-6వ జూనియర్ & సీనియర్ – సి నేషనల్ యోగాసన ఛాంపియన్షిప్ ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్
-దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన 1500 మందికి పైగా క్రీడాకారులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో క్రీడా వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్, ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో 6వ జూనియర్ & సీనియర్ – సి నేషనల్ యోగాసన ఛాంపియన్షిప్ – 2025-26 పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 1 వరకు నాలుగు రోజులపాటు జరగనున్న ఈ జాతీయస్థాయి పోటీలకు దేశం నలుమూలల నుంచి పలు రాష్ట్రాలకి చెందిన 1500 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సారధ్యంలో, యోగాసన భారత్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ యోగాసనాలు శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. విజయవాడలో జాతీయ స్థాయి పోటీలు జరగడం గర్వకారణమని అన్నారు.యోగాసన క్రీడలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చాయని తెలిపారు. అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా విశాఖపట్నం వేదికగా జరిగిన యోగాసన సాధన గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిత్యం యోగ సాధన చేయడం వల్ల దీర్ఘకాలిక రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుందని ఎంపీ తెలిపారు. అనంతరం పలువురు క్రీడాకారులు ప్రదర్శించిన యోగాసనాలను ఎంపీ కేశినేని శివనాథ్ ఆసక్తిగా తిలకించి, వారిని అభినందించారు.
కార్యక్రమంలో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి రామకృష్ణ, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఎ.రాధిక, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ పి.ప్రేమకుమార్, యోగాసన భారత్ కోశాధికారి రచ్చిత్ కౌశిక్, కాంపీటీషన్ డైరెక్టర్ అభిజిత్ బోస్ జీ, యోగాసన భారత్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ జయంతి, జాయింట్ సెక్రటరీ వికాస్ గోస్వామి, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డి.దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News