-జిల్లా కలెక్టర్ వెంటేశ్వర్ హామీ..
-శెట్టిపల్లి భూముల డిజైనింగ్, మ్యాపింగ్ పూర్తి చేసాం.
-తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శెట్టిపల్లి భూముల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తున్నామని జిల్లా కలెక్టర్ వెంకటేస్వర్ వెల్లడించారు. మంగళవారం తిరుపతి తుడా కార్యాలయంలో శెట్టిపల్లి భూముల సమస్యలపై తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఇతర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా శెట్టిపల్లి భూముల రైతులు, ఫ్లాట్స్ కొనుగోలుదారులు జిల్లా కలెక్టర్ ను, తుడా చైర్మన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. శెట్టిపల్లి భూముల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారని కలెక్టర్ తెలియజేశారు. శెట్టిపల్లి భూములపై ఇప్పటివరకు 60కి పైగా కేసులు నమోదయున్నాయని అయినా కూడా ప్రజల ప్రయోజనం దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళుతున్నామని వివరించారు. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కూడా శెట్టిపల్లి భూముల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని గుర్తు చేశారు. వీలైనంత త్వరగా రైతులకు, ప్లాట్ కొనుగోలుదారులకు భూములను అప్పగించడం జరుగుతుందన్నారు.
తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏళ్ల తరబడి పరిష్కారం కానీ శెట్టిపల్లి భూముల సమస్య తన మొదటి అజండగా తీసుకొని తాను తుడా ఛైర్మెన్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి గారితోను, జిల్లా ఇన్చార్జి మంత్రి తో చర్చించి ఒక కొలిక్కి తీసుకువచ్చామని తెలియజేశారు. ఇప్పటికే భూములు మ్యాపింగ్, డిజైనింగ్ పూర్తి చేసామని కార్పొరేషన్ నుంచి తుడా కు ఈ శెట్టిపల్లి భూముల ఫైల్ బదిలీ అయిన వెంటనే ప్రభుత్వ అనుమతితో భూములను లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.
Prajavartha Online Telugu News