-దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ అందింస్తున్నాం…
-జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పారదర్శంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామని, దివ్యాంగులు 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా తెలిపారు.
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ విధానన్ని మంగళవారం జాయింట్ కలెక్టర్ ఇలక్కియా గొల్లపూడి లోని 50 నెంబర్ రేషన్ దుకాణాన్ని పరిశీలించి దివ్యాంగురాలైన జనమల లక్ష్మీకీర్తి, ఆనరోగ్యంతో బాదపడుతున్న కనవర్తి బుజ్జి, వృద్ధురాలైన డి. ఉషారాణిలకు ఇంటివద్ద నిత్యావసర సరుకులను అందజేశారు.
ఈసందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులను కార్డుదారులకు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 957 రేషన్ షాపుల ద్వారా 5 లక్షల 90,243 కార్డుదారులకు 8వేల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. దివ్యాంగులు, 65 ఏళ్ల పైబడిన 57,వేల 690 మంది కార్డుదారులను గుర్తించామని వారికి రేషన్ డీలర్లు ద్వారా ఇంటి వద్దనే నిత్యావసర సరుకులను అందజేసే ఏర్పాటు చేశామన్నారు. రేషన్ షాపుల ద్వారా ప్రతినెలా 1 నుంచి 15వ తేదీలోగా సరుకులు సరఫరా చేయాలని డీలర్లకు ఆదేశించామన్నారు. ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ షాపులు తెరచివుంచి కార్డు దారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డీలిర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. జిల్లాలోని అన్ని రేషన్ షాపుల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దానిపై క్యూ.ఆర్.కోడ్ ఏర్పాటు చేస్తున్నామని, మొబైల్ ఫోన్ ద్వారా దీనిని స్కాన్ చేసి రేషన్ సరఫరాపై కార్డుదారులు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చని అన్నారు. పంపిణీ చేసిన రేషన్ బియ్యం నాణ్యతను కార్డుదారుల నుండి అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యమైన ఫోర్టీ ఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, రేషన్ షాప్ డీలర్లు అవకతవకులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
రేషన్ షాపు పరిశీలనలో డిఎస్ఓ ఏ.పాపారావు ఏఎస్ఓ చల్లా లక్ష్మీనారాయణ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పి.దేవప్రియుడు, కె.రమేష్, రేషన్ దుకాణాల డీలర్ విజయ్, పౌరసరఫరాల సిబ్బంది ఉన్నారు.
Prajavartha Online Telugu News