-9/77 చట్ట సవరణ విరమించుకోండి!!
-ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల చర్చ వేదిక డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 10వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలి సమావేశంలో 9/ 77 భూ బదలాయింపు నిషేధిత చట్టాన్ని సవరించి ఆమోదం తెలిపింది. పేదలకు ఓ వరం లాంటి ఈ చట్టాన్ని సవరణ చేసి అసైన్డ్ భూములను 99 సంవత్సరాల లీజుకు ఇస్తామని ప్రకటించడం ఎవరికోసమని, పేదల దగ్గర ఉన్న భూములను పదో,పడుకో ఇచ్చి లాక్కోవడానికి ఈ ప్రయత్నం జరుగుతున్నదని ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు చర్చా వేదిక కార్యక్రమంలో తీవ్రంగా ఖండించాయి . ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలోని బాలోత్సవ భవన్లో చర్చ వేదిక కార్యక్రమం జరిగింది. ఈ చర్చా వేదిక కార్యక్రమానికి ఉభయ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు,దడాల సుబ్బారావులు అధ్యక్షత వహించారు. ఈ చర్చా వేదిక కార్యక్రమంలో ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్సులు వి వెంకటేశ్వర్లు తీర్మానం ప్రవేశపెట్టగా, ఆ తీర్మానాన్ని బలపరుస్తూ ఆవుల శేఖర్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఈ చట్ట సవరణ బడుగు బలహీన వర్గాలకు వరం లాంటిదని రాష్ట్రాన్ని పునరుత్పాదక ఇంధన కేంద్రంగా మార్చడంలో పేద రైతులు భాగస్వాములు అవుతారని,తద్వారా వచ్చే పరిశ్రమలలో పేద రైతుల పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయని, మొత్తంగా పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దవచ్చని చెప్పడం చాలా విడ్డూరమని అన్నారు. నిజానికి ఈ సవరణ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అని వారు ప్రశ్నించారు, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అసైన్ చేసినటువంటి భూములను కారు చౌకగా కొట్టేసి పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్లకు అప్పనంగా ఇవ్వడానికి 99 సంవత్సరాలు లీజుకు ఇస్తామని చెప్పడం,ఎన్నికల తర్వాత పేదలను మోసం చేయడమే అవుతుందని వారు తీవ్రంగా దుయ్యబట్టారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి ఎన్నికల తర్వాత పేదల దగ్గర ఉన్న అసైన్ భూములను 26 లక్షల ఎకరాలు భూ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. భూ బదలాయింపు నిషేధిత చట్టంలో స్పష్టంగా అసైన్ భూములను ఎటువంటి అన్యాక్రాంతం చేయరాదని ఎటువంటి లీజుకు, కౌలుకు ఇవ్వకూడదని, అమ్మకాలు, కొనుగోలు చేయకూడదని స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ,ఆ నిబంధనలు పేదలకు మాత్రమేనని, కార్పొరేట్లకు ఇవ్వడానికి ఆ నిబంధనలు వర్తించని చెప్పకనే చెప్పినట్లు చట్ట సవరణ చేయడం పేద ప్రజలను మోసం చేయడం కాదా అని వారు ప్రశ్నించారు. దాదాపు 34 లక్షల ఎకరాల భూములు అసైన్మెంట్ చేసి భూములు పేదలకు పట్టాలు ఇచ్చినప్పటికీ, అందులో ఇప్పటికే 13 లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని, వాటిని తిరిగి తీసుకొని పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇంకా ప్రభుత్వం దగ్గర మిగులు భూములు,ఇతర ప్రభుత్వ భూములు లక్షలాది ఎకరాల భూములు పేదలకు పంచవలసి ఉన్నప్పటికీ వాటిని పంచకుండా, 2013 సంవత్సరం నుంచి పూర్తిగా దాట వేస్తూ పేదలను అన్ని ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. 99 సంవత్సరాలు లీజు పేరుతో పేదల దగ్గర నుండి భూములు తీసుకుంటే ఈ రాష్ట్రంలో పేదరికం తీవ్రంగా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో నూటికి 60 మంది పేదలు దగ్గర భూములు లేవని కేంద్ర గణాంకాల ద్వారా అర్థమవుతున్నది. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది తప్ప తగ్గదని వారు తీవ్రంగా హెచ్చరించారు. చేసిన చట్ట సవరణను విరమించుకోవాలని, లేనిపక్షంలో ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్తులో అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరావువులు మాట్లాడుతూ మాట్లాడుతూ కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు జరిపినట్లయితే ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంత ఇంటికి స్థలము, సాగుభూమికి ఇబ్బంది ఉండదని అన్నారు. ప్రస్తుతం కోనేరు రంగారావు భూకమిటీ సిఫారసులు ఓ మూలకు చెత్తబుట్టలో వేశారని అన్నారు. 1977 లో పేదల కోసం పట్టుబట్టి పేదల ఆశాజ్యోతి యస్ ఆర్ శంకరన్ 9/77 అసైన్డ్ భూముల భూ బదలాయింపు నిషేధిత చట్టాన్ని తెచ్చారు. పేదల భూములకు రక్షణ కవచంగా ఉన్న ఈ చట్టాన్ని గత 20 సంవత్సరాలు నుండి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయి. దీనికి పరాకాష్టగా కూటమి ప్రభుత్వం గుండెకాయ లాంటి సెక్షన్ 6 క్లాసు సవరించింది. ఈ సవరణ వల్ల ఇప్పటికే అక్రమంగా, దౌర్జన్యంగా అనుభవిస్తున్న పెత్తందారులకు, కార్పొరేట్లకు 99 సంవత్సరాలు లీజు పేరుతో భూములు కట్టబెట్టేందుకు పూనుకుంటున్నారన్నారు. అసైన్మెంట్ భూములు పేదల చేతుల్లోనే ఉండాలని వారు అన్నారు.ఈనెల 27వ తేదీ ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సీసీఎల్ఏ ఆఫీస్ ముందు గ్రామీణ కష్టజీవులను కూడగట్టి ఆందోళనకు పూనుకుంటున్నామని వారు తెలిపారు. ఈ చర్చా వేదిక కార్యక్రమంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర నాయకులు వెంకటరెడ్డి, గణేష్,ఏఐకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశవరావు, సూర్యారావు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర నాయకులు హరిబాబు, డివైఎఫ్ఐ రామన్న, ప్రజానాట్యమండలి నాయకులు అనిల్ సిఐటియు రాష్ట్ర నాయకుల సుబ్బారావమ్మ, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా జిల్లాల వ్యవసాయ కార్మిక సంఘంBKMU నాయకులు కాబోతు ఈశ్వరరావు,ఉప్పెననరసింహారావు,ఏలూరు,కృష్ణా జిల్లాల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకురాలు శివ నాగరాణి వందన సమర్పణ చేశారు.
Prajavartha Online Telugu News