-ఉమ్మీద్ పోర్టల్ గడువు పొడిగింపు పై కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ
-14 వేలకు పైగా ఉన్న ఆస్తుల డిజిటలైజేషన్ కు వక్ఫ్ బోర్డ్ సిద్ధంగా ఉంది
-షేక్ అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మీద్ చట్టం అమలు ప్రారంభ దశలో ముతవల్లిల నిరసన, న్యాయపరమైన అనిశ్చితి అలాగే ఉమ్మీద్ పోర్టల్ లో నెలకొన్న సాంకేతిక సమస్యల వలన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 4,748 రిజిస్టర్డ్, 10 వేల కి పైగా అన్‌రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తుల డిజిటైజేషన్ ప్రక్రియ తీవ్రంగా నెమ్మదించిందని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ప్రస్తుత గడువుతో వేలాది వక్ఫ్ ఆస్తుల డేటా అప్‌లోడ్ పూర్తి చేయడం కష్టంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ నెమ్మదింపుతో ముస్లిం సమాజంలో ఆందోళన పెరిగిందని తెలిపారు. ఈ మొత్తం పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు నివేదించగానే ఆలస్యం చేయకుండా ఉమ్మీద్ పోర్టల్ అప్లోడ్ గడువును మరో 12 నెలలు పొడిగించమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు జీ కి లేఖ రాశారని వివరించారు. చంద్రబాబు వేగవంతమైన నిర్ణయం వక్ఫ్ ఆస్తుల రక్షణపై రాష్ట్ర ప్రభుత్వ స్పష్టమైన, కట్టుదిట్టమైన ధోరణిని చూపుతుందని తెలిపారు. వక్ఫ్ ఆస్తుల డిజిటైజేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఏ ఒక్క ఆస్తి డేటా కూడా మిస్ కాకుండా అన్నీ వివరాలను కచ్చితంగా నమోదు చేస్తున్నామని తెలిపారు. వక్ఫ్ ఆస్తులు ఒక తరానికి చెందినవి కాదని తరతరాలకు రక్షించాల్సిన విశ్వాస సంపదని, వాటి రక్షణ తమ కర్తవ్యమే కాదు కట్టుబాటు అని అన్నారు. మొత్తం 14 వేలకు పైగా ఉన్న వక్ఫ్ ఆస్తుల డిజిటైజేషన్‌ను పూర్తి చేసి భద్రపరచడానికి వక్ఫ్ బోర్డు సిద్ధంగా ఉందని అన్నారు.
Prajavartha Online Telugu News