– డిసెంబర్ 2వ తేదీ వరకు నిర్వహణ
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నదాతల సాధికారత లక్ష్యంగా సోమవారం నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు “రైతన్నా! మీకోసం.. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
సోమవారం కలెక్టర్ లక్ష్మీశ.. వ్యవసాయ, వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో రైతన్నా! మీకోసం… పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక సాధనానికి మూల స్థంభమైన వ్యవసాయ రంగ పరిపుష్టికి, స్వర్ణాంధ్ర @2047 సాధనకు, రైతును రాజును చేసేందుకుగాను గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు అద్దం పడుతూ రాష్ట్రములోని అన్ని రైతుసేవాకేంద్రాల పరిధిలో రైతు సేవా కేంద్రం సిబ్బంది, వ్యవసాయ అనుబంధ శాఖలు, శాస్త్రవేత్తల సమన్వయంతో 24.12.2025 నుండి 02.12.2025 వరకు “ రైతన్నా! మీకోసం “ కార్యక్రమము ద్వారా ఇంటింటికి వెళ్ళి రైతులను ప్రత్యక్షముగా కలిసి ముఖ్యమంత్రి గారి సందేశం, మరియు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని తెలుపుతూ కరపత్రం అందజేయడంతో పాటు , ముఖాముఖి చర్చ కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. తద్వారా కొత్త ఆలోచనలు పంచుకుంటూ, మార్పునకు నాంది పలకడానికి, మరియు రానున్న ఐదు సంవత్సరాల్లో స్వర్ణాంధ్ర దిశగా ఐదు విధానాలతో కార్యాచరణ రూపొందించడానికి, అమలు చేయడానికి ప్రభుత్వానికి అన్నదాతల తోడ్పాటు కోసం ఈ కార్యక్రమము ఉపయోగపడుతుందన్నారు.
ముఖ్యంగా నీటిభద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, వ్యవసాయంలోకి సాంకేతికతను చొప్పించడం, పండించిన పంటల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ మరియు ఇవి సాధించడానికి ప్రభుత్వం నుండి అన్నదాత సుఖీభవ- పి యమ్ కిసాన్, రాయితీపై విత్తనాలు లాంటి తదితర ఆర్ధిక మద్ధతు కల్పించడం వంటి అంశాల గురించి ప్రతీ రైతుకు తెలియజేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రముము నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయంతో పాటు, ఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెంచడం, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, సమర్థ నీటి వినియోగానికి ప్రతి నీటిబొట్టును సద్వినియోగ పరచడానికి బిందు సేద్యాన్ని ప్రోత్సహించడం, వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రాయితీపై కంబైన్డ్ హార్వెస్టర్లు మరియు డ్రోన్లను అందించడం, ధాన్యం కొనుగోలు చేయడం, పంటల సాగులో కృత్రిమ మేధస్సును ఉపయోగించడం ద్వారా మరింత కచ్చితమైన సమాచారంతో చీడపీడల నుండి నష్ట నివారణ, తద్వారా ఖర్చులు తగ్గించడం, చేపల రొయ్యల పెంపకందార్లకు రాయితీపై విద్యుత్ సరఫరా చేయడం, ప్రతి నియోజకవర్గంలో రైతు బజార్లు, పట్టణ ప్రాంతంలో మొబైల్ రైతుబజార్లు ఏర్పాటు చేయడం లాంటి ప్రభుత్వం అందించే వివిధ ప్రోత్సాహాలను రైతులకు తెలియజేయడం జరుగుతుందన్నారు.
Prajavartha Online Telugu News