మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని వ్యవసాయ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యూరియా సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డీఆర్వో కే చంద్రశేఖరరావు, ఏఎస్పీ సత్యనారాయణ, ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానంగా చెరువుల్లో నీటిని నింపటం, ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహాభియాన్, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, పిల్లల సంరక్షణ కేంద్రాలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సమస్యలు, యూరియా లభ్యత, ఆన్లైన్ పోర్టల్ లో వివిధ ప్రభుత్వ శాఖల డాక్యుమెంట్స్ అప్లోడ్ పురోగతి, పారిశుద్ధ్యం, మహిళల రక్షణ తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లతో చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో యూరియా లభ్యతపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పరిస్థితులను వివరిస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నామని, గరిష్ట ధరకే అమ్మే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా యూరియా సక్రమంగా పంపిణీ జరిగే విధంగా పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ బృందాలచే తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, యూరియా పక్కదారి పట్టకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అదేవిధంగా మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజూ ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేపట్టే విధంగా అవసరమైన చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కలెక్టర్ తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి ఎన్ పద్మావతి, డి ఆర్ డి ఎ పి డి హరిహరనాథ్, మార్క్ఫెడ్ డిఎం మురళీ కిషోర్, జెడ్పి డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, డ్రైనేజీ శాఖ ఈఈ కిరణ్ కుమార్ తదితర శాఖల అధికారులు కలెక్టర్ తో పాటు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News