-మొట్టమొదటి సారిగా తిరుపతి జిల్లాలో ఈ నెల 14,15 న ‘’మహిళా సాధికారతపై పార్లమెంటు మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు” నిర్వహణ
-ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్య దేవర
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
లోక్ సభ స్పీకర్ ఆలోచనతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్య దేవర తెలిపారు. తిరుపతి జిల్లాలో ఈ నెల 14,15 న ‘’మహిళా సాధికారతపై పార్లమెంటు మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు” నిర్వహణపై స్థానిక రాహుల్ కన్వెన్షన్ సెంటర్ నందు శుక్రవారం మద్యాహ్నం పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ పాత్రికేయులతో మాట్లాడుతూ పార్లమెంటులో మహిళా స్వశక్తీకరణ కమిటీ ఒక జాయింట్ కమిటీ అని, ఇందులో 20 మంది లోక్ సభ సభ్యులు 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారన్నారు. సాధారణంగా లోక్ సభ సభ్యుల్లో ఒకరు కమిటీకి ఛైర్ పర్సన్ గా ఉంటారని, ప్రస్తుతం పురందేశ్వరి గారుఈ కమిటీకి చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నారన్నారు. ఇటువంటి కమిటీలే అనేక రాష్ట్రాల శాసనసభల్లో, శాసనమండలిలో ఉంటాయన్నారు. మన రాష్ట్రంలో కూడా ఇది ఒక సంయుక్త కమిటీ, ముగ్గురు శాసన మండలి సభ్యులు, తొమ్మిది మంది శాసనసభ్యులతో పాటు, మన రాష్ట్రంలో సంయుక్త కమిటీ గౌరు చరితా రెడ్డి గారు చైర్పర్సన్ గా వ్యవహరిస్తారన్నారు. ఇలానే అనేక రాష్ట్రాల్లో శాసనసభల్లో కమిటీ ఉన్నాయన్నారు.
గతంలో ఏ కమిటీకి ఆకమిటీ ఏరాష్ట్రానికి ఆరాష్ట్రం తమంత తాముగా పని చేసుకుంటూ ఉండేదని, మిగతా రాష్ట్రాల్లో కమిటీలు ఎలా పనిచేస్తున్నాయని ఎప్పుడన్నా ఈ కమిటీ వేరే రాష్ట్రంలో పర్యటనకువెళ్లి అక్కడ జరుగు విషయాలను తెలుసుకునేవారన్నారు. ఆ రాష్ట్రం లో జరుగు కమిటీలలో వాళ్ళు అవకాశం ఇస్తే చర్చించి వాటిపై అవగాహన కల్పించుకోవడం జరుగుతుందన్నారు. ఈ లోపాన్ని పూరించడానికి లోక్ సభ స్పీకర్ గారు ఈ సంవత్సరం కొత్తగా ఒక ఒరవడి మొదలెట్టారన్నారు. దేశంలో ఉన్న అన్ని కమిటీల్లో ఒకొక్క సబ్జెక్ట్ మీద ఒక రాష్ట్రంలో సమావేశపరిచి వాళ్లతో కలిసి చర్చించి ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నారన్నారు. ఈ క్రమంలో మొట్టమొదటి 2 నెలల క్రితం ఎస్టిమేట్ కమిటీ మీటింగ్ మహారాష్ట్ర లో గతనెలలో ఎస్.సి, ఎస్.టి కమిటీ మీటింగ్ భువనేశ్వర్లో జరిగిందని, ఈ క్రమంలో మూడవ సమావేశం మహిళా స్వశక్తీకరణ, మహిళా కమిటీల సంక్షేమ సమావేశం మన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల మధ్య జరగాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సంప్రదించి ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతో, ప్రోత్సాహంతో లోక్ సభ ఆమోదం తెలిపిందన్నారు. లోక్ సభ మార్గదర్శకత్వంలో రెండు రోజుల పాటు సభలు నిర్వహించడం జరుగుతుందని, లోక్ సభ స్పీకర్ స్వయంగా ప్రారంభ సమావేశానికి మరియు ముగింపు సమావేశానికి అధ్యక్షత వహిస్తారని, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని, మన రాష్ట్రం నుండి మొదటి రోజు 14 వ తారీకు ఉదయం 10:30 కి సమావేశం ప్రారంభమౌతుందన్నారు. ఈ కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరి వంశ్, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, రాష్ట్ర మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, లోక సభ కమిటీ చైర్పర్సన్ పురందేశ్వరి, మన రాష్ట్ర కమిటీ చైర్పర్సన్ గా గౌరు చరితారెడ్డి వీరందరూ వేదిక పైనుండి ప్రారంభ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. లోక్ సభ స్పీకర్ గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ప్రారంభోపన్యాసం చేస్తారన్నారు. అందరివీ క్లుప్తంగా ప్రసంగాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. వచ్చిన అతిధుల గౌరవార్థం ఇదే ప్రాంగణంలో ముఖ్యమంత్రి గారు అతిధులకు మద్యాహ్నం విందు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఇదే ప్రాంగణంలో మద్యాహ్నం ప్రిలిమినరీ సెషన్స్ ఉంటాయని, ఒక రెండు మూడు థీమ్స్ మీద కూలంకషంగా చర్చిస్తారన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రం నుండి మొత్తము కమిటీలు హాజరవ్వడం సాధ్యం కానందున, ప్రతి కమిటీ నుంచి ప్రతి రాష్ట్రం నుంచి నలుగురు సభ్యులు ఒక చైర్పర్సన్ చొప్పున నామినేట్ చేయాలని స్పీకర్ గారు తెలిపారన్నారు. ఆయా రాష్ట్రాలనుండి పాల్గొనే సభ్యులందరూ కూర్చుని ప్లీనరీలో థీమ్స్ మీద చర్చించి చివరికి ముగింపులో 15 తారీకు ఒక తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉందన్నారు. 15వ తారీకు ఉదయం ముగింపు సమావేశానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర గవర్నర్ గారు హాజరౌతారనన్నారు. కార్యక్రమం అనంతరం అతిధులందరినీ ముగింపు సమావేశం తర్వాత శ్రీ కాళహస్తి దర్శనం కొరకు తీసుకుని వెళ్ళే ఆలోచనలో ఉన్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరి సహకారంతో విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Prajavartha Online Telugu News