Breaking News

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు

-జగన్ కు మంత్రి సవిత స్ట్రాంగ్ కౌంటర్
-మెడికల్ కాలేజీలు నిర్మించడం జగన్ కు ఇష్టం లేదు..
-ఎన్ని హెచ్చరికలు చేసినా మెడికల్ కాలేజీలను నిర్మించి తీరుతాం
-బావిలో పడి ఎవరు చావాలో జనాలు ఎప్పుడో తీర్పిచ్చారు…
-ఇదేనా ఆహా…ఓహో..?
-పునాదుల దశలో ఉన్న పెనుకొండ మెడికల్ కాలేజీని చూపిస్తూ మంత్రి సెటైరు
-‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ మెగా హిట్ : మంత్రి సవిత

పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త :
పీపీపీ మోడల్ ద్వారా కూటమి ప్రభుత్వం నిర్మించతలపెట్టిన 10 మెడికల్ కాలేజీల టెండర్లలో పాల్గొనొద్దంటూ జగన్ హెచ్చరికలు చేయడం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీ బెదిరింపులకు రాష్ట్రంలో భయపడే వారెవరూ లేరు… బావిలో ఎవరి పడి చావాలో ఇప్పటికే ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పారు’ అంటూ జగన్ ను మంత్రి సవిత ఎద్దేవా చేశారు. తన నీలి మీడియాలో 17 మెడికల్ కాలేజీ నిర్మించానని ఆహా… ఓహో.. అని జగన్ రాయించుకోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని దెప్పి పొడిచారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ విజయోజత్సవ సభ మెగా హిట్ అయ్యిందని, ఇది చూసి ఓర్వలేక జగన్ విషం కక్కుతున్నాడని విమర్శించారు. పెనుకొండలో పునాదుల దశలోనే నిలిచిపోయిన మెడికల్ కాలేజీని కూటమి నాయకులతో కలిసి మంత్రి సవిత గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. 2021 లో 17 మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నానంటూ ఆనాడు జగన్ రెడ్డి ఆర్భాటంగా గాల్లో వచ్చి శంకుస్థాపన చేశారన్నారు. రెండేళ్లలో పూర్తి చేస్తామని డబ్బా కొట్టారన్నారు. ఆయన పదవీ కాలం పూర్తయినా ఏ ఒక్క మెడికల్ కాలేజీని కూడా పూర్తిస్థాయిలో నిర్మించలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం, నాబార్డు నిధులతో మాత్రమే విజయనగరం, నంద్యాల, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం మెడికల్ కాలేజీలను అసంపూర్తి నిర్మించి, ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభించేశాడని మండిపడ్డారు. పార్వతీపురం మెడికల్ కాలేజీ నిర్మాణానికి కనీసం టెండర్ కూడా పిలవలేదన్నారు. మెడికల్ కాలేజీలు మాత్రమే కాకుండా బీసీ భవనాలు, బీసీ హస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లు, ఇతర భవనాలను సైతం నిధులున్నా కూడా పూర్తి చేయలేదన్నారు. టీడీపీకి మంచి పేరు వస్తుందనే అసూయతో ఆ భవనాలను పట్టించుకోలేదన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చడం జగన్ కు తెలుసని, భవన నిర్మాణాలు మాత్రం చేతకాదని మంత్రి సవిత ఎద్దేవా చేశారు.

గతంలోనూ జగన్ అవాకులు చవాకులు

ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ ద్వారా నిర్మించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారని మంత్రి సవిత వెల్లడించారు. ఈ నిర్ణయంపై జగన్ విషం కక్కుతున్నారని ఆమె మండిపడ్డారు. ప్రజారోగ్యం మెరుగుపడడం జగన్ కు ఇష్టంలేదన్నారు. అందుకే, మెడికల్ కాలేజీల నిర్మాణానికి టెండర్లు వేస్తే, తమ ప్రభుత్వం వస్తే రద్దు చేస్తానని హెచ్చరికలు దిగుతున్నాడని అన్నారు. పోలీసులను, ఉద్యోగులను బెదిరించడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. జగన్ బెదిరింపులకు రాష్ట్రంలో భయపడేవారేవరూ లేరన్నారు. కియా పరిశ్రమ నిర్మాణం సమయంలోనూ జగన్ ఇటువంటి అవాకులు చవాకులు పేలాడని అన్నారు. కియా పరిశ్రమకు ఇచ్చిన భూములు తిరిగి ఇప్పించేస్తానని ఆనాడు చెప్పాడన్నారు. కియా, దాని అనుబంధ పరిశ్రమల వల్ల లక్షలాది మందికి ఉపాధి లభ్యమవుతోందన్నారు. జీఎస్టీ, పన్నుల రూపంలో రాష్ట్రానికి ఆదాయం వస్తోందన్నారు. కియా పరిశ్రమ వల్ల జగన్, ఆయన బ్యాచ్ ఎక్కువగా లబ్ధిపొందింది అని అన్నారు.

బావిలో పడి ఎవరు చావాలో ప్రజలు అల్రెడీ తీర్పిచ్చారు…

సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ ను, మంత్రి అచ్చెన్నాయుడునే బావిలో పడి చావాలని జగన్ అనడంపై మంత్రి సవిత తీవ్రంగా స్పందించారు. ఇదేనా ఎమ్మెల్యేగా మాట్లాడే తీరు అంటూ మండిపడ్డారు. బావిలో ఎవరి పడి చావాలో గత సాధారణ ఎన్నికల్లోనూ, ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే స్పష్టమైన తీర్పు చెప్పారని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి జగన్ కు మాట్లాడే అర్హత లేదని మంత్రి సవిత స్పష్టంచేశారు

ఇదేనా ఆహా… ఓహో అంటే..?

అంతకుముందు కూటమి నాయకులతో కలిసి పెనుకొండలోని పునాదుల దశలోనే నిలిచిపోయిన మెడికల్ కాలేజీని మంత్రి సవిత పరిశీలించారు. అక్కడికి వచ్చిన మీడియా కూడా మెడికల్ కాలేజీ దుస్థితిని చూపించారు. తన సొంత నీలి మీడియాలో మెడికల్ కాలేజీలను నిర్మించానంటూ కథనాలు రాయించుకోవడంపై జగన్ ను విమర్శించారు. ఇదేనా ఆహా… ఓహో….? అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబునాయుడు 27 మెడికల్ కాలేజీలు నిర్మించారన్నారు. టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే రాష్ట్రంలో వైద్య విద్య అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలను నిర్మించి తీరుతామని మంత్రి సవిత స్పష్టంచేశారు.

‘సూపర్ సిక్స్- సూపర్ హిట్’ మెగా హిట్

అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన సూపర్ సిక్స్- సూపర్ హిట్ విజయోత్సవ సభ మెగా హిటయ్యిందని మంత్రి సవిత ఆనందం వ్యక్తంచేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి భారీ సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలొచ్చారన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంద, ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేశామని వెల్లడించారు. సంక్షేమంతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి కూడా పరుగులు తీస్తోందన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సీసీ, బీటీ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *