ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్/నెహ్రూ యువ కేంద్ర సంస్థ, ఏలూరు కార్యాలయంలో గత 15 సంవత్సరాలుగా అకౌంట్స్ అండ్ ప్రోగ్రామ్ సూపర్వైజర్‌గా సేవలందించిన ఎం.వి. శివకుమార్ శనివారం పదవీ విరమణ చేసిన సందర్భంలో, కార్యాలయ సిబ్బంది, జాతీయ సేవా కార్యకర్తలు మరియు యువజన సంఘాల ప్రతినిధులు ఘన సన్మానం నిర్వహించారు .
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి సుంకర రాము మాట్లాడుతూ… తనకు ఏలూరు జిల్లా యువజన అధికారి బాధ్యతలు స్వీకరించి మూడు నెలలే అయినప్పటికీ, శివకుమార్ తో అత్యంత సన్నిహిత సంబంధం ఏర్పడిందని, వారి నుంచి ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నారు. శివకుమార్ క్రమశిక్షణ, అంకితభావం నేటి యువతకు ఆదర్శమని, ఆయనతో కలిసి పని చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
శివకుమార్ మాట్లాడుతూ… తాను 1988 డిసెంబర్‌లో గుంటూరులో నెహ్రూ యువ కేంద్ర (ప్రస్తుత మేరా యువ భారత్ పరిధి కార్యక్రమాలు)లో చేరి, 2000లో విజయవాడకు, 2011 జూన్‌లో ఏలూరుకు బదిలీ అయి, మొత్తం సుమారు 37 సంవత్సరాలపాటు సేవలందించినట్లు తెలిపారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే, ఎంతోమంది యువతతో కలిసి పనిచేయడం తనకు గర్వకారణమని, రాష్ట్రస్థాయి–జాతీయస్థాయి కార్యక్రమాలలో పాల్గొనటంతోపాటు నిర్వహణ బాధ్యతల్లోనూ భాగస్వామ్యమయ్యానని చెప్పారు. గత 15 ఏళ్లుగా ఏలూరులో జాతీయ సమైక్యత శిబిరాలు, జాతీయ కార్యకర్తల శిక్షణ శిబిరాలు, అంతర్రాష్ట్ర యువ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాలు, NYKS/MY భారత కార్యక్రమాలు వంటివి జిల్లా యువత మరియు అధికారుల సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ జిల్లాలోనే రిటైర్ అవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
నవజ్యోతి యూత్ క్లబ్ అధ్యక్షులు చింతా గోపాలకృష్ణ మాట్లాడుతూ… యువజన సంఘాలను బలోపేతం చేయడం, డాక్యుమెంటేషన్ ప్రమాణాలు, నిర్వహణ పుస్తకాలు తదితర విషయాలపై శివకుమార్ ఇచ్చిన మార్గనిర్దేశం వల్ల తాము ఎంతో లాభం పొందామని, అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. అలాగే అక్షరం యూత్ అసోసియేషన్ అధ్యక్షులు కుసుమరత్నం, సాధన రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు ఏసుపాదం, ఆనంద మహిళా మండలి అధ్యక్షురాలు సంధ్యతో పాటు మాజీ మరియు ప్రస్తుత జాతీయ సేవా కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది పాల్గొని శివకుమార్ ని ఘనంగా సత్కరించారు.
Prajavartha Online Telugu News