– పకడ్బందీగా యూరియా, ఎరువుల సరఫరా
– రైతులకు అండగా ఎరువులపై జనజాగృతి కార్యక్రమం
– నానో యూరియాపైనా అవగాహన కల్పిస్తున్నాం
– వదంతులు నమ్మవద్దు.. కచ్చిత సమాచారానికి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో యూరియా, ఎరువులకు ఎక్కడా కొరత లేదని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తిరువూరు రెవెన్యూ డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులతో ముచ్చటించి ప్రస్తుతం వ్యవసాయ కార్యకలాపాలు, ఎరువుల పంపిణీ, ఎరువుల వినియోగంపై మాట్లాడారు. లక్ష్మీపురంలో డ్రోన్ సహాయంతో నానో యూరియాను స్ప్రే చేసే విధానం డెమోను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 4,003 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని.. మరికొంత యూరియా మార్గమధ్యంలో ఉందని వివరించారు. వరి నాటు వేసినప్పుడు ఒకటో విడతగా ఎకరానికి 30 కిలోలు వేయొచ్చని.. నాటు వేసిన 30 రోజులకు రెండో విడతగా ఎకరానికి 30 కిలోలు, నాటు వేసిన 60 రోజులకు మూడో విడతగా ఎకరానికి 30 కిలోలు వేయొచ్చన్నారు. రెండు, మూడో విడతల్లో అధిక దిగుబడులకు, పర్యావరణ పరిరక్షణకు, నేల సారాన్ని కాపాడుకునేందుకు యూరియాకు బదులు నానో యూరియాను స్ప్రే చేసుకోవచ్చని.. ఇందుకు అవసరమైన డ్రోన్లను సమకూర్చేందుకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ భయాందోళనకు గురిచేసేలా సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవన్నారు. అన్నదాతలకు ప్రతిఒక్కరూ అండగా ఉండాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. అపోహలను నమ్మవద్దని ఏవైనా సందేహాలుంటే కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. గత మూడు రోజులుగా దాదాపు 82 వేల మంది రైతులను కలిసి ఎరువులపై అవగాహన కల్పించడం జరిగిందని.. ఆన్లైన్ ద్వారా నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. కార్యక్రమంలో తిరువూరు ఆర్డీవో కె.మాధురి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News