గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రక్షిత నీటి పథకాల వివరాలను పూర్తి స్థాయిలో సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, డి.ఆర్.డి.ఏ కార్యక్రమాలపై కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. ప్రతి నీటి పథకం వసతులు, ఫిల్టర్ రకము, ఎన్ని ఆవాసాలకు సరఫరా చేస్తున్నది, పథకం వివరాలను సవివరంగా సమర్పించాలన్నారు. జిల్లాలో ఉన్న 234 నీటి పథకాల వారీగా డేటాను అందించాలని చెప్పారు. నీటి పథకాలు శుభ్రపరిచిన తేదీలు, శుభ్రపరిచే విధానాన్ని కూడా పొందుపరచాలని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ నుండి జిల్లా తాగునీటికి చేస్తున్న విషయాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. జిల్లాలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు కార్యాచరణను సమర్పించాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఆదేశించారు. పరిశుభ్రమైన గ్రామాలు లక్ష్యంగా గ్రామ పంచాయతీలు పనిచేయాలని ఆదేశించారు. చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
డి.ఆర్.డి.ఏ క్రింద బ్యాంక్ లింకేజి, ఉన్నతి విభాగాలలో ప్రగతి రావాలన్నారు. నూతన యూనిట్లను నెలకొల్పడంలో దృష్టి కేంద్రీకరించాలని, మహిళలను పారిశ్రామిక రంగంలో ముందంజ వేయుటకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని ఆదేశించారు.
జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద వివిధ పనులను చేపడుతున్నామని వివరించారు.
జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్ మాట్లాడుతూ జిల్లాలో చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలు 216 ఉండగా వాటిలో 214 కేంద్రాలు పని చేస్తున్నాయని చెప్పారు. జిల్లాలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లను ఆరు ప్రదేశాల్లో పెట్టుటకు ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు.
డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి. విజయ లక్ష్మి మాట్లాడుతూ జీవనోపాధులపై ఎక్కువ దృష్టి సారిస్తున్నామన్నారు. కొన్ని రైల్వే స్టేషన్ లలో దుకాణాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. పొన్నూరులో చిరు ధాన్యాల క్లస్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. తాడికొండ ప్రాంతంలో పచ్చళ్ళ తయారీకి కామన్ ఫెసిలిటీ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించామని అన్నారు. మునగ పంటను ఐదు ప్రాంతాల్లో సాగు చేయుటకు కార్యాచరణ రూపొందించామని చెప్పారు.
ఈ సమావేశంలో డివిజనల్ అభివృద్ధి అధికారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News