Breaking News

పామర్రు మండలంలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి

పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి గురువారం పామర్రు మండలంలో పలు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. పామర్రులో, వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహం, అదేవిధంగా నిమ్మకూరులోని నందమూరి లక్ష్మయ్య వెంకట్రావమ్మ గురుకుల విద్య పాఠశాల, కళాశాల వసతిగృహం, పామర్రు మండలం ఎన్టీఆర్ కాలనీలోని అంగన్వాడి కేంద్రం, కంచర్లవానిపురం అంగన్వాడి కేంద్రం, జుజువరం ప్రైమరీ స్కూల్లో భోజన వసతులు, అదేవిధంగా పామర్రు గ్రామంలో యడ్ల అప్పారావు నిర్వహిస్తున్న ఉచిత రేషన్ పంపిణీ కేంద్రం సందర్శించి తనిఖీ చేశారు.ఈ క్రమంలో ఆయన ఆయా వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారికి అందుతున్న భోజన వసతులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సూచించిన అల్పాహారంలో మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

నిమ్మకూరు గురుకుల పాఠశాలలో నెలకు 35 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా, ఒకేసారి 120 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయడంతో నిల్వ బియ్యానికి పురుగులు పట్టి పాడైపోతున్నట్లు చైర్మన్ దృష్టికి తీసుకురాగా, సంబంధిత పై అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య పునరావృతం కాకుండా చూడాలని, అదేవిధంగా విద్యార్థులకు చిక్కి సరఫరా కావడం లేదని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు మెనూలో సూచించిన పరిమాణం ప్రకారం చికెన్ అందించాలని వసతి గృహ నిర్వాహకులకు సూచించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకము, అంగన్వాడీ వ్యవస్థ, సంక్షేమ వసతి గృహాలు, పీఎం మాతృ వందనం పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మొదటి డెలివరీకి రూ. 5 వేలు, రెండవ డెలివరీకి ఆడపిల్ల అయితే రూ. 6 వేలు ఇచ్చే పథకాలను ప్రధానంగా ఫుడ్ కమిషన్ పర్యవేక్షిస్తుందన్నారు.

ప్రభుత్వం నుండి ఉన్నత పాఠశాల స్థాయి వరకు ఒక్కో విద్యార్థికి నెలకు రూ. 14 వందలు, అదేవిధంగా ఇంటర్మీడియట్ కంటే పై చదువులు చదువుతున్న విద్యార్థులకు రూ. 16 వందలు వస్తున్నాయని తెలిపారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఐరన్, పోలిక్ యాసిడ్, బి 12 తదితర విటమిన్లతో కూడిన బియ్యాన్ని పాఠశాలకు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం వారంలో మూడు రోజులు చికెన్, ఆరు రోజులు గుడ్డు భోజనంలో విద్యార్థులకు అందించాల్సి ఉందని, అదేవిధంగా సాయంత్రం స్నాక్స్, ఉదయం పాలు, రాత్రి ఫ్రూట్స్ అందించేలా కమిషన్ పర్యవేక్షిస్తుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో పలు అంగన్వాడి కేంద్రాలను సందర్శించిన ఆయన పిల్లల హాజరు రిజిస్టర్లు, గర్భిణి, బాలింతల పౌష్టికాహార తదితర రికార్డులు, నిల్వ స్టాకు క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీ చేశారు. పిల్లల కోసం వండిన ఆహారాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. గర్భిణీ బాలింత తల్లులకు గుడ్లు, పాలు, బియ్యం తదితర సరుకులను ఇస్తున్నారా లేదా అని నేరుగా లబ్ధిదారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు కనుకున్నారు.

జిల్లా పౌర సరఫరాల అధికారి జి మోహన్ రావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జి రమేష్, ఏపీ ఆర్ జె సి కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ కుమారి, ఆయా వసతి గృహాల వార్డెన్లు శివలక్ష్మి, నాగాంజనేయులు, అంగన్వాడి సూపర్వైజర్లు ఎస్ విజయ్ కుమారి, ఎం సత్య శ్రీ, అంగనవాడి కార్యకర్తలు తదితరులు చైర్మన్ వెంట ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *