుతున్న‌ట్లు వెల్ల‌డించాయిన నేడొక ప్ర‌క‌ట‌న‌లో మంత్రి వ్యాఖ్యానించారు.

మ‌ద్యం కుంభ‌కోణంలో వేలాది కోట్ల రూపాయ‌ల మేర‌కు ప్ర‌భుత్వ ఖ‌జానాకు న‌ష్టం క‌లిగించిన పాత్ర‌ధారులంద‌రూ తెర‌పైకొచ్చి సూత్ర‌ధారి ఎవ‌రో వెల్ల‌డ‌య్యే త‌రుణంలో జ‌గ‌న్ రెడ్డి అనుచిత వ్యాఖ్య‌ల్ని అర్ధం చేసుకోవాల‌ని మంత్రి  స‌త్య‌కుమార్ యాద‌వ్ తెలిపారు. ప‌క‌డ్బందిగా సాగుతున్న సిట్ విచార‌ణ‌లో ఇటీవ‌ల ఒక ‘డెన్’ లో రూ.11 కోట్ల భారీ నిధులు దొర‌క‌డంతో జ‌గ‌న్‌రెడ్డిలో వ‌ణుకు ప్రారంభ‌మైన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని మంత్రి వ్యాఖ్యానించారు.

6 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్య‌క్తిపై కేసులా?

మ‌రి 9 సార్లు ఎమ్మెల్యేగా, 14 సంవ‌త్స‌రాలు ముఖ్య‌మంత్రిగా చేసిన చంద్ర‌బాబు సంగ‌తేమిటి?

త‌ప్పులు చేసిన వారికి మ‌ద్ద‌తుగా చేప‌ట్టిన నెల్లూరు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చేసిన వ్యాఖ్య‌ల‌పై మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డిని మంత్రి  స‌త్య‌కుమార్ యాద‌వ్ నిల‌దీశారు. ఒక మ‌హిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డికి మ‌ద్ద‌తుగా జ‌గ‌న్ మాట్లాడ‌డంపై మంత్రి ఆగ్ర‌హాన్ని వెలిబుచ్చారు. 6 సార్లు ఎమ్మెల్యేగా చేసిన
ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డిపై కేసులు పెట్ట‌డం తప్పు అని బ‌హిరంగంగా వ్యాఖ్యానించిన మాజీ సిఎంకి అధికారంలో ఉండి అరాచ‌కాలు చేసే స‌మ‌యంలో చంద్ర‌బాబును హ‌డావుడిగా అరెస్టు చేసి జైలుకు పంపినప్పుడు చంద్ర‌బాబు 9 సార్లు ఎమ్మెల్యేగా, 14 సంవ‌త్స‌రాలు ముఖ్య‌మంత్రిగా చేసిన వాస్తవం తెలీదా అని మంత్రి నిల‌దీశారు. సొంత పార్టీకి చెందిన ర‌ఘురామ కృష్ణంరాజును పోలీసులు కుళ్లబొడిచిన‌పుడు ఆయ‌న లోక్ స‌భ స‌భ్యుల‌న్న సంగ‌తి ఎలా మ‌రిచార‌ని మంత్రి ప్ర‌శ్నించారు. అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నాయ‌కులు అచ్చ‌న్నాయుడు, కొల్లు ర‌వీంద్ర వంటి ప‌లువురిని అక్ర‌మ కేసుల‌తో వేధించిన‌పుడు వారివారి గ‌తాలు స్ఫుర‌ణ‌కు రాలేదా అని మంత్రి నిల‌దీశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న‌ల‌ను అక్ర‌మంగా అడ్డుకున్న‌ప్పుడు జ‌గ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ప్రజాస్వామ్యాన్ని ఏవిధంగా పాత‌రేశార‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆగ్ర‌హాన్ని వెలిబుచ్చారు.

కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ మొద‌ల‌గువారిని జ‌గ‌న్‌రెడ్డి ప‌ర‌మ ప‌విత్రులుగా వ‌ర్ణించ‌డాన్ని మంత్రి ఎద్దావా చేశారు. దిగ‌జారుడు వ్యాఖ్య‌ల‌తో జ‌గ‌న్‌రెడ్డి త‌న రాజ‌కీయ ప్ర‌మాణాల‌ను , ప్ర‌జాస్వామ్య వ్య‌తిరేక ధోర‌ణుల‌ను, ప్ర‌భుత్వ ఖ‌జానాను కొల్ల‌గొట్టే విధానాల‌ను మ‌రోసారి వెల్ల‌డించుకున్నార‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ దుయ్య‌బ‌ట్టారు. రాజ‌కీయాల్లో ఇటువంటి వ్య‌క్తి మనుగ‌డతో వాటిల్లే తీవ్ర న‌ష్టాన్ని ప్ర‌జ‌లు నిత్యం గ‌మనించాల‌ని మంత్రి కోరారు.

జ‌గ‌న్‌రెడ్డి నైజాన్ని తెలుసుకున్న ప్ర‌జ‌లు
ఐదేళ్ల పాల‌న‌లో త‌న అస్త‌వ్య‌స్త‌, తిరోగ‌మ‌న‌, ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌తో శాస‌న‌స‌భ‌లో 11 సీట్ల‌కు ఘోర ప‌త‌నం చెందిన జ‌గ‌న్‌రెడ్డి, ప్ర‌జ‌లంతా త‌న‌వైపే ఉన్న‌ట్లు, అది వెల్ల‌డికాకుండా కూట‌మి ప్ర‌భుత్వం కుట్ర‌లు చేస్తున్న‌ట్లు త‌లాతోకా లేని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని స‌త్య‌కుమార్ యాద‌వ్ విరుచుకుప‌డ్డారు. ఆయ‌న‌ను కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఆయ‌న భ‌విత‌ను విజ్ఞులైన రాష్ట్ర ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తార‌ని, ఐదేళ్ల పాల‌న‌లో జ‌గ‌న్ నిజ‌స్వ‌రూపాన్ని తెలుసుకున్న ప్ర‌జ‌లు ఆయ‌నకు మ‌ద్ద‌తివ్వ‌ర‌ని ప్ర‌జాస్వామ్య‌వాదులు, సంక్షేమ‌, అభివృద్ధిగాముకుల ప్ర‌గాఢ విశ్వాస‌మ‌ని మంత్రి అన్నారు.

జ‌గ‌న్‌రెడ్డి ఆంత‌ర్య‌మేమిటి? సానుభూతి కోస‌మా ?
ఆయ‌న‌పై కేసు పెట్టాలి

ఇటీవ‌లి కాలంలో జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌ణాళికాబ‌ద్ధ‌మైన వ్యాఖ్య‌లు ఆయ‌న అంత‌రంగాన్ని వెల్ల‌డిస్తున్నాయ‌ని మంత్రి అన్నారు. మ‌ద్యం కుంభ‌కోణంలో వాస్త‌వాలు వెల్ల‌డ‌య్యే కొద్దీ జ‌గ‌న్‌రెడ్డి త‌న‌ను తాను ఆవిష్క‌రించుకుంటున్నార‌ని, ఇందులో భాగంగా ఆయ‌న‌లో నెల‌కొన్న భ‌యం బ‌య‌ట‌ప‌డుతోంద‌ని మంత్రి అన్నారు. చంద్ర‌బాబును అరెస్ట్ చేయించిన పాపం జ‌గ‌న్‌రెడ్డిని తీవ్రంగా వెంటాడుతోంద‌ని మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు.

మాజీ సిఎం జ‌గ‌న్‌రెడ్డిని అరెస్టు చేయాల‌న్న డిమాండ్ ప‌లు వ‌ర్గాల్లో స్ప‌ష్టంగా విన‌ప‌డుతోంద‌ని, ఈ నేప‌థ్యంలో సానుభూతికోసం జ‌గ‌న్ రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు వెల్ల‌డ‌వుతోంద‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ తెలిపారు. 6 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్య‌క్తిపై కేసులు పెట్ట‌డం త‌ప్పు అంటూ…మాజీ సిఎం అయిన తనపై కేసులు పెట్ట‌డం కూడా త‌ప్పే అనే విధంగా జ‌గ‌న్‌రెడ్డి వ్యాఖ్యానించ‌డాన్ని మంత్రి తూర్పార‌బ‌ట్టారు.
చంద్ర‌బాబును అక్ర‌మంగా 53 రోజుల పాటు జైలులో పెట్టిన వ్య‌క్తి ఈ విధంగా మాట్లాడ‌డం రోజురోజుకీ జ‌గ‌న్‌లో పేరుకుపోతున్న భ‌యాన్ని వెల్ల‌డిస్తోంద‌ని మంత్రి అన్నారు. ఈ భ‌యంతో ఆయ‌న ప్ర‌జ‌ల సానుభూతి కోసం నానా పాట్లు ప‌డుతున్నార‌ని మంత్రి అన్నారు.

పోలీసులు మాఫియానా?
రాష్ట్రంలో డిఐజిల నేతృత్వంలో పోలీసు మాఫియా ఏర్ప‌డి వ‌సూళ్లు చేసి వాటాలు పంచుతున్నారంటూ జ‌గ‌న్‌రెడ్డి ప‌దేప‌దే వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించే పోలీసు వ్య‌వ‌స్థ‌ను ప్ర‌జ‌ల్లో చుల‌క‌న చేసి, వ్య‌వ‌స్థ నైతిక స్థైర్యాన్ని, విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ‌తీసే ఈ వ్యాఖ్య‌ల్ని రాజ‌ద్రోహంగా ప‌రిగ‌ణించి జ‌గ‌న్‌రెడ్డిపై కేసు న‌మోదు చేసే విష‌యాన్ని ప‌రిశీలించే త‌రుణం అస‌న్న‌మైంద‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అభిప్రాయ‌ప‌డ్డారు.

రాజ్యాంగ విలువ‌లు, చ‌ట్ట‌బ‌ద్ధ పాల‌న‌పై కూట‌మి ప్ర‌భుత్వానికి అపార‌మైన విశ్వాసముంద‌ని, ఏనాడూ క‌క్ష సాధింపు ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రించ‌మ‌ని, చ‌ట్టం త‌న ప‌ని తాను చేస్తుంద‌ని, ప్ర‌జాస్వామ్య విలువ‌ల ప‌ట్ల జ‌గ‌న్‌రెడ్డి మొస‌లి క‌న్నీరును ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌ర‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వాన్ని , ప్ర‌జ‌ల్ని రెచ్చ‌గొట్టే ధోర‌ణిలో జ‌గ‌న్‌రెడ్డి మాట్లాడ‌డం త‌గ‌ద‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ హిత‌వు ప‌లికారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *