ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉయ్యూరులోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ వసతి గృహ పాఠశాలను రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన తన సిబ్బందితో గురువారం ఉదయం ఉయ్యూరులోని రాజేంద్ర నగర్ లో గల బాలుర గిరిజన సంక్షేమ వసతి గృహ పాఠశాలతో పాటు అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత ఆయన గిరిజన సంక్షేమ వసతి గృహ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. మధ్యాహ్నం భోజనం పథకం ఎలా ఉంటుందని ఆయన ఆరా తీయగా, వారంలో రెండు సార్లు చికెన్, గుడ్డు, పాలు, సాయంత్రం పూట స్నాక్స్, రాత్రిపూట పండ్లు ఇస్తున్నారని, వార్డెన్ తమను బాగా చూసుకుంటున్నారని విద్యార్థులు చైర్మన్కు తెలిపారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇక్కడ కల్పిస్తున్న వసతులను వారి గ్రామాల్లోని ఇతర పిల్లలకు వివరించి అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా వివరించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఆయన వసతి గృహంలో వంటగది, స్టోర్ రూమ్ లను పరిశీలించి, విద్యార్థులకు సిద్ధం చేసిన అల్పాహారాన్ని రుచి చూశారు. ఉప్మా రుచిగా ఉందని, వసతి గృహాన్ని మంచిగా నిర్వహిస్తున్నది చైర్మన్ ప్రిన్సిపల్ ను ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం ఆయన అదే పాఠశాలకు సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల హాజరు రిజిస్టర్, గర్భిణి, బాలింతల పౌష్టికాహారం, స్టాకు నమోదు తదితర రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీ చేశారు. ఎక్కువమంది పిల్లలు అంగన్వాడికి వచ్చే విధంగా పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆయన ఈ సందర్భంగా అంగన్వాడి కార్యకర్త, సూపర్వైజర్లకు సూచించారు.
జిల్లా పౌర సరఫరాల అధికారి జి మోహన్ రావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి, ప్రిన్సిపాల్ కృష్ణ మోహన్, అంగన్వాడి సూపర్వైజర్ రాఘవమ్మ, అంగన్వాడి కార్యకర్త ఎం కనకరత్నం తదితరులు చైర్మన్ వెంట ఉన్నారు.
Prajavartha Online Telugu News